ప్రాచీన ఆర్మేనియాలో హిందువుల చిరస్మరణీయ పోరాటం

 ప్రాచీన ఆర్మేనియాలో హిందువుల చిరస్మరణీయ పోరాటం

ముందు మాట

సాహసవంతుడైన గేట్ కెప్టెన్ హొరాటియస్ అపుడు ఇలా అన్నాడు :

“ఈ భూమ్మీద ఉన్న ప్రతి మనిషికి త్వరగానో లేదా ఆలస్యంగానో మరణం వస్తుంది;

ఒక మనిషి భయంకరమైన అసాధ్యాలను ఎదుర్కొని మరణించడం కంటే గొప్ప మరణం ఏముంటుంది, అతని పితృదేవతల అస్థికల కోసం మరియు అతని దేవుళ్ళ దేవాలయాల కోసం,

మరియు విశ్రాంతి తీసుకోవడానికి అతన్ని జోకొట్టిన కోమలి అయిన తల్లి కోసం,

మరియు అతని బిడ్డకు తన రొమ్ము వద్ద పాలిచ్చే భార్య కోసం,

మరియు అవిచ్చిన్నంగా వెలిగే దీపాలను పోషించే పవిత్ర కన్యల కోసం,

వారిని అపచారం నుండి కాపాడటం కోసం “

పైన ఉదహరించిన కవితను థామస్ బాబింగ్టన్ మెకాలే రచించాడు.నిజానికి మెకాలే మన హిందువులకు శతృవు. అయినప్పటికీ  

మన హిందువుల వంటి క్రైస్తవేతరుల మనస్సును కదలించడంలో ఈ కవిత ఎన్నడూ విఫలం కాలేదు. ఇంకా  చెప్పాలంటే, తమ 

లక్ష్యం నెరవేరే అవకాశం లేకపోయినా, ప్రాచీన ఆర్మేనియా దేశంలో క్రైస్తవ మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడి తమ దేవుళ్ళ 

దేవాలయాలను రక్షించుకునే ప్రయత్నంలో అమరులైన మనం మరచిన మన ప్రాచీన హిందువుల చారిత్రక ఘట్టమే పైన 

ఉదహరించిన కవిత యొక్క వీరస్ఫూర్తికి అసలు సిసలైన నిదర్శనం.

“సెయింట్” గ్రెగొరీ శిష్యుడైన సిరియా రచయిత జెనోబ్ ఈ ఘట్టానికి సాక్షి. అతని కథనం ప్రకారం, కనౌజ్ నుండి వచ్చిన  ఇద్దరు హిందూ యువరాజులు గిస్సానే మరియు డిమీటర్ యొక్క వారసులే అర్మేనియా హిందువులు. తమ రాజైన దినకస్పల్ కు వ్యతిరేకంగా కుట్ర పన్నిన క్రమంలో దొరికిపోయిన వారిరువురూ క్రీస్తుపూర్వం 149లో అర్మేనియాకు పారిపోయి వచ్చారని కథనం. అర్మేనియా రాజు వాలార్సేస్ వారి అనుచరులతో పాటు వారిని స్వాగతించాడని ,వారు పాలించడానికి టారోన్ ప్రావిన్స్ (పశ్చిమ అర్మేనియా, ఇప్పుడు టర్కీ) ఇచ్చాడని, అక్కడ వారు వీషాప్ అనే నగరాన్ని నిర్మించారని కథ. తదనంతరం వారు దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన అష్టీషాట్ నగరంలో అర్మేనియన్ల జాతీయ దేవుళ్ళతో పాటు హిందూ దేవుళ్ళను ప్రతిష్ఠించారు.

తరువాత ఆ అర్మేనియా రాజు ఆ ఇద్దరు హిందూ యువరాజులను ఉరి తీయవలసి వచ్చింది. అయితే అందుకు గల కారణాలను జెనోబ్ వెల్లడించలేదు. ఆ ఇద్దరు యువరాజులకు కుయర్స్, మేఘటెన్ మరియు హోరియస్ అనే ముగ్గురు కుమారులు వారసులు. తారోన్లో తమ తండ్రులు పొందిన అధికారాలు వారికి వారసత్వంగా వచ్చాయి. హిందువులు గిస్సానే (కృష్ణ) మరియు డిమీటర్ల మరణం తరువాత వారిని దేవుళ్లుగా తలంచి వారికి దేవాలయాలను నిర్మించి వారి ఆరాధన కోసం పూజారులను నియమించారు. ఈ కాలనీ సుమారు 450 సంవత్సరాల పాటు అభివృద్ధి చెందడంతో పాటుగా హిందువుల సంఖ్య పెరిగింది. అంతా బావుండి  ఉంటే ఇంకా అభివృద్ధి చెంది ఉండేదేమో.కానీ అపుడే విస్తరించడం మొదలుపెట్టిన మహమ్మారి ధాటికి నిలవలేకపోయింది.

వ్రిష్ణి కుల యోధులు కృష్ణుడు మరియు బలభద్రులే ప్రాచీన అర్మేనియా హిందువుల దేవతలైన గిస్సానే మరియు డిమీటర్లు అని అనుకోవచ్చు. గ్రీకు దేవతయైన డిమీటర్ పంటపొలాలకు అధిపతి. నాగళిని ధరించే బలభద్రుడు అందుకు అచ్చంగా సరిపోతాడు.

క్రీ.శ 301లో క్రైస్తవ ప్లేగును తీసుకొచ్చిన  “సెయింట్” గ్రెగొరీ అప్పటి అర్మేనియన్ పాలకుడు టిరిడేట్స్ III ని క్రైస్తవంలోకి మార్చాడు. తద్వారా ఆ రాజ్యంలో క్రైస్తవేతరులపై హింసాయుత పాలనను ప్రారంభించాడు. అర్మేనియన్ క్రైస్తవేతరులు బలవంతంగా క్రైస్తవంలోకి మార్చబడ్డారు. ప్రేతాలయాలకు మార్గం కల్పించడానికి దేవతల  ఆలయాలు నాశనం చేయబడ్డాయి. ఈ క్రమంలో అక్కడి చిన్న హిందూ మైనారిటీ సమూహాన్ని కూడా గ్రెగొరీ లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ క్రమంలో ఆర్మేనియాలో ఉండిన కొద్ది మంది హిందువులు తమకు అందుబాటులో ఉన్న కొద్దిపాటి వనరులతో చేసిన అపూర్వ ప్రతిఘటనయే ప్రపంచం చూసిన అపూర్వ ఘట్టం. హిందువులు అబ్రహమిక్ మతాలు చేసే విగ్రహ విధ్వంసక చర్యలను ఎదుర్కోవలసి రావడం అదే మొదటిసారి. అటువంటి అసాధ్యమైన సవాలును ఎదుర్కునే క్రమంలో హిందూ పౌరులు తమ ధర్మాన్ని, దేవుళ్ళను రక్షించుకోవడానికి సుశిక్షితులైన  అర్మేనియన్ సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు. 

కవిరాజ్ భూషణ్ ఇలా అన్నారు: “ హిమ్మత అమాన మర్దానా హిందువానహూ కో” ( హిందువులు ధైర్యానికి మరియు పురుషత్వానికి ప్రసిద్ది చెందినవారు.)

అవమానకరంగా మతం మారడం కంటే వీరమరణమే మేలని ఎంచి సాహసమే ఊపిరిగా తమ ధర్మం కోసం పోరాడిన ఆ అర్మేనియా హిందువులకు పైన చెప్పిన కవిరాజ భూషణుని మాటలు సరిగ్గా  సరిపోతాయి. “స్వధర్మే నిధనం శ్రేయః ” (గీత – 3.35) – ఒకరి ధర్మాన్ని వేరే దేనికోసం వదులుకోవడం కంటే ఒకరి ధర్మాన్ని అనుసరించి మరణించడం ఉత్తమమైనది” అనే కృష్ణుడి బోధనను జీర్ణించుకున్న ఆ అర్మేనియా హిందువులు దాన్ని చేతల్లో చూపించారు.

అర్మేనియన్ సైన్యాలకు వ్యతిరేకంగా హిందువుల మైనారిటీ సమాజం చేసిన ప్రతిఘటన గురించి జెనోబ్ ఇచ్చిన స్పష్టమైన వివరణకు వెళ్దాం. అర్మేనియా రాజు మతమార్పిడి తరువాత అర్మేనియన్ దేవతల దేవాలయాలను కూల్చివేసినట్టుగానే తమ గిస్సనే (కృష్ణ) మరియు డిమీటర్ దేవాలయాలను కూడా కూల్చేయాలని వేసుకున్న  క్రైస్తవ ప్రణాళికల గురించి అర్మేనియా హిందువులకు సమాచారం అందింది. హిందువులు ముందుగా ఆలయంలోని విలువైన సంపదను రాత్రికి రాత్రే సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. సైన్యాన్ని సేకరించి వచ్చి తమతో కలిసి ప్రతిఘటనలో పాల్గొనాలని సమీప గ్రామమైన అష్టీషాట్ లోని ఆర్చకలకు సందేశాలు పంపారు.

 ఆ సందేశాన్ని జెనోబ్ ఈ క్రింది విధంగా వర్ణించాడు :

“యుద్ధం చేయగల యోధుడైన ప్రతి మనిషిని సమీకరించి త్వరగా బయలుదేరి వచ్చి రేపటికంతా  మాతో కలవండి. ఎందుకంటే మన గొప్ప గిస్సానే (కృష్ణ) మతభ్రష్టులైన రాకుమారులకు వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్తాడు.”

ప్రధాన అర్చకుడు అర్ట్జాన్ (అర్జున్ – కృష్ణుడి కోసం ఆయుధాలు తీసుకున్న ఒక అర్చకునికి తగిన పేరు) మరియు అతని కుమారుడు డిమీటర్ (బలరాముడు లేదా బలభద్ర అయి ఉండాలి) 400 మంది గల హిందూ దళానికి నాయకత్వం వహించి దేవాలయాలను పడగొట్టడానికి వస్తున్న 300 మంది గల క్రైస్తవ దళంపై ఆకస్మిక దాడికి సిద్ధపడ్డారు. స్వయంగా “సెయింట్” గ్రెగొరీయే  300 మంది ఉన్న అర్మేనియన్ దళాన్ని కృష్ణ ఆలయం ఉన్న కువార్స్ వైపు నడిపిస్తున్నాడు. కువార్స్‌కు ఎదురుగా ఉన్న ఒక కొండపై హిందువులు వ్యూహాత్మకంగా వేచి వున్నారు. ఆ మార్గం గుండానే ఆక్రమణ సైన్యాలు ప్రయాణించాలి.

ముగ్గురు రాకుమారులు మరియు మూడు వందల మంది సైన్యంతో ముందుకు సాగిన “సెయింట్” ఎవరైనా తనను ప్రతిఘటిస్తారని ఊహించలేదు. అర్మేనియన్ రాచరికం యొక్క బలం తనకు అండగా ఉండగా తనను అడ్డుకునే ధైర్యం ఎవ్వరూ చేయరని, ముఖ్యంగా చిన్న మైనారిటీ అయిన హిందువులు అసలు చేయరని అనుకుని ఉంటాడు. కానీ కవిరాజ భూషణుడు భవిష్యత్తులో హిందువుల శార్యపరాక్రమాలు గురించి రాయబోయే మాటలను 13 శతాబ్దాల ముందే నిరూపించడానికే అర్మేనియా హిందువులు జన్మించారని సదరు “సెయింట్” ముందే తెలుసుకోలేకపోయాడు.

హిందువులు వ్యూహాత్మకంగా కాచుకుని ఉన్న కొండపైకి అర్మేనియన్ దళాలు వచ్చిన వెంటనే అర్జున్ తన యుద్ధ కొమ్ములతో యుద్ధనాదం వినిపించి అర్మేనియన్లపై పూర్తి శక్తితో దాడి చేయడానికి తన మనుష్యులతో కలిసి బయటకు వచ్చాడు. స్వయంగా సవ్యసాచి అయిన అర్జునుడే తన సమర శంఖమైన దేవదత్తంతో యుద్ధ శంఖం పూరించి తమపై దండెత్తి వచ్చాడా అన్నట్టు అర్మేనియన్లు భయపడ్డారు. విరాట యుద్ధంలో అర్జునుడిని చూసినప్పుడు కౌరవ సైన్యం హృదయాలలో పుట్టిన భయమే అపుడు తమ దేవుళ్ళను, ధర్మాన్నీ రక్షించుకోవడానికి వచ్చిన హిందువులను చూసిన అర్మేనియన్ల హృదయాలను ఆక్రమించింది.

“సెయింట్” గ్రెగొరీ భద్రత కోసం ముగ్గురు అశ్వికులను ఇచ్చి సురక్షిత ప్రదేశానికి వెళ్ళమని పంపిన రాకుమారులు హిందువులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.విరుచుకుపడుతున్న హిందువులను ఆపడానికి ప్రయత్నించిన అర్మేనియన్ సైనికులు హతమైపోయారు. అర్మేనియన్లు తిరుగుముఖం పట్టి పారిపోతున్న మార్గంలో ఉన్న సమీప గ్రామానికి చెందిన హిందువులు కూడా గుమిగూడి “సెయింట్” గ్రెగొరీ మరియు అతని మనుషులను వెంబడించడం ప్రారంభించారు. గ్రెగొరీ వోగ్ఖాన్ కోట వద్ద ఆశ్రయం పొందాడు. హిందువులు ఆ కోటను ముట్టడించారు. అర్మేనియన్లు సమీపంలో ఉన్న ఇంకొక యువరాజు సహాయం కోసం వేడుకోవలసి వచ్చింది. ఆ యువరాజు తన 4000 మంది సైన్య బలంతో హిందువులను ఓడించటానికి వచ్చాడు.

అంతకు మునుపు ఏ కొండపై అర్మేనియన్లను ఓడించాడో అదే కొండ పైన  అర్జున్ తన బలగాలను మోహరించాడు. మరియు వారి పూర్వీకుల దేవుళ్ళను విడిచిపెట్టినందుకు అర్మేనియన్లను శపించడం ప్రారంభించాడు.

 జెనోబ్ ఆ సంభాషణను ఈ క్రింది విధంగా వర్ణించాడు:

“మీ దేశం యొక్క దేవుళ్ళను విడిచిపెట్టిన మతభ్రష్టులార, రండి ముందుకు రండి; మహోన్నతుడైన గిస్సేనేహ్ యొక్క శత్రువులు మీరు. గొప్ప గిస్సేనేహ్ స్వయంగా మీకు వ్యతిరేకంగా యుద్ధంలో వచ్చాడని మీకు తెలియదా? అతను మిమ్మల్ని మా బారినపడేటట్లు చేసి మీకు అంధత్వాన్నీ, మరణాన్ని కల్పిస్తాడు” అని అన్నాడు.

ఈ సమయంలో ఒక అర్మేనియన్ యువరాజు ముందుకు పరిగెత్తి వచ్చి ఇలా అన్నాడు “ఓహ్ వాచాలుడా, ఒకవేళ మీరు మీ దేవతల కోసం పోరాడుతుంటే, వారు నిజమైన దేవతలు కాదని తెలుసుకోండి. ఒక వేళ మీరు పోరాడుతున్నది దేశం కోసమే అయితే, అంగేజ్  మరియు సన్నీస్ వంశాల యువరాజులు మరియు మీకు తెలిసిన ఇతర ప్రభువులకు వ్యతిరేకంగా పోరాడటం మీ మూర్ఖత్వం”.

దీనికి ఆర్ట్జాన్ కుమారుడు డిమీటర్ ఇలా సమాధానమిచ్చాడు.

“అర్మేనియన్ రాకుమారులారా, మా మాట వినండి, మేము శక్తివంతమైన దేవతల సేవలో నిమగ్నమై ఇప్పటికి  నలభై సంవత్సరాలు అయ్యింది మరియు వారి శక్తుల గురించి మాకు తెలుసు, ఎందుకంటే వారు తమను సేవించేవారి శత్రువులతో స్వయంగా యుద్ధం చేస్తారు. అయితే, మేము అర్మేనియా రాజు యొక్క వంశాన్ని మరియు అతని రాజప్రముఖులైన మిమ్మల్ని యుద్ధంలో వ్యతిరేకించలేము, కాని మీరందరూ తెలుసుకోవలసినది ఏమిటంటే  మేము మిమ్మల్ని జయించలేనప్పటికీ,మా కళ్ళ ముందే మా దేవాలయాలను మీరు కలుషితం చేస్తుంటే చూసి బతికి ఉండడం కంటే మా దేవతల మర్యాదను కాపాడటానికి పోరాడుతూ మరణం పొందడమే మాకు మంచిది. అందువల్ల జీవితం కంటే మరణాన్ని  మేము స్వాగతిస్తాము. అంగేజ్ వంశ  యువరాజు అయిన మీరు ముందుకు వచ్చి మాతో  ఒంటరిగా పోరాడండి. ”   

అర్జునుడి కొడుకు నోటి నుండి ఇటువంటి గొప్ప మాటలు కాక ఇంకేం వస్తాయి!! అధిగమించలేని అసాధ్యాలకు వెరవకుండా మరణం వరకూ పోరాడటానికి ఇష్టపడిన అలనాటి అభిమన్యుడే  మనకు నిజంగా గుర్తుకు వస్తాడు. ఇక్కడ ఈ ఘట్టంలో  తరువాతి యుగానికి చెందిన మరొక అర్జునుడి కుమారుడు ఉన్నాడు. కానీ అలనాటి అభిమన్యుడితో సమానంగా ప్రతి కణం ధైర్యంతో నిండి ధర్మం కోసం అంతే కాంతితో ప్రకాశించడం ఇతనిలో చూడవచ్చు.

ధర్మం కోసం అలాంటి త్యాగానికి ఒడిగట్టడం హిందూ చరిత్రకు తెలియనిది కాదు. అలెగ్జాండర్ మన భూములపై ​​దండెత్తినప్పుడు, ఆ అనాగరికుడికి వ్యతిరేకంగా పోరాడాలని స్థానిక పాలకులను బ్రాహ్మణులు ప్రోత్సహించారు. బ్రాహ్మణులు పశ్చిమ ఆర్యవర్త మొత్తాన్ని అతనిపై తిరుగుబాటుకు ఉసిగొల్పడంతో అలెగ్జాండర్ బ్రాహ్మణ సమాజం పట్ల తీవ్రమైన ఆగ్రహంతో వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతారు. అలెగ్జాండర్ కు లొంగకుండా  చివరి మనిషి వరకు పోరాడిన అనేక చిన్న నగర రాజ్యాల గురించి గ్రీకులు  ప్రస్తావించారు. పర్షియన్లు తమ మహాసామ్రాజ్యాన్ని గ్రీకులకు బేలగా సమర్పించారు కానీ భారతదేశంలోని చిన్న చిన్న రాజ్యాలలోని హిందువులు కూడా ఆ గ్రీకు విజేతను తీవ్రమైన శ్రమకు గురిచేశారు. తరువాత, ముస్లింల దండయాత్రల సమయంలో, మహిళలు జౌహర్ ద్వారా ఆత్మాహుతి చేసుకుంటే  పురుషులు అధిగమించలేని అసాధ్యాలకు వ్యతిరేకంగా పోరాడి మరణించారు.తమ స్వధర్మాన్ని మార్చవలసి వస్తుంది అనే అవమానానికి గురి కాకూడదనే వారు అలా చేశారు. తమ దేవాలయాలను గ్రెగొరీ మనుషులు కలుషితం చేయడాన్ని చూడటం కంటే తమ దేవుని మర్యాదను నిలబెట్టడానికి పోరాడుతూ మహోన్నతమైన మరణాన్ని చేరుకుంటామని గర్జించిన అర్మేనియాకు చెందిన ఈ అభిమన్యుని మాటలలో అదే ఆదర్శం ప్రతిధ్వనిస్తుంది. 

వృద్ధుడైన అర్జున్ మరియు అర్మేనియన్ యువరాజుల మధ్య జరిగిన ద్వంద్వ పోరాటంలో, అర్జున్ యువరాజును గాయపర్చినప్పటికీ ఆ యువరాజు అర్జున్‌ను చంపగలిగాడు. ఈ విజయం గురించి అర్మేనియన్ దళాలు ఆనందిస్తుండగా, తమ అర్చకుల నేతృత్వంలోని హిందూ పౌరులు ఆ కొండపైకి వచ్చి అర్మేనియన్లపై తీవ్ర ప్రతీకారంతో దాడి చేయడం ప్రారంభించారు. అర్మేనియన్ దళాలు కొండ కింది వైపుకి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు, హిందూ పదాతిదళం రాళ్ళు మరియు ఆయుధాలను వారి పైకి విసిరి వారి అశ్వికదళానికి నష్టం కలిగించగా, పర్వత ప్రాంతాల వద్ద గుమిగూడిన గ్రామస్తులు పారిపోతున్న అర్మేనియన్లపై దాడి చేయడం ప్రారంభించారు.  యువరాజులు సుశిక్షితులైన అర్మేనియన్ సైన్యాన్ని చెల్లాచెదరు కాకుండా గుంపు చేసి మోహరించారు. కొండకు ఒక వైపున పట్టు సంపాదించి సూర్యుడు అస్తమించటం ప్రారంభించే వరకు పట్టును కాపాడుకోగలిగారు – ఆ సమయంలో యుద్ధం నిలిపివేయబడింది.

మరుసటి రోజు, జెనోబ్ ప్రకారం, హిందువులు 6946 మందిని సమీకరించగలిగారు, అర్మేనియన్లు 7080 మంది సైనికులను సమీకరించారు. సమీపంలో కొన్ని వేల సంఖ్యలో ఇతర అర్మేనియన్ దళాలు ఉన్నాయి – వీరు హిందూ గ్రామాలను దోచుకొని నాశనం చేశారు. అర్మేనియన్ సైన్యంలో శిక్షణ పొందిన యోధులు ఉండగా హిందూ సైన్యంలో మాత్రం తమ దేవాలయాలు మరియు ధర్మాలను రక్షించడానికి పూనుకుని వచ్చిన స్థానిక హిందూ పౌరులే ఉన్నారు. బాగా శిక్షణ పొందిన సైన్యం ఉన్న అర్మేనియన్లు హిందువులపై క్రమంగా పైచేయి సాధించడం ప్రారంభించారు. ఆర్మేనియన్ సైన్యంలో ఉన్న సామంతుడైన  హిందూ మతస్థుడైన హష్ట్యాంక్ యువరాజు గ్రెగొరీ సమూహాలకు వ్యతిరేకంగా తన హిందూ సోదరుల వైపుకు మారినప్పుడు హిందువులకు ఆశలు చిగురించాయి. అర్మేనియన్ దళాలు అతని నాయకత్వంలో ఉన్నాయి – అతను గొప్ప యోధుడు మరియు నాయకుడు. కానీ ఇతర అర్మేనియన్ యువరాజులు తమ దళాలను మళ్లీ సమీకరించడంతో పాటు ఆర్మేనియన్ యువరాజులలో ఒకరు హష్టియాంక్ యువరాజును శిరచ్ఛేదనం చేయడంతో  ఆ ఆశలు ఎక్కువ సేపు నిలబడలేదు. అర్జున్ కుమారుడు డిమీటర్ అర్మేనియన్ యువరాజు కొడుకును చంపగలిగాడు. కానీ బాగా శిక్షణ పొందిన అర్మేనియన్ దళాలను ఆపడానికి ఇది సరిపోలేదు.

తమ సైన్యం యొక్క నాయకులు, ఆలయ అర్చకులు ఒకరి తరువాత మరొకరు యుద్ధంలో పడిపోతున్న తరుణంలో తాము ముందే ఊహించిన ఓటమి యొక్క భయంకరమైన దృశ్యం హిందువులకు స్పష్టమైంది. అర్జున్ కుమారుడు మరియు వారి చివరి నాయకుడు డిమీటర్ కూడా శిరచ్ఛేదం చేయబడ్డాడు. అతని తలని అర్మేనియన్ యువరాజు ఒక సంచిలో సేకరించాడు. ఈ యుద్ధంలో 1038 మంది హిందువులు చంపబడ్డారు మరియు మిగిలిన వారిని సజీవంగా బంధించి నగ్నంగా నిలబెట్టారు.

స్థానిక హిందూ పూజారులు చనిపోయిన తమ వారిని అక్కడే పాతిపెట్టారు మరియు చనిపోయిన అర్మేనియన్లను కూడా సమాధి చేశారు. జెనోబ్ ప్రకారం, సిరియాక్ మరియు గ్రీకు భాషలలో ఈ స్థలం క్రింది శాసనంతో గుర్తించబడింది:

“ఇది ప్రధాన పూజారి మరియు గొప్ప యోధుడైన అర్ట్జాన్ మొదటి యుద్ధం. అతనితో పాటుగా 1038 మంది పురుషులను ఇక్కడ ఖననం చేశారు. గిస్సేనే మరియు డిమీటర్ విగ్రహాల కోసం మరియు క్రీస్తు కోసం మేము ఈ యుద్ధంలో పోరాడాము. ”

“సెయింట్ ” గ్రెగొరీని తిరిగి తీసుకువచ్చారు .కృష్ణ మరియు బాలభద్ర యొక్క మూర్తులను నాశనం చేయాలని అతడు ఆదేశించాడు. ఆ సమయంలో ఇంకా బ్రతికే ఉన్న ఆలయానికి చెందిన ఆరు మంది అర్చకులు ఆలయంలోకి ప్రవేశించిన అర్మేనియన్లతో పోరాడారు. ఆ అర్చకులు ఇలా పేర్కొన్నారు :

“గొప్ప గిస్సానే నాశనం అవ్వడం అంటూ జరిగితే అది మా మరణం తర్వాతే జరుగుతుంది!”

దేవాలయాలను చివరి శ్వాస వరకు రక్షించిన రాజ్‌పుత్ యోధులను ఇది గుర్తు చేస్తుంది. అలావుద్దీన్ పాలనలో సోమనాథ ఆలయాన్ని కాపాడుకుంటూ యోధులు ఎలా మరణించారో కవి పద్మనాభ వర్ణించాడు. ఈ సంప్రదాయాన్ని అర్మేనియాలోని  హిందువుల చిన్న సమాజం మొదలుపెట్టింది.18వ శతాబ్దం చివరిలో యూరోపియన్ ఆక్రమణదారుల నుండి ఆలయాన్ని కాపాడటానికి 3000 మంది రాజ్‌పుత్‌లు శ్రీరంగం ఆలయంలో తిష్ట వేసుకుని కూర్చున్నారు. తమలో చివరి ప్రాణం పోయేంతవరకు హిందూయేతరులు చొరబడకుండా ఆలయాన్ని రక్షించుకుంటామని వారు శపథం చేశారు. బ్రిటిష్ వారు ఆ ఆలయంలో ఎటువంటి అపచారానికి పాల్పడకుండా ఆ చర్య నిరోధించింది. మతభ్రష్టత్వానికి గురికావడం కంటే మరణమే మేలనే తీవ్ర జ్వాల అర్మేనియా హిందువులలో మొదలై తర్వాతి తరాల హిందూ యోధులచే కొనసాగింపబడిండి. మరణం అంటే లెక్క లేకపోవడం మరియు ధర్మాన్ని రక్షించాలనే దృఢ సంకల్పమే ముస్లిం పరిపాలనలో కూడా హిందూ ప్రతిఘటన ఉద్యమాలకు ప్రధాన ప్రేరణ అయ్యింది.

గ్రెగొరీ ఆ రెండు దేవాలయాలను (కృష్ణ & బాలభద్ర) నాశనం చేసి, వాటి అవశేషాలపై చర్చిని నిర్మించాడు. ఒక అర్చకుడు  సజీవంగా పట్టుబడ్డాడు.ఆలయ సంపద ఎక్కడ దాగి ఉందో తెలుసుకోవడానికి అతన్ని హింసించారు. అనాగరికులకు ఆలయ సంపదను అర్పించడం కంటే మరణాన్ని స్వీకరించడమే తన ధర్మమని తలచిన అర్చకుడు నోరు విప్పలేదు. 

గ్రెగొరీ అప్పుడు హిందూ గ్రామాల పౌరులను క్రైస్తవ మతంలోకి మార్చాడు. మహిళలే కాకుండా 5000 మంది పురుషులు మరియు యువకులు బాప్తిస్మం తీసుకున్నారు. దీని తరువాత, అతను అర్చకుల పిల్లలను మరియు దేవాలయాల పరిచారకులను, మొత్తం 438 మందిని గుంపు చేశాడు. అతను వారికి కూడా బాప్టిజం ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ఆ పిల్లలు ఇలా బదులిచ్చారు :

“దీన్ని గుర్తుంచుకోండి, మేం జీవించినంత కాలం, మేము మీపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము; మేం చనిపోయినా, మా దేవతలు వారి ప్రతీకారం తీర్చుకుంటారు ”

ఒక అర్మేనియన్ యువరాజు వారికి గుండు చేయమని ఆదేశించాడు ( ఆర్మేనియన్ హిందువులు పిలకలను పెట్టుకునేవారు) మరియు ఈ ధైర్యవంతులైన పిల్లలను జైలుకు పంపారు. దీని తరువాత వారు ఏమైపోయారో ఎవరికీ తెలియదు. వారికి ఏమి జరిగి ఉంటుందో మనం ఊహించవచ్చు. తమ దేవుళ్ళను విడిచిపెట్టే అవమానానికి గురికావడంకంటే హింసకు గురయ్యి మరణాన్ని పొందడమే మేలని తలచిన ఈ ధైర్య యువ ఆత్మలు అనుభవజ్ఞులైన యుద్ధయోధుల వలననే తమ ముగింపును చేరుకున్నారు

ఆ విధంగా అర్మేనియా హిందూ పౌరులు మతమార్పిడి చేయబడ్డారని జెనోబ్ పేర్కొన్నాడు.అయినప్పటికీ వారు తమ పూర్వీకుల మతాన్ని వదులుకోలేదు. హిందువులు తమ పిల్లలు పిలకలు పెట్టుకునేలా చూసుకున్నారు మరియు రహస్యంగా వారి దేవుళ్ళను ఆరాధించడం కొనసాగించారు. హిందువుల ఈ ధోరణి పట్ల క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలని జెనోబ్ హెచ్చరించాడు. లేకపోతే ఈ పద్ధతి ఇతర దేశాలకు వ్యాపిస్తుందని రాశాడు. అర్మేనియాలో ఆ శతాబ్దం తరువాత హిందువుల గురించి ఏ సమాచారం లేదు. క్రైస్తవ మతోన్మాదులు ఈ ఆర్మేనియా హిందూ సమాజం అవశేషాలను పూర్తిగా నాశనం చేశారని తెలుస్తోంది.

ఆ విధంగా హిందువులు మరియు అబ్రహమిక్ మతోన్మాదుల మధ్య మొదటి పోరాటం ముగిసింది. ఇతర అర్మేనియన్ క్రైస్తవేతరులు సైన్యం యొక్క శక్తికి భయపడి మతం మార్చుకున్న అదే భూమి మీదనే హిందువులు ధైర్యసాహసాలతో పోరాటం చేశారు.తద్వారా తమ మతం మరియు సాంప్రదాయాలను పరిరక్షించడానికి శతాబ్దాల పోరాటానికి నాంది పలికి స్ఫూర్తిగా నిలిచారు. మన వైపు నుండి చేసిన అనేక తప్పుల వల్ల మన భూములలో, ప్రజలలో సగం వరకూ కోల్పోయినా, మనం ఇంకా హిందువులుగానే మనుగడ కొనసాగిస్తున్నాము అంటే అది మన ధర్మం యొక్క అతి పెద్ద బలం వల్లనే అనే విషయాన్ని మనం కాదనలేం – బేలగా లొంగిపోవడం కంటే అధిగమించలేని అసాధ్యాలను ఎదుర్కోవటానికి ధర్మాన్ని అనుసరించేవారిని ప్రేరేపించడమే ఆ బలం.

Vemana Kappa

0 Reviews

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *