కృష్ణ జన్మభూమి – మనం మరచిన చరిత్ర

 కృష్ణ జన్మభూమి – మనం మరచిన చరిత్ర

రామజన్మభూమి ఉద్యమంలో అత్యంత ప్రజాదరణ పొందిన “ అయోధ్యా సిర్ఫ్ ఝాంకీ హై, కాశీ మధుర బాకి హై” నినాదాన్ని పరిగణనలోకి తీసుకుంటే అయోధ్యలో రామ్ జన్మభూమి నియంత్రణను హిందువులకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు తరువాత వచ్చిన మొదటి కృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాకతాళీయంగా,అయోధ్యలోని భవ్య రామ్ మందిరానికి చెందిన భూమి పూజకు వారం తరువాత ఈ జన్మాష్టమి వచ్చింది. హిందువులు తమకు చెందిన వాటిని తిరిగి తీసుకోవటానికి చేసిన వీరోచిత మరియు దీర్ఘకాలిక పోరాటం గురించి చాలా చర్చ నడుస్తుండగా, గత వెయ్యి సంవత్సరాలుగా కృష్ణ జన్మభూమిని స్వాధీనం చేసుకోవటానికి సంబంధించి హిందువులు చేస్తున్న ఇంకో సుదీర్ఘమైన పోరాటం మరుగున పడిపోయింది.

మధుర భగవాన్ శ్రీ కృష్ణుడి జన్మస్థలం అని మనకు తెలుసు. పురాణాల ప్రకారం, మధురలోని కంస రాజు చెరసాలలో ఉంచబడిన దేవకి మరియు వాసుదేవులకు శ్రావణ మాసం యొక్క చీకటి పక్షం రోజులలో రోహిణి నక్షత్రంతో కలిసి వచ్చిన అష్టమి తిథినాటి అర్ధరాత్రి కృష్ణుడు జన్మించాడు. వివిధ అధ్యయనాల ఆధారంగా, మధురలోని పాత కత్రా కేశవ్‌దేవ్ ఆలయం (కేశవ్ రాయ్ అని కూడా పిలుస్తారు) ఉండిన ప్రదేశమే కృష్ణుడి నిజమైన జన్మస్థలమని డాక్టర్ వాసుదేవ్ శరణ్ అగర్వాల్ మరియు శ్రీ కృష్ణ దత్తా వాజ్‌పేయి వంటి చరిత్రకారులు నిర్థారించారు. ఔరంగజేబ్ నిర్మించిన షాహి ఇద్గాకు ఇప్పుడు ఆ స్థలంలోనే ఉంది.

జన్మభూమి – నిర్మాణం మరియు విధ్వంసం యొక్క కథ:

కృష్ణుడు పుట్టుక యొక్క ప్రేమపూర్వక జ్ఞాపకార్థంగా ఈ జన్మభూమి వద్ద ఒక గొప్ప ఆలయం నిర్మించబడింది. ప్రసిద్ధ సోమనాథ్ ఆలయం మాదిరిగానే, కృష్ణ జన్మభూమి వద్ద ఉన్న ఆలయం కూడా అనేకసార్లు ఆక్రమణదారుల దాడికి గురయ్యింది. కానీ విషాదకరమైన విషయమేమిటంటే, సోమనాథ్ లో మహాదేవుడు తన నివాస స్థలాన్ని తిరిగి పొందిన మాదిరిగా కాకుండా, ఇక్కడి వివాదం ఇంకా పరిష్కరించబడలేదు. ఫలితంగా, భగవాన్ శ్రీకృష్ణుడు తన జన్మస్థలాన్ని ఇంకా తిరిగి పొందాల్సి ఉంది. శ్రీ కృష్ణ జన్మస్థాన్ వద్ద నిర్మించిన దేవాలయాల సంఖ్య మరియు ఆక్రమణదారుల చేతిలో వాటి వినాశనం గురించిన చరిత్ర కింద ఇవ్వబడింది:

  • ప్రసిద్ధ నమ్మకం ప్రకారం, ఈ ప్రదేశంలో మొదటి ఆలయాన్ని కృష్ణుడి మనవడు వజ్రనాభుడు నిర్మించాడు.
  • పురాణాల ప్రకారం, గుప్తుల యుగంలో చక్రవర్తి చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని విస్తరింపజేసి పునర్నిర్మించాడు. విక్రమాదిత్యుడు నిర్మించిన అప్పటి ఆలయం ఒక నిర్మాణ అద్భుతం. అదే సమయంలోనే, ఆ గొప్ప చక్రవర్తి మధురను సంస్కృతికీ మరియు కళలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాడు. ఈ అద్భుతమైన ఆలయాన్ని క్రీ.శ 1017 లో మహమూద్ ఘజ్నవి కూల్చివేశాడు.
  • మూడవ పెద్ద ఆలయాన్ని క్రీ.శ 1150 లో విజయాలపాల దేవ్ పాలనలో జజ్జా అనే వ్యక్తి నిర్మించాడు. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దం ప్రారంభంలో సికందర్ లోడి (నిజాం ఖాన్) నాశనం చేశాడు.
  • ఈ ప్రదేశంలో నిలబడిన నాల్గవ మరియు చివరి ఆలయాన్ని జహంగీర్ పాలనలో రాజా బిర్ సింగ్ బుండేలా నిర్మించారు. ఈ ఆలయాన్ని 1670లో ఔరంగజేబ్ ధ్వంసం చేసి ఆ స్థలంలోనే షాహి ఇద్గాను నిర్మించాడు. మొఘల్ చక్రవర్తి మధుర పేరును ఇస్లామాబాద్ గా మార్చాడు.

ఔరంగజేబు చేత కృష్ణ జన్మభూమి ఆలయం నాశనం:

సికందర్ లోడి చేతిలో నాశనం అయిన తరువాత, కృష్ణ జన్మభూమి ఆలయాన్ని మొఘల్ సామ్రాజ్యం క్రిందికి వచ్చే ఓర్చా పాలకుడు రాజా బిర్ సింగ్ బుండేలా పునర్నిర్మించారు. ఔరంగజేబ్ పాలనలో చోటుచేసుకున్న సంఘటనల సంకలనం అయిన మాసిర్-ఇ-అలమ్‌గిరి ప్రకారం, అక్బర్ వారసుడిగా తనకు సింహాసనం అందాలన్న జహంగీర్ వాదనను వ్యతిరేకించిన అక్బర్ యొక్క ప్రధాన వజీర్ మరియు అక్బర్-నామా రచయిత షేక్ అబుల్ ఫజల్‌ను జహంగీర్ ఆదేశానుసారం బిర్ సింగ్ బుండేలా హత్య చేశాడు. ఈ ప్రక్రియలో బుండేలా జహంగీర్ అభిమానాన్ని పొందాడు. జహంగీర్ మొఘల్ సామ్రాజ్యం సింహాసనాన్ని అధిరోహించిన తరువాత, తన సేవలకు ప్రతిఫలంగా ఏదైనా బహుమతి కోరమని బుండేలాను కోరగా కృష్ణ జన్మభూమి స్థలంలో కేశవ్ దేవ్ కోసం ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించడానికి బుండేలా వెంటనే అనుమతి కోరాడు. ఒక హిందూ రాజు, తనకు అవకాశం ఇచ్చినప్పుడు, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ఆ పవిత్ర స్థలంలో ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి కోరడం కంటే కృష్ణ జన్మభూమిని తిరిగి పొందటానికి హిందువుల పట్టుదలకు సాక్ష్యంగా ఏమి నిలుస్తుంది? హిందూ సంప్రదాయాలను ఒప్పుకోనప్పటికీ, బుందేలాను అమూల్యమైన అనుచరుడిగా భావించి కృష్ణ జన్మభూమి వద్ద ఒక ఆలయాన్ని నిర్మించడానికి జహంగీర్ అనుమతి ఇచ్చాడు. 

ఆ విధంగా, ముప్పై మూడు లక్షల రూపాయల వ్యయంతో బుండేలా ఈ ప్రదేశంలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించారు. కానీ, కేశవ్ రాయ్ యొక్క డెహ్రాగా ప్రసిద్ది చెందిన ఈ ఆలయం అర్ధ శతాబ్దం మాత్రమే ఉనికిలో ఉండింది. ఎందుకంటే జహంగీర్ మనవడు ఔరంగజేబ్ ‘అవిశ్వాసం’ అంతం చేయాలనే తన దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ఔరంగజేబ్ సైన్యం ఈ ఆలయాన్ని నేలమట్టం చేసి ఆలయంలోని అన్ని మూర్తిలను ఆగ్రాలోని బేగం సాహిబ్ మసీదు క్రింద ఖననం చేశారు. తద్వారా వాటిపై ‘విశ్వాసులు’ నిరంతరం నడుస్తారని వారి భావన. మొఘల్ చక్రవర్తి ఆ ఆలయ స్థలంలో షాహి ఇద్గా నిర్మించాలని ఆదేశించి, ఆ పట్టణం యొక్క హిందూ గుర్తింపును చెరిపేయడానికి మధుర పేరును ఇస్లామాబాద్ గా మార్చారు.

సింధియా వంశస్థులు మధురను తిరిగి స్వాధీనం చేసుకోవడం:

పీష్వా బాజీరావ్ I యొక్క మరాఠా సర్దార్ రానోజీ రావు సింధియా చేత సింధియా రాజవంశం స్థాపించబడింది. మరాఠాల ఎదుగుదల కారణంగా మొఘలులు తమ ప్రాముఖ్యతను కోల్పోవడం ప్రారంభించినప్పుడు గ్వాలియర్ మరియు ఉజ్జయినితో సింధియాల అనుబంధం ప్రారంభమైంది. రానోజీ ఐదవ మరియు చిన్న కుమారుడు అయిన మహద్జీ సింధియా ఉత్తర భారతదేశంలో మరాఠాల స్థానాన్ని పటిష్టం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. 1755 లో, ఇరవై ఐదు సంవత్సరాల మహద్జీ సింధియా మధుర పట్టణాన్ని స్వయంగా స్వాధీనం చేసుకుని ముస్లిం పాలన నుండి విడిపించాడు. శ్రీకృష్ణ భక్తుడైన అతను మధురలో శిధిలమైన అనేక దేవాలయాలను పునర్నిర్మించాడు మరియు సంస్కృత బోధన కోసం ఒక పాఠశాలను కూడా స్థాపించాడు. స్థానిక కథల ప్రకారం, అతను మధురలోని షాహి ఇద్గా వద్ద నమాజ్‌ను నిషేధించాడు మరియు ఆ భూమిని జాతీయం చేశాడు. ఆ పైన, రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం తరువాత ఈ భూమి బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లింది.

బ్రిటిష్ వేలం మరియు అలహాబాద్ హైకోర్టులో సివిల్ కేసులు :

1815లో బ్రిటిష్ పాలనలో, ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం కృష్ణ జన్మభూమి ప్రాంతాన్ని (కత్రా కేశవ్ దేవ్ అని కూడా పిలుస్తారు) వేలం వేసింది. దీనిని బనారస్‌కు చెందిన రాజా పట్నిమల్ సొంతం చేసుకున్నాడు. రాజా పట్నిమల్ శ్రీ కృష్ణ జన్మభూమి వద్ద భగవాన్ శ్రీ కృష్ణుడి కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలనే ఉద్దేశ్యంతో ఈ భూమిని సొంతం చేసుకున్నాడు, కాని ఆ ప్రయత్నంలో ఆయన విఫలమయ్యాడు. అతని మరణం తరువాత, అతని వారసులు జన్మభూమి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1930వ దశకంలో, మధుర ముస్లింలు ఇద్గా భూమి యజమాని మరియు రాజా పట్నిమల్ వారసుడు అయిన రాజ్ కృష్ణదాస్‌పై పై రెండు సివిల్ కేసులను దాఖలు చేశారు. అలహాబాద్ హైకోర్టులో ఈ కేసుల ద్వారా భూమి యాజమాన్యాన్ని తమకు తిరిగి బదిలీ చేయాలని ముస్లింలు డిమాండ్ చేశారు. అయితే, ముస్లింల వాదనను తోసిపుచ్చిన అలహాబాద్ హైకోర్టు రాజ్ కృష్ణదాస్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ విధంగా, 1935 నాటికి కృష్ణ జన్మభూమి యాజమాన్యం హిందువుల చేతిలో బలంగా ఉండింది.

మహామాన చేత స్వాధీనం:

మహామాన పండిట్ మదన్ మోహన్ మాలవీయ 1940లో మధురకు వచ్చినప్పుడు, శ్రీ కృష్ణ జన్మస్థలం యొక్క దుస్థితిని చూసి చాలా నిరాశ చెందాడు. శ్రీ కృష్ణ జన్మస్థలంలో ఆలయాన్ని తిరిగి స్థాపించడానికి తన సహాయం కోరుతూ పారిశ్రామికవేత్త జుగల్ కిషోర్ బిర్లాకు లేఖ రాశారు. మహామాన కోరికను గౌరవిస్తూ, బిర్లా ఫిబ్రవరి 7, 1944న అప్పటి రాజా పట్నిమల్ వారసుల నుండి కత్రా కేశవ్ దేవ్ భూమిని కొన్నాడు. దురదృష్టవశాత్తు, జన్మభూమి వద్ద ఆలయాన్ని నిర్మించటానికి ముందే మహామాన మరణించాడు. అందువల్ల, మదన్మోహన్ మాలవీయ యొక్క చివరి కోరిక ప్రకారం, బిర్లా 21 ఫిబ్రవరి 1951న శ్రీ కృష్ణ జన్మభూమి కోసం ఒక ట్రస్ట్ ను స్థాపించి ఆ భూమిని ట్రస్ట్ కు అప్పగించారు. ప్రముఖ వ్యక్తి అయిన శ్రీ జైదయాల్ దాల్మియా మరియు అనేక ఇతర ప్రముఖ హిందువులను ఈ సంస్థ యొక్క ధర్మకర్తలుగా నియమించారు.తరువాత ఆలయ నిర్మాణాన్ని చేపట్టడానికి మరియు శ్రీ కృష్ణ జన్మభూమిని నిర్వహించడానికి శ్రీ కృష్ణ జన్మస్థాన సేవా సంఘం అనే సొసైటీ ఏర్పడింది.

భూమిపై హక్కు పొందడానికి ముస్లింల ప్రయత్నం మరియు 1968 ఒప్పందం:

కృష్ణ జన్మభూమిలో ఈ పరిణామాలతో ఆగ్రహించిన ముస్లింలు మరోసారి ఇద్గా యాజమాన్యం కోసం ప్రయత్నించారు. మరొక పసలేని దావాను వారు దాఖలు చేశారు. ఈ భూమి కృష్ణ జన్మభూమి ట్రస్ట్ కు చెందినదని మరియు ముస్లింలకు ఈద్ సమయంలో నమాజ్ చేయటానికి మాత్రమే హక్కు ఉందనే తీర్పుతో 1960లో ఈ దావా తిరస్కరించబడింది.

ఇద్గా యొక్క పశ్చిమ గోడకు ఆనుకొని ఒక జన్మస్థాన్ చబూత్రా నిర్మించబడింది. ఆ భూమిలో ఆలయం నిర్మించడంపై మరో కేసు నమోదైంది. ఇంతలో, రాజకీయ వాతావరణం మార్పు చెందింది. 1967లో యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ తరువాత అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీగా ఏర్పడిన జనసంఘ్ మద్దతుతో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. దేశవ్యాప్తంగా కాంగ్రేసేతర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మొదలుపెట్టిన తన ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఇందిరాగాంధీ 1968 ఫిబ్రవరిలో యూపీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తీసుకొచ్చింది. రాష్ట్రపతి పాలనలో స్థానిక ప్రభుత్వ అధికారుల “పర్యవేక్షణలో” శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘం మరియు షాహి మసీదు ఇద్గా ట్రస్ట్ లు రాజీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం, ఇద్గా నిర్వహణ ఇద్గా ట్రస్ట్‌కు వదిలివేయబడింది. తమకు కేటాయించిన ఇద్గా & ఆ భూమిలోని కొన్ని భాగాలకు బదులుగా కత్రా కేశవ్ దేవ్‌లోని మిగిలిన భూమి మీద తమ హక్కు వాదనను ఇద్గా ట్రస్ట్ వదిలేసుకుంది. ఈ రాజీ ఒప్పందం కోర్టుకు సమర్పించబడింది. దీనిని ఆమోదిస్తూ కోర్టు కూడా డిక్రీని జారీ చేసింది.

చెల్లని రాజీ:

కానీ ఈ రాజీ ఒప్పందంలో బహుళ సమస్యలు ఉన్నాయి. జన్మభూమి స్థలంలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలనే ఉద్దేశ్యంతో ట్రస్ట్ ఏర్పడింది. అందువల్ల ఆ నిర్దేశిత లక్ష్యాన్ని నిర్వీర్యపరిచే ఏ ఒప్పందమూ చేయడానికి కుదరదు – ఎందుకంటే ఇది ధర్మకర్తల నమ్మకాన్ని ఉల్లంఘించడమే అవుతుంది కాబట్టి. అయితే అంతకన్నా ముఖ్యమైనది ఏమిటంటే రాజీ ఒప్పందం పై సంతకం చేసింది శ్రీ కృష్ణ జన్మస్థాన సేవా సంఘం వారికి ఈ ఆస్తిపై యాజమాన్య హక్కులు కూడా లేవు. ఆలయాన్ని నిర్మించే ఏకైక ప్రయోజనం కోసమే ఆ సంఘం సృష్టించబడింది. ఆస్తి ట్రస్ట్‌కే చెందుతుంది. అందువల్ల, ఆ ఒప్పందానికి ఎటువంటి విలువ లేదు. ఆ ఒప్పందం ఆధారంగా కోర్టు జారీ చేసిన డిక్రీని కూడా పక్కన పెట్టాలి.

ఆరాధన స్థలాల చట్టం:

ఈ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో అమలులోకి తీసుకువచ్చింది – గతంలో దురాక్రమణదారులు ఆక్రమించిన తమ ప్రార్థనా స్థలాలను హిందువులు తిరిగి పొందే హక్కును కాలరాశారు. ఆగష్టు 15, 1947 నాటికి ఏదైనా ప్రార్థనా స్థలం యొక్క మతపరమైన స్వభావం తదనంతరం కూడా అలానే కొనసాగుతుందని చట్టం పేర్కొంది – దానిని మార్చడం నేరపూరిత అపరాధం అవుతుంది. శ్రీ రామ్ జన్మభూమి వివాదానికి ఈ నియమం నుండి మినహాయింపు ఇవ్వబడింది.

పరిష్కారం:

ఈ దేశంలోని హిందువులు న్యాయం పొందే మార్గంలో ఆమోదయోగ్యంకాని అడ్డంకిగా నిల్చున్న ఆరాధనా స్థలాల చట్టాన్ని రద్దు చేయడమో లేదా హిందువుల ప్రధాన పవిత్ర స్థలాలను పునరుద్ధరించడానికి వీలుగా ఈ చట్టం ప్రకారం ఎక్కువ మినహాయింపులు ఇవ్వడమో చేయాలి. రాజీ ఒప్పందం చెల్లదు కాబట్టి, కోర్టు జారీ చేసిన డిక్రీని పక్కన పెట్టాలి. ఈ భూమి శ్రీ కృష్ణ జనభూమి ట్రస్టుకు చెందినది. ముస్లింలు హిందూ భూమిపై ఉన్న ఇద్గా మీద హక్కు అడుగుతున్నారు. ఈజిప్టులోని అబూ సింబెల్ ఆలయం మాదిరిగానే, ప్రభుత్వం ఇద్గా భవనాన్ని విడదీసి మధుర జిల్లాలోని ముస్లిం సమాజానికి చెందిన వేరే భూమిపై అదే భవనాన్ని పునః స్థాపితం చేయాలి. భూమి, నదులు, చెట్లు మరియు ప్రకృతిని దేవునిగా పూజించే హిందూ మతం వలె కాకుండా, ఇస్లాం మతంలో ఏ ప్రత్యేకమైన ప్రదేశంతో అలాంటి అనుబంధాన్ని కలిగి ఉండరాదు, ఎందుకంటే వారు తమ మతం సిద్ధాంతాల ప్రకారం ఏ భూమిని కూడా దేవునిగా పూజించరాదు. అరబ్ దేశాలు వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మసీదులను నేలమట్టం చేయడం మరియు ఆ భూమిని మతేతర ప్రయోజనాల కోసం ఉపయోగించడం మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాము. గట్టిగా వాదిస్తే, ఇద్గాకు కొంత వారసత్వ విలువ ఉందని వాదించవచ్చు. కానీ ముస్లిం సమాజానికి ఆ స్థలం యొక్క భూమితో ప్రత్యేక అనుబంధం లేదు. హిందువులకే ఆ స్థలంతో ప్రత్యేక అనుబంధం ఉంది. భూమి యొక్క యాజమాన్యం హిందువులకు చెందినదని ఇప్పటికే అనేక న్యాయస్థానాలు ధృవీకరించాయి. అంతేగాక ప్రత్యామ్నాయ ప్రదేశంలో ఇద్గాను పునః నిర్మించడం వలన ఇప్పటిలా కేవలం ఈద్‌ దినం రోజున మాత్రమే కాకుండా సంవత్సరాంతం పాటు ముస్లింలకు ఈ నిర్మాణం అందుబాటులోకి వస్తుంది.

అందువల్ల ఇద్గాను మరొక ప్రదేశానికి మార్చి మహామాన పండిట్ శ్రీ మదన్ మోహన్ మాలవీయ స్వప్నం నిజం చేయడానికి హిందువులకు వారి పవిత్ర స్థలాన్ని వారికి తిరిగి ఇవ్వడమే ఈ వివాదానికి ఒక స్నేహపూర్వక మరియు ఆచరణాత్మక పరిష్కారం. ఈ కేసులో యాజమాన్య వివాదం ఇప్పటికే పరిష్కరించబడినందున, మళ్ళీ సుదీర్ఘ కోర్టు పోరాటాలు చేయవలసిన అవసరం లేదు. దీనికి కావలసిందల్లా భక్తుల దృఢనిశ్చయం మరియు హిందువులకు న్యాయం చేయాలన్న ప్రభుత్వం యొక్క సంకల్పం.

Vemana Kappa

0 Reviews

Related post

1 Comment

  • చాలా చక్కగా వ్రాశారు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *