టిబెట్ సరిహద్దు వివాదంలో మన దేశం ఎందుకు దూకుడుగా వ్యవహరించాలి

 టిబెట్ సరిహద్దు వివాదంలో మన దేశం ఎందుకు దూకుడుగా వ్యవహరించాలి

మన మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ లోపాయికారీ సహకారంతో చైనా చట్టవిరుద్ధంగా టిబెట్‌ను ఆక్రమించినప్పటి నుంచీ భారత్-టిబెట్ సరిహద్దు వివాదాస్పదంగా మారింది.ఈ వివాదం వినాశకరమైన 1962 యుద్ధానికి దారితీసింది. నెహ్రూ ప్రభుత్వం యొక్క గుడ్డి విదేశాంగ విధానం కారణంగా సర్వసన్నద్ధత లేని  భారత సైన్యం ఆ యుద్ధంలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.1962 ఓటమి ఒక భూతంలాగా ఇప్పటికీ మన దేశాన్ని వెంటాడుతూనే ఉంది. మానససరోవరం సరస్సు సమీపంలో ఉన్న భారతీయ భూభాగాలను కోల్పోవడం గురించి ఎవరూ మాట్లాడరు.చివరికి భారత ప్రభుత్వం వారి పటాలు కూడా చైనీస్ ఆక్రమిత లడఖ్ ప్రాంతాన్ని మాత్రమే చూపిస్తాయి కాని మానససరోవరం సరస్సు సమీపంలో ఉన్న మిన్సార్ గ్రామానికి చెందిన భారతీయ భూభాగాన్ని చూపించవు. 

కానీ మన హక్కు ఉన్న ప్రాంతం మానససరోవరం సమీపంలోని మిన్సార్ గ్రామంతోనే (సుమారు 300 చదరపు మైళ్ళు) ఆగదు.ప్రస్తుత పశ్చిమ టిబెట్ భూభాగమైన న్గారి 1684 వరకు లడఖ్ రాజ్యంలో భాగంగా ఉండేది. కైలాస పర్వతం మరియు మానససరోవరం ఈ రాష్ట్రంలోనే భాగంగా ఉండేవి. టిబెట్ 1680లలో లడఖ్‌పై దండెత్తినపుడు 1684లో రెండు రాజ్యాల మధ్య జరిగిన టింగ్‌మోస్గాంగ్ శాంతి ఒప్పందంలో భాగంగా న్గారి భూభాగాన్ని పశ్చిమ టిబెట్ రాష్ట్రంగా ఇచ్చారు.కానీ ఈ ఒప్పందం ప్రకారం మానససరోవరం సరస్సు సమీపంలో ఉన్న మిన్సార్ రెవెన్యూ గ్రామాన్ని లడఖ్ లో భాగంగానే ఉంచారు. 

డోగ్రా రాజ్యం లఢఖ్ ను స్వాధీనం చేసుకున్నప్పుడు మిన్సార్ కూడా డోగ్రా పాలనలోకి వచ్చి స్వాతంత్య్రం వచ్చేవరకు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఒక భాగంగానే ఉండింది.1684లో టిబెట్ రాజ్యం కైలాస పర్వతం & మానస సరోవరాన్ని ఆక్రమించుకోవడాన్ని గుర్తు పెట్టుకున్న జనరల్ జోరావర్ సింగ్ కు ఈ భారీ విజయం సంతృప్తినివ్వలేదు. అందువల్ల ఆయన న్గారిపై దాడి చేసి తక్లాకోట్‌ను ఆక్రమించి 1841 లో కైలాష్,మానససరోవరాలను భారత పాలనలోకి తీసుకువచ్చాడు. టిబెటన్లు అప్పటి చైనా సామ్రాజ్యం యొక్క సహాయాన్ని కోరారు. 1841 శీతాకాలంలో చైనా & టిబెట్ రాజ్యాల సంయుక్త దళాలు డోగ్రా దళాలను ఓడించాయి. తక్లాకోట్ సమీపంలో జరిగిన యుద్ధంలో జనరల్ జోరావర్ సింగ్ చంపబడ్డాడు. డోగ్రా దళాలు బలవంతంగా వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. చైనా-టిబెటన్ మిత్రరాజ్యాల దళాలు లడఖ్‌లోని డోగ్రా కోటలను ముట్టడించాయి. జమ్మూ నుండి వచ్చిన డోగ్రా దళాలు ఆక్రమణ దళాలను తిప్పికొట్టి చుషుల్ వద్ద వారిని ఘోర పరాజయం పాలుజేశారు.1842లో చుషుల్ ఒప్పందంతో ఈ యుద్ధం ముగిసింది. ఈ ఒప్పందంలోనే ప్రస్తుతం ఉన్న లడఖ్ మరియు టిబెట్ మధ్య ఉన్న ఇండో-టిబెటన్ సరిహద్దు ధృవీకరించబడింది. మిన్సర్ భూభాగం డోగ్రా రాజవంశం క్రింద జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పరిపాలనలో కొనసాగింది – ఆ గ్రామం నుండి డోగ్రా రాజ్యం వార్షిక పన్నులను వసూలు చేసుకునేది.

మిన్సార్-మానసరోవరం-కైలాస పర్వతం మూడు హిందువులకు పవిత్ర తీర్థయాత్ర క్షేత్రాలు. కైలాస పర్వతం భూమి మీద శివుని నివాసంగా పరిగణిస్తారు. మానససరోవరం సరస్సు బ్రహ్మ చేత సృష్టించబడిందని నమ్ముతారు. తిరుప్పిరుతి దివ్య దేశంతో సంబంధం ఉన్న తీర్థం (పవిత్ర సరస్సు) కాబట్టి మానససరోవరాన్ని  108 దివ్య దేశాలలో (వైష్ణవ క్షేత్రాలలో) ఒకటిగా శ్రీ వైష్ణవులు భావిస్తారు.8వ శతాబ్దం CEలో తిరుమంగై ఆళ్వార్ ఈ సరస్సును సందర్శించారు. కైలాస పర్వతం మరియు మానససరోవరం సాధారణ హిందూ ప్రజల మనస్సులలో ముఖ్యమైన పుణ్యక్షేత్రాలుగా మిగిలిపోగా మిన్సార్ మరుగున పడిపోయింది. మిన్సార్ గ్రామానికి సమీపంలో ఉన్న వేడి నీటి బుగ్గల ఒడ్డున ఉన్న సున్నం నిక్షేపాలు భస్మాసురుని యొక్క బూడిద అవశేషాలుగా హిందువులు పరిగణిస్తారు. తనకి వరం ఇచ్చిన శివుడిపైనే అసురుడైన భస్మాసురుడు దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు విష్ణువు ఉపాయం చేత ఆ రాక్షసుడు తన చేతిలో తానే మరణించాడు. 1950 నాటికి మానససరోవరం మరియు కైలాస్ పర్వతాలకు వెళ్ళే హిందూ యాత్రికులు మిన్సార్ ను కూడా సందర్శించేవారు. అక్కడి పవిత్ర వేడి నీటి బుగ్గలలో స్నానం చేసి సున్నం నిక్షేపాలను భస్మప్రసాదంగా తీసుకునేవారు. 

భారతదేశం మరియు చైనా మధ్య స్వతంత్ర రాజ్యంగా  ఉన్న టిబెట్‌ను 1950 లో చైనా ఆక్రమించినప్పుడు ఆ దేశ స్వాతంత్ర్యానికి మద్దతు ఇవ్వడానికి భారత ప్రభుత్వం ముందుకు రాలేదు. అంతేకాకుండా, నెహ్రూ ప్రభుత్వం భారతదేశానికి చెందిన న్గారి భూభాగాన్ని తిరిగి పొందటానికి కూడా ప్రయత్నించలేదు. చైనా తమకు టిబెట్ మీద ఉన్నట్టు చెప్పుకుంటున్న హక్కు కంటే ఎక్కువ హక్కు భారత దేశానికి న్గారి భూభాగంపై ఉంది. ఎప్పుడో శతాబ్దాల కాలం కిందట తమ ఆధీనంలో ఉన్నట్లు చెప్పుకోగలిగిన ఏ భూమి అయినా తమకే చెందినదని చైనీయులు హక్కులు మాట్లాడుతారు.అదే తర్కం ప్రకారం, చాలా కాలం పాటు మన పాలనలో ఉండిన న్గారి మరియు ఖోటాన్ భారతదేశానికి చెందుతాయి.అదే తర్కాన్ని ఉపయోగించి చైనాలోని జిన్జియాంగ్‌ రాష్ట్రంలో ఉన్న మరెన్నో ప్రాంతాలను కూడా మనవే అని హక్కు అడగవచ్చు. కానీ న్గారి మనకు పోగొట్టుకున్న చివరి భూమి. అందువల్ల ఆ భూమిపై మనకు ఎక్కువ హక్కు ఉంది.మరీ ముఖ్యంగా మన పవిత్ర పుణ్యక్షేత్రాలైన కైలాస్ పర్వతం మరియు మానససరోవరం ఆ రాష్ట్రంలోనే ఉండడం మరొక ప్రధాన కారణం.

నెహ్రూ ఆధ్వర్యంలోని అప్పటి కేంద్ర ప్రభుత్వం మన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశాన్ని చేజార్చుకోవడమే కాకుండా భారతదేశంలోని హిందువులకు తీర్థయాత్ర స్థానమైన టిబెట్‌లోని పవిత్ర మిన్సార్ గ్రామం ఉన్న మన భారతీయ భూభాగాలను కూడా రక్షించలేదు‌. నెహ్రూ స్నేహితుడైన షేక్ అబ్దుల్లా ఆధ్వర్యంలోని అప్పటి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆ గ్రామాన్ని చైనా కమ్యూనిస్టులకే వదులుకోవాలని సిఫారసు చేసింది.అయినా షేక్ అబ్దుల్లా హిందూ తీర్థయాత్రల గురించి ఎందుకు పట్టించుకుంటారు? న్గారిని తిరిగి మన దేశంలో కలుపుకోవడం గురించి పక్కన పెడితే ముందసలు టిబెట్‌లోని మన భూభాగాన్ని కోల్పోవడం గురించి నెహ్రూ ప్రభుత్వం గానీ, ఆ తరువాతి ప్రభుత్వాలుగానీ పట్టించుకోకుండా  కళ్ళు మూసుకున్నాయి. 

న్గారిని మనం కోల్పోవడం వలన 1981లో పునః ప్రారంభించటానికి ముందే కైలాష్ యాత్రను చైనా దాదాపు 2 దశాబ్దాలుగా ఆపివేసింది. 2008లో చైనా వలసవాదానికి వ్యతిరేకంగా టిబెట్‌లో తిరుగుబాటు జరిగినప్పుడు కూడా చైనా యాత్రను ఆపివేసింది. హిందువులను మరియు వారి తీర్థయాత్రలను తిరస్కార భావంతో చూసే చైనా కమ్యూనిస్టులు హిందువుల పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని ఆక్రమించుకొని అవసరమైనప్పుడు మన దేశంతో బేరసారాలకు వాడుకుంటున్నారు. ఇప్పుడు చైనా ఇంకొక అడుగు ముందుకేసి, పుండు మీద కారం రాసినట్టుగా, ఆ పవిత్ర స్థలాన్ని సైన్య క్షిపణి స్థావరంగా మార్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. టిబెటన్ బౌద్ధులు కూడా కైలాష్-మానసరోవరాలను పవిత్రంగా భావిస్తారనే  విషయం చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వానికి పట్టదు. ఒకవేళ పెట్టినా,ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా భారతీయులను మరియు టిబెటన్లను ఇద్దరినీ ఇబ్బంది పెట్టే చర్యగా భావించి ఉండొచ్చు. 

ఈ పరిణామాలన్నింటినీ పరిగణించి, భారతదేశం చైనాతో రక్షణాత్మక ధోరణితో వ్యవహరించడం మానేయాలి. చైనీయులు ఆక్రమించిన అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని మాత్రమే కాకుండా మొదట మిన్సార్ భూభాగాన్ని ఆపైన మొత్తం న్గారి రాష్ట్రాన్ని కూడా మనదే అని సొంతం చేసుకోవాలి. హాన్ చైనా నాయకత్వం శాంతియుత పద్ధతులకు లొంగదు. బలమైన చర్యలతో కూడిన దూకుడు వైఖరి మాత్రమే వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే భౌగోళికంగా, మానసికంగా చిన్న చిన్న కోతల ద్వారా మనల్ని రక్తస్రావానికి గురి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. మనకు పూర్తి హక్కు ఉన్న మిన్సార్ విషయాన్ని భారత ప్రభుత్వం వెంటనే చేపట్టాలని మేము కోరుకుంటున్నాము. మనము న్గారిని కూడా లక్ష్యంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇది చారిత్రాత్మకంగా మరియు ఆధ్యాత్మికంగా మనకు చెందిన ప్రాంతం. మనం ఒకదాని తర్వాత ఒకటిగా మరిన్ని భూములను కోల్పోవడం మానుకోవాలి. తమ భూమిని కోల్పోవడాన్ని హిందువులు పట్టించుకోరని చైనా ప్రభుత్వం భావిస్తున్నట్లు అనిపిస్తోంది. అది తప్పని  నిరూపించుకోవలసిన సమయం ఆసన్నమైంది. మన చారిత్రక భూములన్నింటినీ మనం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. మరియు మన ప్రధాన భూభాగం చుట్టూ బఫర్ జోన్ ఏర్పరచుకోవాలి. 1949 తరువాత చైనీయులు దీనిని అమలు చేశారు. కానీ మనం చేయలేకపోయాం.పైపెచ్చు మనమే ఎక్కువ భూములను కోల్పోయాము. ఆలస్యమైనప్పటికీ, ఇప్పటికైనా ఆ తప్పును సరిదిద్దుకునే విధంగా విధానాన్ని మార్చుకోవాలి.

(Note: The original English version of the article written by Ravilochanan G can be found here)

Vemana Kappa

0 Reviews

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *