శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మాటే నెగ్గి ఉంటే?

 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మాటే నెగ్గి ఉంటే?

ప్రస్తుత “రైట్ వింగ్” గుంపులలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పై జరిగే చర్చలు సాధారణంగా జమ్మూ కాశ్మీర్ చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. జమ్మూ & కాశ్మీర్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదాను శ్యామ్ ప్రసాద్ వ్యతిరేకించడం, ముందస్తు అనుమతి లేకుండా ఆయన జమ్మూ & కాశ్మీర్ సందర్శించడం (ఆ రోజుల్లో ఆ రాష్ట్రంలోకి ప్రవేశించడానికి ప్రత్యేక అనుమతి తీసుకోవడం తప్పనిసరి), ఆయన్ని అరెస్టు చేయడం, ఆపైన ఆయన అనుమానాస్పద పరిస్థితులలో మరణించడం – ఇవే ఆయన గురించి జరిగే చర్చల్లో ప్రధానాంశాలు. నెహ్రూ మరియు షేక్ అబ్దుల్లా ఇద్దరికీ రాజకీయ ముప్పుగా ఉన్నందున శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని నిర్మూలించడానికి ఎలా కుట్ర పన్నారనే దానిపై తరచుగా కుట్ర సిద్ధాంతాలు కూడా వెలువడుతుంటాయి.

కానీ అపారమైన ప్రజాదరణతో ప్రఖ్యాత నాయకుడిగా ఆయన వెలుగొందిన సొంత రాష్ట్రమైన బెంగాల్ లో ఆయన పోషించిన పాత్ర గురించిన చర్చ మాత్రం అరుదుగా జరుగుతుంది. అందుకేనేమో, ఈ మధ్యకాలంలో ఆయన్ని గురించిన చర్చ మళ్లీ ఊపిరి పోసుకోడానికి మునుపు తన సొంత రాష్ట్రంలో మరియు పార్టీలో ఆయన్ను దాదాపుగా మరచిపోయారు.

1946 కలకత్తా ఘోర మారణకాండ తర్వాత 1953లో అనుమానాస్పదంగా మరణించే వరకూ బెంగాల్ హిందూ ప్రజల ఆదరణ అధికంగా పొందిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దూరదృష్టి గల నాయకుడు కూడా. జవహర్‌లాల్ నెహ్రూ మరియు వల్లాభాయ్ పటేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీతో పలు సార్లు ఆయన అనేక అంశాలపై పోరాటం చేశాడు. ఆ పోరాటంలో ఆ కాంగ్రెస్ ద్వయమే తరుచుగా ఆయనపై విజయం సాధించేవారు‌. లేదా కనీసం ఆయన ప్రణాళికల అమలులో అడ్డంకులు సృష్టించేవారు. ఆ కాలంలో పటేల్ మరియు నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పై శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విజయం సాధించి ఉంటే చరిత్ర గమనం భిన్నంగా ఉండేది. తరువాతి దశాబ్దాలలో బెంగాలీ హిందువులు అంతులేని కష్టాలను అనుభవించేవారు కాదు. 

శ్యామా ప్రసాద్ ముఖర్జీ మొట్టమొదటగా జోక్యం చేసుకున్న ముఖ్యమైన విషయం 1947లో ప్రారంభమైన బెంగాలీ హిందూ హోంల్యాండ్ ఉద్యమం. ప్రముఖ హిందూ మేధావులు, ప్రజా ప్రముఖులు మరియు డాక్టర్ బీధన్ చంద్ర రాయ్ నాయకత్వంలోని బెంగాల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1947వ సంవత్సరం ప్రారంభంలో ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. 

భారతదేశం విభజించబడుతుందని, ముస్లిం మెజారిటీ రాష్ట్రమైన బెంగాల్ (ముస్లింలు అప్పుడు బెంగాల్ జనాభాలో 55%) ముస్లిం ఆధిపత్య పాకిస్తాన్ లో భాగమవుతుందని స్పష్టంగా తెలియడంతో బెంగాలీ హిందూ హోంల్యాండ్ ఉద్యమం ప్రారంభించబడింది. మొత్తం బెంగాల్‌ రాష్ట్రాన్ని పాకిస్తాన్‌లో భాగం చేయడం సబబు కాదని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అర్థం చేసుకున్నాడు. అదే జరిగితే ముస్లిం రాజ్యంలో ముస్లిం మెజారిటీ ఆధిపత్యం కింద హిందువులు నిస్సహాయులైన మైనారిటీలుగా జీవించాల్సి వస్తుందని ఆయన అర్థం చేసుకున్నారు. నేటి బంగ్లాదేశ్‌లోని హిందువులకు పుట్టిన గతే మొత్తం బెంగాల్ హిందువులకు పట్టి వారి చరిత్ర చరమ గీతానికి చేరి ఉండేది. బ్రిటీష్ వారి నిష్క్రమణ తరువాత హిందువులు అధికారాన్ని చేపట్టి తమ సొంత రాష్ట్రంపై తిరిగి నియంత్రణ సాధించడమే 19వ శతాబ్దం చివరి నుండి బెంగాల్‌లో జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటం మరియు జాతీయవాద ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం. దేశ స్వాతంత్య్రం కోసం అత్యధికంగా త్యాగం చేసిన హిందువులే స్వాతంత్య్ర సంగ్రామంలో ఆధిపత్యం వహించారు. కాబట్టి మొత్తం బెంగాల్ రాష్ట్రం ముస్లిం పాలనలోకి వెళ్లిపోయి బెంగాలీ హిందువులు మొత్తం ఇస్లామిక్ రాష్ట్రంలో ధిమ్మీలుగా జీవించడం అనేది ఊహించరాని అసంబద్ధమైన విషయం. కాబట్టి బెంగాల్ కాంగ్రెస్ మరియు హిందూ మహాసభ పార్టీలు కలిసి ఉమ్మడిగా డాక్టర్ బిసి రాయ్ మరియు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీల నాయకత్వంలో ఒక ఉద్యమాన్ని ప్రారంభించాయి.బెంగాల్‌ను రెండు భాగాలుగా విభజించడం ఈ ఉద్యమ లక్ష్యాలలో ఒకటి. ఒక భాగం (ప్రధానంగా హిందూ ఆధిపత్య పశ్చిమ వైపు) హిందువులకు “మాతృభూమి” అవుతుంది & భారతదేశంలో అంతర్భాగం అవుతుంది; మిగిలిన సగం (ముస్లిం ఆధిపత్య తూర్పు) పాకిస్తాన్ గా మారుతుంది. పాకిస్తాన్ వైపు మిగిలిపోయే హిందువులు హిందూ ఆధిపత్య భారతదేశానికి వలస వచ్చి పునరావాసం పొందుతారు. అదేవిధంగా, భారతదేశ బెంగాల్ వైపున ఉన్న ముస్లింలు పాకిస్తాన్ కు వలస వెళ్ళవలసి ఉంటుంది. ప్రాథమికంగా జనాభా మార్పిడి ఈ ఉద్యమ లక్ష్యాలలో ఒకటి. చివరికి ఇది పంజాబ్‌లో అమలు చేయబడింది.

ఈ ప్రతిపాదనను హిందువులు ఉత్సాహంగా స్వాగతించారు. 

హిందువులలో ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన అసమ్మతివాదులు లేకపోలేదు. సుహ్రావర్దీతో కలిసి శరత్ బోస్ “స్వతంత్ర సార్వభౌమ ఐక్య బెంగాల్” ఆలోచనను ప్రతిపాదించాడు. కానీ వారు ప్రతిపాదించిన “ఐక్య బెంగాల్” లో పరిపాలన అధిక భాగం ముస్లింల నియంత్రణలో ఉండి, ఒక ముస్లింను ప్రభుత్వ అధిపతిగా కలిగి ఉండి, ముస్లిం లీగ్ చేత పాలించబడుతూ మొత్తంగా పాకిస్తాన్ యొక్క ఉపరాజ్యంగా మిగిలిపోతుంది కాబట్టి ఆ ప్రతిపాదనను బెంగాలీ హిందూ నాయకత్వం పూర్తిగా తిరస్కరించింది.; పేరు వేరైనా తీరులో మాత్రం తూర్పు పాకిస్తాన్ అవుతుంది. అన్నిటికీ మించి హిందూ బెంగాలీలు భారతదేశంలోని మిగిలిన హిందువులతో నాగరిక, సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉండి భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో బెంగాలీ ప్రవాసులుగా ఉన్నారు. భారతదేశం నుండి వేరుగా ఉండే రాజ్యంగా బెంగాల్ ను ఊహించడం అసాధ్యం. బెంగాల్‌లో కొంత భాగం భారతదేశంలో ఉండవలసిందే. అందువల్ల శరత్ బోస్ యొక్క ప్రణాళిక తిరస్కరించబడింది. నిజానికి, ఫార్వర్డ్ బ్లాక్ లోని బోస్ సమర్థకులు కూడా శరత్ బోస్ ప్రతిపాదనను తిరస్కరించి విభజన ప్రతిపాదనకే మద్దతు పలికారు.

కానీ విభజన సందర్భంగా భారతదేశం మరియు పాకిస్తాన్లను వేరుచేసే సరిహద్దు రేఖను ఎక్కడ గీయాలి అనేదానిపై చర్చలు ప్రారంభమైనప్పుడే అసలు ఆట ప్రారంభమైంది. ఆ కీలక సమయంలోనే కాంగ్రెస్ “హైకమాండ్” హిందువులకు ఇచ్చిన మాటను తుంగలో తొక్కి హిందువులను అనాథలను చేయడమే కాకుండా భారతదేశ భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకు తీవ్రం విఘాతం కలిగించింది. బెంగాలీ హిందువుల కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలలుగన్న భవిష్యత్తుకు అడ్డువేసింది. 

చర్చలకు ముందు ఉమ్మడి బెంగాల్‌లో సగభాగం భారతదేశంలో భాగమవుతుందని పేర్కొంటూ మొదటగా కాంగ్రెస్ ప్రజల మద్దతును సమీకరించింది. అంతేగాక భారతదేశంలో ఏఏ ప్రాంతాలను కలపాలని తాము అడుగుతున్నామో ఆ ప్రాంతాలతో కూడిన మ్యాపులను కూడా కాంగ్రెస్ పార్టీ పత్రికలకు విడుదల చేసింది. ఇందులో పశ్చిమ బెంగాల్ యొక్క ప్రస్తుత భూభాగాలే కాకుండా, (ప్రస్తుత బంగ్లాదేశ్ లోని) మొత్తం ఖుల్నా, జెస్సోర్ జిల్లాలు,మధుమతి నది వరకు ఉండే నాడియా యొక్క మొత్తం తూర్పు భాగం, ఫరీద్పూర్ మరియు బారిసాల్ లోని హిందూ మెజారిటీ ప్రాంతాలు, దినాజ్పూర్ జిల్లాలో మిగిలిన హిందూ మెజారిటీ ప్రాంతాలు ఉన్నాయి. హిందూ మహాసభ కూడా అదే వాగ్దానం చేసింది. ఈ రెండు గ్రూపులు కలిసి మొత్తం జనాభాలో  45%గా గల హిందువులకు ఉమ్మడి బెంగాల్ లోని 55% ప్రాంతం చెందేలా చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌తో పోలిస్తే తూర్పు బెంగాల్ లో ఎక్కువ సారవంతమైన భూములు ఉండడం వలన వారికి లభించే తక్కువ భూమితోనే ఎక్కువ జనాభాను నిర్వహించడం వీలవుతుంది.

కానీ చర్చలు ప్రారంభం కాగానే కాంగ్రెస్ తన ప్లేటు ఫిరాయించింది. పశ్చిమ బెంగాల్ సరిహద్దులను చర్చించడానికి హిందువుల తరఫున కేంద్ర నాయకత్వం నియమించిన ప్రతినిధులు ఇతర హిందూ కాంగ్రెస్ సభ్యులూ మరియు హిందూ మహాసభల అనుమతి లేకుండానే వాదనలను మార్చేశారు. అగ్ర నాయకత్వం నియమించిన ఈ వ్యక్తులు పత్రికలలో అమాయక హిందువులకు వాగ్దానం చేసిన దానికంటే చాలా తక్కువ భూభాగాన్ని అడుగుతూ ఏకపక్షంగా చర్చలు ప్రారంభించారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలోని హిందూ మహాసభ తన వాగ్దానానికి కట్టుబడి బెంగాల్ విస్తీర్ణంలో 55% వాటాను హిందువుల కోసం అడిగింది. కాంగ్రెస్ పార్టీ వైఖరి బెంగాల్ రాజకీయ వర్గానికి ఊహించని షాక్ ఇచ్చింది. హిందూ మహాసభ ఆధ్వర్యంలోని కాంగ్రెసేతర హిందువులతో పాటు కాంగ్రెస్ లోని ఇతర హిందూ రాజకీయ నాయకులకు కూడా ఇది ఊహించని పరిణామం. కొంతమంది కాంగ్రెస్ సభ్యులైతే ఇంకో అడుగు ముందుకేసి ప్రస్తుత పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కంటే చిన్నదిగా ఉన్న ప్రాంతాన్ని అడిగే స్థాయికి కూడా వెళ్ళారు! మహాసభ సభ్యులు, కాంగ్రెస్ మధ్య భారీ గొడవ జరిగింది. బ్రిటిష్ వారు భారతదేశంలో హిందువుల ప్రతినిధులుగా కాంగ్రెస్ పార్టీనే గుర్తించడం వారిని చివరికి కాంగ్రెస్ వారి వాదనే నెగ్గింది. దానికి అనుగుణంగానే రాడ్క్లిఫ్ సరిహద్దు లైన్ గీశారు. కాంగ్రెస్ చేసిన డిమాండ్లకు చాలా దగ్గరగా ఉండే పశ్చిమ బెంగాల్ యొక్క కొత్త పటం తయారైంది. హిందూ మెజారిటీ జిల్లా ఖుల్నా, ఫరీద్‌పూర్, బారిసాల్, కుష్టియా, జెస్సోర్ మరియు దినజ్‌పూర్ హిందూ మెజారిటీ ప్రాంతాలు తూర్పు పాకిస్తాన్ కు ఇచ్చేశారు. మొత్తం జనాభాలో హిందువుల సంఖ్య 45%గా ఉన్నప్పటికీ హిందువుల పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మొత్తం భూభాగంలో కేవలం 35% భూమి మాత్రమే వాటాగా వచ్చింది. అధిక జనాభా సాంద్రతకు ఆహారం అందించగల సారవంతమైన భూములు పాకిస్తాన్‌కు ఇవ్వబడ్డాయి. అయితే తక్కువ సారవంతమైన భూమితో భారతదేశం అధిక జనాభాను చూసుకోవాల్సి వచ్చింది. 

బెంగాల్ యొక్క తూర్పు భాగంలో గణనీయమైన భూభాగాన్ని(వాటిలో కొన్ని హిందూ మెజారిటీ ప్రాంతాలు కాగా మరికొన్ని స్వల్ప ముస్లిం మెజారిటీ గల ప్రాంతాలు) పాకిస్థాన్ కు వదిలేయడానికి కాంగ్రెస్ అంగీకారంచడానికి గల కారణాలను మనం ఊహించవచ్చు. 

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు విధేయులుగా ఉండే బెంగాల్ కాంగ్రెస్‌లోని (బిసి రాయ్, పిసి సేన్, అతుల్య ఘోష్ నేతృత్వంలోని) గాంధీవాదులకు బలం గల ప్రాంతాలన్నీ భాగీరథికి పశ్చిమాన ఉన్న(ప్రస్తుత పశ్చిమ బెంగాల్ లోని) జిల్లాల్లోనే ఉండటం ఒక కారణం కావచ్చు. తూర్పు జిల్లాల్లోని హిందువులు ఎక్కువగా హిందూ మహాసభకు మద్దతుదారులుగానో, గాంధీకి విధేయత చూపని అసమ్మతి కాంగ్రెస్ సభ్యులుగానో, కమ్యూనిస్టులకు విధేయులుగానో మరియు ఇతర చిన్న సమూహాలుగానో ఉండేవారు. బహుశా, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తమ స్వంత రాజకీయ అవకాశాలకు తూర్పు బెంగాల్ హిందువులు ముప్పు అవుతారని కాంగ్రెస్ యొక్క గాంధేయ వర్గం భావించి ఉండవచ్చు.

ఉద్దేశ్యం ఏమైనప్పటికీ, కాంగ్రెస్ పార్టీ మోసంతో కూడిన ద్రోహపూరిత చర్యకు పాల్పడింది. స్వల్పకాలిక రాజకీయ లాభాల సాధన కోసం దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు మరియు లక్షలాది మంది హిందువుల జీవితాలను బలి చేసింది.

ఇలాంటి అడ్డగోలు విభజన ప్రక్రియ మరియు ఈ ప్రక్రియలో సృష్టించబడిన పశ్చిమబెంగాల్ వలన హిందువుల సమస్యలు పెరిగాయి. మొదటి సమస్య, అవిభక్త బెంగాల్ జనాభాలో 45% ఉన్న హిందువులకు మొత్తం బెంగాల్ భూమిలో 35% మాత్రమే లభించింది. అవి కూడా తక్కువ సారవంతమైన భూములు. అంటే జనాభా మార్పిడి జరిగితే, శరణార్థుల వలన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పై అధిక భారం పడుతుంది. భూమిపై ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్ యొక్క గణనీయమైన భూభాగాలు (మిడ్నాపూర్ యొక్క పశ్చిమ భాగం, బంకురా, బుర్ద్వాన్ యొక్క పశ్చిమ భాగం) పొడిగా ఉండే నిస్సార భూములు. అందువల్ల శరణార్థుల జనాభా యొక్క అదనపు భారాన్ని పశ్చిమ బెంగాల్ భరించలేదు. 

ఏదేమైనా, 1947 లో, పంజాబ్ లో జరిగినట్లుగా బెంగాల్ లో జనాభా మార్పిడి లేదు. 1947-1949 మధ్యన తూర్పు పాకిస్తాన్ నుండి భారతదేశానికి 13 లక్షల మంది హిందువులు వచ్చారని అంచనా. అధిక సంఖ్యలో శరణార్థులు పశ్చిమ బెంగాల్‌కు, మరికొందరు అస్సాం మరియు త్రిపురకు వచ్చారు. కానీ ఇది తూర్పు పాకిస్తాన్‌లోని హిందూ జనాభాలో కొంత భాగం మాత్రమే. కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరియు భారత కేంద్ర ప్రభుత్వం బెంగాల్ జనాభా మార్పిడి కోసం గానీ, తరువాత హిందూ శరణార్థుల పునరావాసం కోసం గానీ ఎటువంటి ప్రణాళికలు, సన్నాహాలు చేయలేదు. అందువలన భారతదేశంలో తమ భవిష్యత్తు అనిశ్చితంగా ఉంటుందని భావించిన చాలా మంది హిందువులు తూర్పు పాకిస్తాన్ లోనే ఉండిపోయారు.1950 ప్రారంభంలో తూర్పు పాకిస్తాన్ లోని ఖుల్నా మరియు బారిసాల్లలో హిందూ వ్యతిరేక హింస తరువాత శరణార్థుల ప్రవాహం పెరగడం ప్రారంభమైంది. ఆ సంవత్సరంలో సుమారు 21 లక్షల మంది హిందువులు భారతదేశానికి వలస వచ్చారు. 1950 ఫిబ్రవరి మరియు ఏప్రిల్ మధ్య 8 లక్షల మంది హిందువులు తూర్పు పాకిస్తాన్ నుండి బయలుదేరి భారతదేశానికి వచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా ముస్లింలపై ప్రతీకార దాడులు జరిగాయి; 1947-1950 మధ్య లక్షలాది మంది ముస్లింలు పశ్చిమ బెంగాల్ నుండి బయలుదేరి తూర్పు పాకిస్తాన్ కు పారిపోయారు (ఫిబ్రవరి మరియు ఏప్రిల్ 1950 మధ్యలోనే 4 లక్షల మంది వెళ్లపోయారు).

ఆ సమయంలో నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఈ సంక్షోభానికి ముగింపు పలకడానికి నెహ్రూ జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఫార్వర్డ్ బ్లాక్ మరియు రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ వంటి పార్టీలతో సహా బెంగాల్‌లోని పలువురు ప్రముఖ రాజకీయ ప్రముఖులతో కలిసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఈ సంక్షోభ నివారణ కోసం తీవ్రమైన చర్యలను ప్రతిపాదించారు – పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించడం, తూర్పు పాకిస్థాన్‌ను భారత ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకోవడం, పంజాబ్ లో అమలు చేసినట్టుగా బెంగాల్ లో కూడా పూర్తి జనాభా మార్పిడిని శాంతియుతంగా అమలు చేయడం , శరణార్థుల పునరావాసం మరియు విభజన సమయంలో పశ్చిమ బెంగాల్‌కు 35% భూమి మాత్రమే లభించినందున, తూర్పు బెంగాల్‌లోని హిందూ ఆధిపత్య ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం (విభజన సంబంధిత చర్చల సమయంలో హిందూ మహాసభ చేసిన డిమాండ్లు ఇవే).

కానీ నెహ్రూ, పటేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. పైపెచ్చు, ఇంకో అడుగు ముందుకేసి, బెంగాలీ హిందూ నాయకుల అనుమతి లేకుండా పాకిస్తాన్ ప్రధాన మంత్రి లియాఖత్ అలీ ఖాన్‌తో ఏకపక్షంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. “నెహ్రూ లియాఖత్ ఒప్పందం” యొక్క ప్రధాన అంశం ఏమిటంటే, భారత మరియు పాకిస్తాన్ ప్రభుత్వాలు ఆయా దేశాల మత మైనారిటీలను “రక్షిస్తాయి”. పాకిస్తాన్ తన మైనారిటీలను పట్టించుకోదని స్పష్టం కావడంతో ఇది ఒక  ప్రహసనంగా మిగిలిపోయింది. అలాగే, తూర్పు పాకిస్తాన్‌లోని హిందువులు పాకిస్తాన్ పరిపాలనను విశ్వసించలేదని కొద్ది రోజుల్లోనే చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఈ ఒప్పందంపై సంతకం చేసిన తరువాత కొద్ది కాలంలోనే పాకిస్తాన్ ప్రభుత్వంలోని ఏకైక హిందూ క్యాబినెట్ మంత్రి జోగేంద్రనాథ్ మొండల్‌తో సహా మరో 12 లక్షల మంది హిందువులు (ఏప్రిల్ మరియు డిసెంబర్ 1950 మధ్య) తూర్పు పాకిస్తాన్‌ను విడిచిపెట్టి కొన్ని నెలల వ్యవధిలో శరణార్థులుగా భారతదేశానికి వచ్చారు. 

ఖచ్చితంగా విఫలం కాబోయే ఒప్పందంపై నెహ్రూ సంతకం చేయడానికి గల కారణం మనం ఊహించవచ్చు. హిందువుల భద్రత మరియు రక్షణ గురించి ఆయన ఖచ్చితంగా ఆందోళన చెందలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం తన భూభాగంలోని హిందూ మైనారిటీని రక్షించడానికి బదులుగా తన ముస్లిం పౌరులను హిందువులను తరిమికొట్టడానికి ప్రోత్సహిస్తుందని, ముఖ్యంగా భూ సంబంధిత ఆస్తులు గల హిందువులను తరిమేయడానికి ప్రోత్సహిస్తుందని, అందువలన ఈ ఒప్పందం విఫలమవుతుందని ఆయన ముందుగానే ఊహించాడు. బెంగాలీ హిందూ శరణార్థుల పట్ల భారత ప్రభుత్వ బాధ్యతను వదిలించుకోవడం మరియు హిందూ శరణార్థులను తిప్పి పంపడానికి ఒక సాకును కనుగొనడమే నెహ్రూ ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి(మరియు పటేల్ చేత బలపరచబడింది)గల ఏకైక కారణం. నిజానికి క్షేత్ర స్థాయిలో కూడా చివరికి అదే జరిగింది. నెహ్రూ లియాఖత్ ఒప్పందం కుదుర్చుకున్న తరువాత (పైన చెప్పినట్లు)12 లక్షల మంది హిందువులు తూర్పు పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చారు కానీ అదే సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల మంది హిందువులను తూర్పు పాకిస్తాన్ కు తిరిగి వెళ్లిపోవాలని బలవంతం చేసింది! అంతే కాదు, పశ్చిమ బెంగాల్ నుంచి తూర్పు పాకిస్థాన్‌కు పారిపోయిన కొద్దిమంది లక్షలాది మంది ముస్లింలను తిరిగి పశ్చిమ బెంగాల్‌కు తీసుకువచ్చారు. పూర్తి జనాభా మార్పిడిని అమలు చేయకుండా, నెహ్రూ మరియు పటేల్ తూర్పు పాకిస్తాన్ నుండి ముస్లింలను తిరిగి తీసుకువచ్చారు మరియు ఐదు లక్షల మంది హిందువులను బలవంతంగా తిరిగి పంపించారు!

[1947 మరియు 1950 మధ్యలో మరియు చివరలో, తూర్పు పాకిస్తాన్ నుండి సుమారు 34 లక్షల మంది హిందువులు భారతదేశానికి వచ్చారు, వారిలో 5 లక్షల మంది నెహ్రూ-లియాఖత్ ఒప్పందంపై సంతకం చేసిన తరువాత బలవంతంగా తిరిగి పంపబడ్డారు. వారు బహుశా ఆ తరువాత వారు భారతదేశానికి తిరిగి వచ్చి ఉండవచ్చు]

తూర్పు బెంగాల్ నుండి వచ్చిన హిందూ కాంగ్రెస్ సభ్యులు తిరిగి పాకిస్తాన్ కు వెళ్లి అక్కడి హిందువుల హక్కుల కోసం (పాకిస్తాన్ రాష్ట్ర యంత్రాంగానికి వ్యతిరేకంగా) పోరాడాలని పిలుపునిచ్చి పటేల్ అపఖ్యాతి పాలయ్యాడు! 

కాంగ్రెస్ పార్టీ విభజన ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా గందరగోళపరచి పాకిస్తాన్‌కు భూమిని ఇచ్చిందనే విషయం 1950ల దశాబ్ద ఆరంభానికంతా స్పష్టమైపోయింది. సమస్యలన్నింటినీ అంతం చేసే విధంగా విభజన జరిగేలా చూస్తామని కాంగ్రెస్ అమాయకమైన హిందువులకు వాగ్దానం చేసింది. హిందువులు నమ్మి అంగీకరించారు.ఇదే అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ విభజన ప్రక్రియలో హిందువులకు సాయం చేసే అవకాశాన్ని చేతులారా నాశనం చేసింది. జనాభాలో 55% ఉన్న ముస్లింలకు సారవంతమైన భూములతో కూడిన 65% భూభాగాన్ని ఇవ్వడం ద్వారా హిందూ శరణార్థుల జనాభా మార్పిడి మరియు పునరావాస కార్యక్రమాన్ని కష్టతరం చేసి చివరికి జనాభా మార్పిడికి అనుమతించకుండా చేశారు; చివరకు, బెంగాలీ హిందూ శరణార్థులకు పునరావాసం నిరాకరించడం – వీటన్నిటి వలన హిందూ బెంగాలీ జనాభాలో మూడోవంతు మంది భారతదేశం వెలుపల ఉండిపోయారు. హిందూ బెంగాలీలు భారతదేశంలో ఐక్యంగా ఉండటానికి బదులుగా భారతదేశం మరియు తూర్పు పాకిస్తాన్లలో విడివిడిగా ఉండిపోయారు. 

వాస్తవానికి, “క్యాన్సర్ శరీర భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించడానికి” మరియు రాష్ట్రంలో ముస్లింలీగ్‌ను లేకుండా చేయడానికే భారతదేశంలో ఉండాల్సిన ప్రాంతాలను పాకిస్తాన్‌కు ఇవ్వడానికి నెహ్రూ మరియు పటేల్ అంగీకరించారని వారి అనుచరులు చెబుతుంటారు. ఒకవేళ అదే నిజమైన ఉద్దేశ్యమైతే, భవిష్యత్తులో తూర్పు పాకిస్తాన్ భారత వ్యతిరేక స్థావరంగా మారే అవకాశం లేకుండా(తూర్పు పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించమని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరియు అనేక ఇతర బెంగాలీ నాయకులు నెహ్రూను కోరడం వెనుక కారణం లేకపోలేదు) ముందుగానే వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాలు భారత నియంత్రణలో ఉండేలా చూసుకోని దానితో పాటుగా (హిందువుల భద్రతకు భరోసా ఉండేలా) జనాభా మార్పిడి చేసిన తరువాత క్యాన్సర్ భాగలను తొలగించి ఉండాల్సింది.

ఇందులో ప్రాంతీయ కోణం కూడా ఉంది. కాంగ్రెస్ నాయకత్వం బెంగాలీ హిందువుల పట్ల నిర్లక్ష్యంతో గౌరవం లేకుండా వ్యవహరించారు. కానీ పశ్చిమ పాకిస్తాన్ నుండి వచ్చిన పంజాబీ మరియు సింధీ శరణార్థులకు మాత్రం వేగంగా పునరావాసం కల్పించారు. ముస్లింలు వదిలిపెట్టిన భూమి, ఇళ్ళు, వ్యాపార సంస్థలు, ఆస్తులను పంజాబీ శరణార్థులకు ఇచ్చారు. పశ్చిమ పాకిస్తాన్ కు వలస వెళ్లిపోయిన ముస్లిం వలసదారుల కంటే అక్కడి నుండి వలస వచ్చిన పంజాబీ హిందువులు మరియు సిక్కు వలసదారుల సంఖ్య ఎక్కువుగా ఉండటం వలన  ఢిల్లీలో వారి కోసం ఏకంగా కొత్త హౌసింగ్ కాలనీలను ప్రభుత్వం నిర్మించింది. కొన్ని సందర్భాల్లో, పంజాబీలకు ఇళ్ళు మరియు ఇతర సంస్థలను నిర్మించడానికి ఢిల్లీలోని ముస్లిం వర్గానికి చెందిన వక్ఫ్ ఆస్తులను కూడా  ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంది! 

కాగా, బెంగాలీ హిందూ శరణార్థులకు అటువంటి పునరావాసం లభించలేదు. దీని వలన కొన్ని సందర్భాల్లో బెంగాలీ హిందూ శరణార్థులు పరిస్థితులను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ముస్లింలపై దాడి చేసి వారి గ్రామాల నుండి వారిని తరిమేసి వారి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఎక్కువగా నాడియా మరియు ముర్షిదాబాద్ లలోని కొన్ని ప్రాంతాలలో జరిగింది. కొన్ని చోట్ల శరణార్థుల పునరావాసం కోసం అవసరమైన స్థలాన్ని సేకరించడానికి వివిధ రాజకీయ పార్టీల స్థానిక విభాగాలు (భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర యంత్రాంగాల మద్దతు లేకుండా) అల్లర్లలో నిమగ్నమై ముస్లింలను బలవంతంగా తరిమేశారు. కొన్ని ప్రాంతాలలో శరణార్థ హిందువులు పెద్ద జమీందార్ల భూమిని స్వాధీనం చేసుకున్నారు. పట్టణాలు మరియు నగరాల శివార్లలోని అరణ్యాలు మరియు బంజరు భూములలో స్థిరపడ్డారు. అడవులను కొట్టేసి వ్యవసాయం విస్తరించారు, మార్కెట్లు ఏర్పాటు చేశారు. ఆర్థికంగా బలమైన శరణార్థులు స్థిరపడిన దక్షిణ కోల్‌కతాలోని అత్యంత సంపన్నమైన శరణార్థి ప్రాంతాలలో కూడా 1970ల ప్రారంభం వరకు మరియు కొన్ని సందర్భాల్లో 1980ల ప్రారంభం వరకు ఎటువంటి మౌలిక సదుపాయాలు గానీ, రహదారులు మరియు ప్రాథమిక సౌకర్యాలు గానీ ఉండేవి కావు. బెంగాలీ హిందూ శరణార్థులకు పునరావాసం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పెద్దగా ఏమీ చేయలేదు. శరణార్థులలో కొద్ది మంది పశ్చిమ బెంగాల్ లేదా బెంగాలీ ఆధిపత్య ప్రాంతాలైన అస్సాం మరియు త్రిపురలకు దూరంగా ఉండే ఢిల్లీ, దండకారణ్యం, అండమాన్, బిజ్నోర్ మరియు అలాంటి ప్రదేశాలలో స్థిరపడ్డారు; ఇటువంటి ప్రదేశాలలో వారిని స్థిరపడేలా చేయడం వెనుక ఉద్దేశ్యం వారికి పునరావాసం కల్పించడం కాదు (నిజానికి ఒక్క ఢిల్లీ తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ పొడిగా, పెద్దగా సారవంతం కాని నేలలతో కూడి బెంగాలీలు నివసించడానికి అనుకూలమైనవి కావు). కాని బెంగాలీ హిందూ శరణార్థులు బెంగాలీ ఆధిపత్య ప్రాంతాలలో ఒకటిగా చేరి కాంగ్రెస్ వ్యతిరేక ‘ఓటు బ్యాంకు’గా తయారవ్వకుండా వారిని దూరదూరంగా చెల్లాచెదురుగా ఉంచడమే ప్రధాన లక్ష్యం. 

ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, నెహ్రూ మరియు పటేల్ నాయకత్వం వహించిన కాంగ్రెస్‌పై శ్యామా ప్రసాద్ ముఖర్జీ మాట నెగ్గి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? కాంగ్రెస్ గట్టిగా బేరమాడి భారతదేశానికి ఎక్కువ భూభాగం లభించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? జనాభా మార్పిడి జరిగి హిందూ శరణార్థులను సరైన పునరావాసం కల్పించే ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? 

అది చరిత్ర గతిని మార్చేసుండేది. మొదట, భారతదేశం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పద్మ మరియు భాగీరథి మధ్య జిల్లాల్లో ఎక్కువ భూమిని పొందేవి. సారవంతమైన నేలతో కూడిన భూములు పెద్ద స్థాయిలో భారతదేశంలో భాగమై ఉండేవి. పశ్చిమ బెంగాల్ పరిమాణంలో చాలా పెద్దదిగా ఉండేది. గణనీయంగా మరింత సంపన్నమై ఉండేది. సారవంతమైన జనపనార ఉత్పత్తి చేసే భూములు భారతదేశంతోనే ఉండేవి – అది స్థానిక ఆర్థిక వ్యవస్థకు సహాయకారిగా ఉండేది. అది శరణార్థుల పునరావాస ప్రక్రియను మరింత సులభతరం చేసేది. జనాభా మార్పిడి జరిగి ఉంటే పశ్చిమ బెంగాల్ మరియు బహుశా అస్సాం కూడా గణనీయమైన హిందూ జనాభాతో హిందూ ఆధిపత్య ప్రాంతాలుగా ఉండేవి. నేడు బంగ్లాదేశ్ నుండి నిరంతరం వచ్చిపడే అక్రమ వలసదారులచే రోజురోజుకూ పెరిగిపోతూ ఈ దేశంలోని వారి సహ-జాతి వారి ద్వారా సహాయం పొందుతూ రోజురోజుకూ మన దేశానికి ప్రమాదకారిగా తయారవుతున్న సమూహం ఊసే ఉండేది కాదు. అన్నిటికీ మించి హిందువులు శాంతి మరియు శ్రేయస్సుతో జీవించేవారు. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న శరణార్థులు పేదరికంతో కష్టాలు పడుతూ శరణార్థి శిబిరాలు, మురికివాడల్లో పరాయీకరణకు గురయ్యేవారు కాదు. భారతదేశానికి వలస రాలేక తూర్పు పాకిస్తాన్ (1971 తరువాత బంగ్లాదేశ్) లో నివసించాల్సి వచ్చిన హిందువులు ఇస్లాంవాదుల చేతిలో ఇప్పటికీ బాధలు పడ్తూనే ఉన్నారు. దీనిని కూడా నివారించి ఉండవచ్చు. 1964 మరియు 1971లలో జరిగిన మారణహోమం, సామూహిక హత్యలు జరిగేవి కావు. పశ్చిమ బెంగాల్‌ రాజకీయ రంగంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ఉండేది కాదు. విభజన తరువాత పశ్చిమ బెంగాల్‌లోని కమ్యూనిస్టులు బెంగాలీ హిందువుల మనోవేదనను తమ ఎదుగుదలకు వాడుకున్నారు. 1948 నుండి 1977 వరకు (ముఖ్యంగా 1953లో శ్యాం ప్రసాద్ ముఖర్జీ మరణించిన తరువాత) బెంగాల్‌లోని కమ్యూనిస్టులు బెంగాలీ హిందూ శరణార్థుల తరుపున ప్రతినిధులుగా తయారయ్యారు మరియు హిందూ శరణార్థుల బాగోగులు చూడసాగారు; అందుకు ప్రతిగా, శరణార్థ కుటుంబాలకు చెందిన యువతీ, యువకులు కమ్యూనిస్ట్ పార్టీలలో భారీ సంఖ్యలో చేరారు. శరణార్థుల ఆధిపత్య పట్టణాలు అన్ని రకాల కమ్యూనిస్ట్ ఉద్యమాలకు బలమైన కోటలుగా మారాయి. అంతేకాకుండా, 1947 తరువాత భారతదేశం మరియు తూర్పు పాకిస్తాన్ మధ్య బెంగాలీ హిందువులు విభజించబడేవారు కాదు – 1951 జనాభా లెక్కల ప్రకారం తూర్పు పాకిస్తాన్ లో ఇంకా 9 మిలియన్ల హిందువులు ఉండేవారు. వారు భారత భూభాగంలో ఐక్యంగా ఉండి రాజకీయంగా మరింత శక్తివంతంగా ఉండేవారు.

వాస్తవానికి, పైవన్నీ మన ఊహలే. జరగాల్సిన నష్టం 1947 మరియు 1950 మధ్యన జరిగిపోయింది. బెంగాలీ హిందువులు ఇప్పటికీ దాని పరిణామాలను అనుభవిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 73 సంవత్సరాల తరువాత కూడా పొరుగున ఉన్న ఇస్లామిక్ దేశాల నుండి వచ్చే హిందూ శరణార్థుల సమస్యలను పరిష్కరించడానికి భారతదేశానికి పౌరసత్వ సవరణ చట్టం అవసరమైంది. చాలా మంది బెంగాలీ హిందువులు నేటికీ తమ దేశంలో ఎటువంటి గుర్తింపు లేకుండా “విదేశీయులు”గా బ్రతుకుతున్నారు. 

(Note: The original English version of the article authored by Aban can be found here)

Vemana Kappa

0 Reviews

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *