దక్షిణ భారత రక్షకుడు – వేంకటపతి దేవరాయలు

 దక్షిణ భారత రక్షకుడు – వేంకటపతి దేవరాయలు

తళ్ళికోట తదనంతర రెండు దశాబ్దాలు 

తళ్ళికోట యుద్ధం తరువాతి దశలో విజయనగర రాజ్యం వరుస పరాజయాలతో తన భూభాగాలను కోల్పోతూ దురదృష్ట దశలో పడిందనే అభిప్రాయం చరిత్రకారులలో, ప్రజలలో ఉంది. కేవలం తమ సరిహద్దులను కాపాడుకోవడమో లేక  కోల్పోవటం మాత్రమే జరిగిందని, సాళువ  నరసింహ కాలం నుండి ఆలియ రామరాయ పరిపాలించిన చివరి రోజుల వరకు ఉండిన దూకుడు, వీరత్వం తళ్ళికోట తర్వాత కనపడలేదనే అభిప్రాయం ఉంది. కాని జరిగిన వాస్తవం వేరు.

1565 నుండి 1585 మధ్యన రెండు దశాబ్దాల పాటు  విజయనగర సామ్రాజ్యాన్ని దురదృష్టం, అపకీర్తి వెంటాడిన మాట వాస్తవమే .తళ్ళికోట యుద్దంలో ఒక కన్నుతో  పాటు తన పెద్ద కుమారుడిని కోల్పోయిన తిరుమల రాయ విజయనగరంలో హిందూ పరిపాలనను తిరిగి నెలకొల్పడానికి ప్రయత్నించాడు. కాని బీజాపూరు మరియు గోల్కొండ రాజ్యాల మహమ్మదీయ పరిపాలకుల వరుస దాడుల వలన 1567 సం!!లో విజయనగరాన్ని వదిలేసి పెనుకొండకు రాజధానిని మార్చాడు. తన కుమారుడు రంగ రాయనికి పరిపాలనను అప్పగించిన సమయం వరకూ తన రాజ్యం యొక్క ఉత్తర భాగంలో అనేక ఆక్రమిత దాడులను ఎదుర్కుంటూనే ఉన్నాడు. ఆ దాడులలో ఆదోని, తుర్కల్, ధార్వాడ మరియు బంకపూర్ ప్రాంతాలను బీజాపూర్ పరిపాలకుడు అదిల్షాకు కోల్పోయాడు. తన రాజధానిని పెనుకొండకు మార్చడం వలన రాయచూర్ అంతర్వేది ప్రాంతాన్ని తిరిగి గెలుపొందే అవకాశం లేకపోయింది. ఈ విధంగా విజయనగర సామ్రాజ్యం బలహీన పడటాన్ని అవకాశంగా చేసుకొని పోర్చుగీసువారు పడమటి తీరాన ఉన్న నాయక్ లను తమకు కప్పం చెల్లించే విధంగా ఒత్తిడి తెచ్చారు. పొరుగున ఉన్న మహమ్మదీయుల వలన తన రాజ్య ఉత్తర ప్రాంతంలో వరుసగా దాడులను ఎదుర్కుంటున్న చక్రవర్తి పడమటి తీరాన ఉన్న నాయక్ లకు ఎటువంటి సహాయం చేయలేకపోవటం వలన నాయక్ లకు మరియు చక్రవర్తికి దూరం పెరిగింది.

కాని ఒక్కో సంవత్సరం గడిచేకొద్దీ రంగరాయని అదృష్టం చేజారడం మొదలయ్యింది. కాని మొదట్లో గోల్కొండ రాజ్యం ఆక్రమించుకున్న కోటలను తిరిగి గెలుచుకున్నాడు. 1576 సంవత్సరానికి చెందిన శాసనం ప్రకారం  రంగరాయడు వినుకొండ మరియు కొండవీడులను ఆక్రమించుకున్నాడు. అంటే అంతకు ముందే గోల్కొండ సైన్యం వాటిని గెల్చుకొని ఉండాలి. పశ్చిమ కనరీసు జిల్లాలకు చెందిన నాయక్ రాజులు సుల్తాన్ ఆదిల్షాకు తమ విధేయతను ప్రకటించారు. 1575లో ఆదిల్షా పెనుకొండను ముట్టడించాడు. అపుడు తన సామంతుడైన బుక్కరాయసముద్రం హండె నాయకుని సాయంతో రంగరాయడు ఆ ముట్టడిని తిప్పికొట్టాడు. కాని మరుసటి సంవత్సరమే పెనుకొండ దిశగా వస్తున్న ఆదిల్షా దండయాత్రని అడ్డుకునే ప్రయత్నంలో బీజాపూరు సైన్యానికి సజీవుడిగా దొరికిపోయాడు. ఈ దెబ్బకు హిందూ సైన్యం చెల్లచెదరై వెనుదిరిగింది. పెద్దమొత్తాన్ని చెల్లించి రంగరాయని విడిపించుకున్నారు.అంతకు ముందు సంవత్సరం రంగరాయనికి తోడుగా నిల్చిన బుక్కరాయసముద్రం హండె నాయకుడు ఈ హిందూ సామ్రాజ్యం మరి కొన్ని రొజులలొనే అస్తమించబోతుందని భావించి ఆదిల్షా వైపుకు ఫిరాయించాడు. పదకొండు సంవత్సరాల కాలంలో రెండు పర్యాయాలు హిందూ రాజులు సుల్తానుల చేతికి చిక్కారు. తళ్ళికోట తరువాత తుంగభద్రకు ఉత్తరాన వున్న రాజ్యభాగాలను పొగొట్టుకున్న హిందూ సామ్రాజ్యం తన రెండవ ఓటమి తర్వాత పెనుకొండకు ఉత్తరాన ఉన్నదంతా పొగొట్టుకుంది. ఆ తరువాతి సంవత్సరమే, మరోసారి అదిల్షా పెనుకొండ పైకి దండెత్తి వచ్చాడు. కానీ ఈసారి చక్రవర్తి అల్లుడైన జగ్గదేవరాయడు బీజాపూరు సైన్యానికి సారధ్యం వహిస్తున్న నలుగురు సైన్యాధ్యక్షులలో ఇద్దరిని వధించడంతో పాటు ముస్లిం సైన్యానికి తీవ్ర నష్టాన్ని కలిగించి వారిని తరిమేశాడు. కొన్ని ప్రాంతాలను తిరిగి పొందినప్పటికి అంతకు ముందు కోల్పోయిన ప్రాంతాలనన్నింటినీ తిరిగి పొందలేకపోయారు. సామ్రాజ్యం వరుసగా వెనకడుగులు వేస్తూనే ఉంది. దీనితో పాటుగా నాయక్ పరిపాలకుల తిరుగుబాటు మరియు ద్రోహ చర్యలు కూడా సామ్రాజ్యం బలహీనమవడానికి తోడ్పడ్డాయి. 

1579 తర్వాత గోల్కొండ సుల్తాను కుతుబ్షా తన సైన్యాలను దండయాత్రకు పంపి వినుకొండ, కొండవీడు, బెల్లంకొండ మరియు ఉదయగిరులను ఆక్రమించుకున్నాడు. ద్రోహ బ్రాహ్మణుడైన మురారిరావు ఆధ్వర్యంలోని గోల్కొండ సైన్యం అహోబిల పుణ్యక్షేత్రాన్ని ఆక్రమించుకొని కెంపులతో అలంకరించబడిన విష్ణుమూర్తిని తమ సుల్తానుకు పంపించారు. కానీ  ఈ ఒక్క విషయంలో మటుకు తర్వాతి కాలంలో రంగరాయడు ముస్లింలను పూర్తిగా ఓడించగలిగాడు. అహోబిల మఠాధిపతైన శ్రీవాన్ శఠగోప స్వామి తనకు శ్రీమహావిష్ణువు కలలో కనిపించి వేంకటరాజు మరియు తిరుమలరాజు అను ఇద్దరు సైన్యాధ్యక్షుల ఆధ్వర్యాన సామ్రాజ్య సైన్యాలను అహోబిలానికి పంపి అక్కడ తన ఆరాధనను తిరిగి నెలకొల్పాలని చెప్పాడని రంగరాయనికి తెలిపాడు. అహోబిలంలో ఉన్న గొల్కొండ సైన్యాల మీదకు ఆ ఇద్దరు సైన్యాధిపతుల ఆధ్వర్యంలో తన సైన్యాన్ని పంపాడు చక్రవర్తి. ఊహించినట్టుగానే వారు ముస్లిం సైన్యాల మీద విజయం సాధించడమే కాకుండా మురారిరావుని కూడా సజీవంగా పట్టుకున్నారు. కాని బ్రాహ్మణుడు అన్న ఒకే ఒక కారణం చేత అతడిని చంపకుండా వదిలేశారు.

సామ్రాజ్యం యొక్క తూర్పు భాగం గోల్కొండకు కోల్పోగా పడమటి మరియు వాయువ్య భాగాలను ఆదిల్షా ఆక్రమించుకున్నాడు. దక్షిణ మరియు పడమటి తీరాలలొ తన సామంతుల తిరుగుబాట్లను రంగరాయడు అణిచివేయగలిగాడు. తన పరిపాలన చివరిలో అహోబిలాన్ని తిరిగి పొందినప్పటికీ 1585-86లో తాను తుదిశ్వాస విడిచే సమయానికి పెనుకొండకు ఉత్తరాన ఉన్న చాలా భాగాలను పూర్తిగా కోల్పోవలసి వచ్చింది. శ్రీ కృష్ణ దేవరాయని ప్రతాపం కారణంగా తాము ప్రతి ఏటా జరిపే జీహాద్ దండయాత్రలను నిలిపేసిన సుల్తానులు తళ్ళికోట తరువాత వాటిని పునఃప్రారంభించారు. సుల్తానులు నిర్ణయాత్మక ఆధిపత్యాన్ని సాధించగలిగారని చెప్పడానికి ఇది ఉదాహరణ. చంద్రగిరిలో చక్రవర్తి ప్రతినిధిగా పరిపాలన చూస్తున్న చక్రవర్తి తమ్ముడు వేంకటపతి రాయలు లంకకు దండయాత్రకు వెళ్ళి కప్పాన్ని సాధించుకొని వచ్చాడు.(సామ్రాజ్యం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో సాధింపబడిన ఈ విజయం తరువాతి కాలంలో వేంకటపతి ఆధ్వర్యంలో సామ్రాజ్యం యొక్క గమనం తిరోగమనం నుండి పురోగమనం వైపుకు మళ్ళించబడుతుంది అన్నదానికి సంకేతం)

వేంకటపతి దేవరాయల పట్టాభిషేకం

ఈ సంకటస్థితిలోనే పెనుకొండలో విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని వేంకటపతిదేవరాయలు(చరిత్రకారులు వేంకటపతి రాయలు అని పిలుస్తారు) అధీష్టించాడు. తిరుమల రాయని నలుగురి కుమారులలొ చివరివాడైన వేంకటపతిరాయలు తన అన్న రంగరాయని మరణం తర్వాత సింహాసనాన్ని అధిష్టించాడు. తన ఇంకొక అన్నకు ఉన్న కొడుకులకు సింహసనాన్ని అధిష్టించే హక్కు ఉన్నప్పటికీ బ్రాహ్మణులు,సైన్యాధ్యక్షులు మరియు కొలువులో ఉన్న మంత్రులు అందరూ కలిసి ఆ విపత్కర సమయంలో సామ్రాజ్యాన్ని పరిపాలించగల సమర్థుడిగా వేంకటపతిని ఎంచి అతడినే సింహాసనం ఎక్కించారు. ప్రతి దిశలోనూ చేజారిపోతూ మరికొన్ని సంవత్సరాలలో అంతమైపోతుందా అన్నట్లుంది సామ్రాజ్యం పరిస్థితి. పెద్ద సామంత రాజ్యాలన్ని సామ్రాజ్యానికి సహకరించకుండా స్వతంత్రమయ్యే ప్రయత్నంలో ఉన్నాయి. నాయక్ పరిపాలకులు విద్యారణ్యస్వామి వారి హిందూ ఐక్యతా దృక్పథాన్ని మరచిపోయి తమ స్వార్థం కోసం సామ్రాజ్యం యొక్క పునాదులనే నాశనం చేస్తున్నారు.

13-14 సంవత్సరాల వయసువాడైన తన రాజగురువు లక్ష్మీ కుమార తాతాచార్యుల చేత శ్రీమద్ రాజాధిరాజ పరమేశ్వర శ్రీ వీరప్రతాప శ్రీ వీర వేంకటపతి దేవరాయ మహారాజుగా వేంకటపతి దేవరాయ పట్టభిషిక్తుడయ్యాడు. తళ్ళికోట యుద్దం తర్వాతి రెండు దశాబ్దాలు విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేసినా వేంకటపతి రాయని హయాంలో అదృష్టం మారింది. తిరుమల వేంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో ఉంచిన ముగ్గురు చక్రవర్తుల విగ్రహాలలో వేంకటపతి రాయలది ఒకటి. మిగిలిన రెండు విగ్రహాలలో ఒకటి శ్రీకృష్ణ దేవరాయలది కాగా మరొకటి ఆయన తమ్ముడు అచ్యుత రాయలది. వేంకటపతి రాయల యుద్ద విజయాలను మరియు ఘనకార్యాలను ఇపుదు పరిశీలిద్దాం.

గోల్కొండ రాజ్య భూభాగాల ఆక్రమణ

తన అన్న హయాంలో గోల్కొండ వారు ఆక్రమించుకున్న ప్రాంతాల మీదకు దండయాత్రతో వేంకటపతి రాయలు తన పరిపాలన మొదలుపెట్టాడు. గోల్కొండ సుల్తాన్ కుతుబ్ షా పెద్ద ఎత్తున సైన్యాన్ని పంపి వేంకటపతిని తిప్పికొట్టడమే కాకుండా పెనుకొండను ముట్టడించాడు. దీనితో శాంతియుత పరిష్కారం కోరుతూ కుతుబ్షా వద్దకు వేంకటపతి తన రాయబారులను పంపాడు. ఈ లొంగుబాటు తర్వాత కుతుబ్షా సైన్యాలు పెనుకొండ వదిలేసి వెళ్ళిపోయాయి. తాను కొత్తగా ఆక్రమించుకున్న ప్రాంతాలు తమ వద్ద భద్రంగానే ఉంటాయని కుతుబ్షా భావించాడు. కాని వ్యూహం పన్నడంలో, ఎత్తుగడలు వేయడంలో నిష్ణాతుడైన వేంకటపతి దీర్ఘకాల ముట్టడిని తట్టుకోవడానికి అవసరమైన సామాగ్రిని మూడు రోజులలోనే కోటలో నింపాడు. నాలుగవ రోజున జగ్గదేవరాయడు ముప్పైవేల సైన్యంతో కోటలోకి ప్రవేశించి రక్షణను బలోపేతం చేశాడు. తర్వాతి కాలంలో చక్రవర్తి కుడిభుజంగా పేరుతెచ్చుకున్న మట్ల అన్నరాజు కూడ కోట రక్షణలో పాలుపంచుకున్నాడు. కొన్ని రోజుల క్రితం వరకు రక్షణ లేని కోట ఇప్పుడు శతృదుర్భేద్యమయ్యింది. తంజావూరు నాయక్ రాజ్య యువరాజు రఘునాథ నాయకుడు కూడా తన సైన్యంతో వచ్చి చేరాడు. తన తప్పుని గ్రహించిన సుల్తాను మరోసారి ముట్టడికి తిరిగివచ్చాడు. కాని అదొక నిష్ఫల ప్రయత్నమయ్యింది. రఘునాథ నాయకుడు, మట్ల అన్నరాజు మరియు జగ్గదేవరాయడు గొల్కొండ సైన్యాలను తీవ్ర పరాజయం పాల్జేశారు. ఆ దెబ్బతో గోల్కొండ సైన్యాలు ముట్టడి ముగించి తిరుగుముఖం పట్టాయి.

పెన్నార్ ఊచకోత 

కుతుబ్షా సైన్యాలను వెంబడించిన వేంకటపతి పెన్న నది ఓడ్డున స్వయంగా సైన్యాన్ని నడిపాడు.పెన్నా నదిలో గోల్కొండ సైన్యాల మీద మాటు వేసి దాడి చేసిన వేంకటపతి సైన్యం 50000 మంది ముస్లిం సైన్యాన్ని ఊచకోత కోసి నదిని ఎర్రటి రక్తంతో ఎరుపెక్కించారు . వేంకటపతి యొక్క ఈ విజయం కుతుబ్షా సేనల వెన్నెముక మీద దెబ్బకొట్టింది. తళ్ళికోట యుద్దం తర్వాత తొలిసారిగా హిందూ సైన్యాలు దురాక్రమణదారులను నిర్ణయాత్మకంగా అణిచివేశాయి. కృష్ణ దేవరాయలు మరియు ఆలియ రామరాయల కాలంలో సుల్తానుల గుండెలను ఆవరించుకొనిన భయం మరోసారి తిరిగివచ్చింది. ఈ విజయం తర్వాత వేంకటపతి మిగిలిన కుతుబ్షా సైన్యాలను కృష్ణా నది తీరంవరకు వెంబడించాడు. పెనుకొండ కోట మీద ముట్టడిని ఎత్తేసి తిరుగు ముఖ ప్రయాణం మొదలుపెట్టిన క్షణం నుండి యువరాజు ముహమ్మద్ షా రోజుకొక యుద్దం ఓడిపొయాడని చెబుతారు. కృష్ణా నదికి  దక్షిణంగా ఉన్న ప్రాంతాలను పరిపాలిస్తున్న కుతుబ్షా సామంతులు కుతుబ్షాకు ఎదురుతిరిగి విజయనగర సైన్యంతో కలిసిపోయారు. అదే సమయంలో తమ గోల్కొండ రాజ్య ఉత్తర భాగం మీద దండెత్తి వచ్చిన మొగలు యువరాజు మురద్ సైన్యాలతో గోల్కొండ సైన్యాలు పోరాడవలసి వచ్చింది. ఈ విభజన వేంకటపతికి మరింత అనుకూలంగా పనిచేసింది.

కుతుబ్షా సైన్యాల అణిచివేతపొగొట్టుకున్న ప్రాంతాల పునరాక్రమణ

కృష్ణా నదికి దక్షిణాన ఉన్న తన రాజ్యభాగాలను కాపాడుకోవడానికి సమర్థుడైన సైన్యాధిపతి అమిన్-ఉల్-ముల్క్ ను పంపడం ద్వారా ఈ విపత్కర వైఫల్యం నుండి బయటపడే ప్రయత్నం చేశాడు కుతుబ్షా. అమిన్-ఉల్-ముల్క్ కొంతవరకు తిరుగుబాట్లని అణిచివేసినప్పటికి అది తాత్కాలికమే; ఒక సంవత్సర కాలంలోనే వేంకటపతి ఈ ముస్లిం సైన్యాలను కృష్ణ అవతలకి తరిమేశాడు. ముస్లిం రాజ్యాల చరిత్ర నమోదు పుస్తకాలు వేంకటపతి కొండవీడుని తిరిగి ఆక్రమించుకోలేకపోయాడని చెబుతున్నప్పటికీ ఆ పుటలను జాగ్రత్తగా పరిశీలిస్తే అదంతా అబద్ధమని అర్ధం అవుతుంది. వేంకటపతి కొండవీడు మీద దండెత్తినపుడు గొల్కొండ శ్రేణులలో వచ్చి చేరుతున్న సైన్యాలను చూసి అప్రమత్తుడై శాంతియుత సంధిని కోరాడని ఆ పుస్తకాలు చెబుతాయి. కాని వేంకటపతి ఒక ముస్లిం సైన్యాధిపతిని చంపడంతో పాటు కస్సీంకోట( ఉత్తర విశాఖపట్టణం)ను చేరటం, కస్సీంకోట పరిపాలకుడు ముకుంద రాజు విజయనగరం పక్షానికి ఫిరాయించడం వంటి వాస్తవాలను గమనిస్తే.. వేంకటపతి కొండవీడుని జయించడంతోనే సరిపెట్టుకోకుండా తీరం వెంబడి కృష్ణా నదిని దాటి కస్సీంకోట మరియు పాలకొండ వరకు ఉన్న తీరప్రాంతాలను ఆక్రమించుకున్నాడని అర్థం అవుతొంది. అంటే, నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తీరప్రాంతమంతా వేంకటపతి అధీనంలోకి వచ్చింది.

ఆదిల్ షా ఓటమి

ఆదిల్ షా కనరీస్ జిల్లల మీద దండెత్తి పెనుకొండని ముట్టడించాడు. కాని వేంకటపతి బీజాపూరు సైన్యంలోని ఒక హిందూ సైన్యాధిపతిని తన పక్షానికి తిప్పుకొని బీజాపూరు సైన్యాన్ని ఓటమి పాలుచేశాడు. దీని వలన సుల్తాను తన రాజధానికి పలాయనమయ్యాడు. సుల్తాను సైన్యాలు వెనక్కు మరలుతున్న సమయంలోనే వేంకటపతి బీజాపూరు భూభాగలను కొన్నిటిని తన వశం చేసుకోగలిగాడు. పడమటి కనరీసు జిల్లల మీద తిరిగి దాడి చేసినపుడు అంత వరకు సుల్తాన్ ఆదిల్ షా ఆధిపత్యాన్ని అంగీకరించిన నాయక్ పరిపాలకులు సుల్తానుకు ఎదురుతిరిగి (తిరుమల రాయ కాలంలో పోగొట్టుకున్న) బంకాపూర్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమించుకోవడంలో విజయనగర సైన్యాలతో  కలిసిపొయారు.  1586 నుండి 1614 వరకు వేంకటపతి దేవరాయలు పరిపాలన చేశాడు. 1595 తర్వాత అతని రాజ్యం మీద ముస్లిం దండయాత్ర జరిగిన దాఖలా లేదు. శ్రీకృష్ణ దేవరాయలు తన హయాములో ముస్లిం సుల్తానులు ఏటేటా చేసే జీహాద్ దండయాత్రలను ఆపినట్లే వేంకటపతి కూడా తన హయాములో ఆ దండయాత్రలను ఆపించాడు. కాని శ్రీకృష్ణదేవరాయలు ఒక బలమైన సామ్రాజ్యాన్ని పొంది ఆ పునాది మీద ఎదిగితే వేంకటపతి మాత్రం తన సార్వభౌమత్వాన్ని అంగీకరించకుండా కనీస సహకారం కూడా అందించని సామంతులతో కూడిన బలహీన సామ్రాజ్యాన్ని పొందాడు. ఇటువంటి బలహీన పరిస్థితులలో కూడా ఉత్తరాన ఉన్న పొరుగు ముస్లిం రాజ్యాల మీద పైచేయి సాధించగలిగాడు.

సామ్రాజ్య ఏకీకరణ 

తన హయాములో మిగిలిన సమయమంతా తనపై తిరుగుబాటు చేసిన సామంతులను దారికి తెచ్చుకోవడంలో గడిపాడు. మదురై మరియు జింజీ నాయక్ పరిపాలకులను తన సార్వభౌమత్వాన్ని అంగీకరించేలా చేశాడు. వెల్లూరు లింగమ నాయకుడు తిరుగుబాటు చేసినపుడు అతడిని వెల్లూరు కోట నుండి వెళ్ళగొట్టి తన రాజధానిని అక్కడికి మార్చాడు. 1614లొ తాను మరణించేంతవరకు తన సామ్రాజ్యం చెక్కుచెదరకుండా నిర్వహించాడు. కేవలం వేంకటపతి మరణం తరువాత మాత్రమే అడ్డూ అదుపు లేకుండా జరిగిన అంతర్గత పోరు వలన మరోసారి నాయక్ పరిపాలకులు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. ఈ అనైక్యత ఓటమికి దారితీసి చివరికి సామ్రాజ్యం విచ్చిన్నం అయ్యింది.

1600 సంవత్సరానికి ముందు సామ్రాజ్యం వినాశకరమైన విచ్ఛిన్నం దిశగా  పయనిస్తున్నపుడు వేంకటపతి ఒంటిచేత్తో సామ్రాజ్య పరిస్థితిని మార్చేశాడు. దక్షిణ భారతంలో హిందూ సంస్కృతిని రక్షించి నిలబెట్టడంలో వేంకటపతి పరిపాలన పోషించిన పాత్రకు అర్హమైన ప్రాధాన్యతను ఇవ్వకపోవ్వటమే కాదు పూర్తిగా విస్మరించడం కూడా జరిగింది. ఉత్తరభారతంలో జశ్వంత్ సింగ్ వలన ఔరంగజేబు పూర్తిగా హిందూ వ్యతిరేక చర్యలు చేపట్టలేదు. బలమైన హిందూ పరిపాలకుల ప్రాముఖ్యతను సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం జరగలేదు. జశ్వంత్ సింగ్ ఔరంగజేబుకు సామంతుడైనప్పటికీ, అతనొక బలమైన హిందూ పరిపాలకుడిగా పరిగణించబడ్డాడు. హిందువులను అణిచివేస్తే వాళ్ళంతా కలిసి జశ్వంత్ సింగ్ నాయకత్వం కింద చేరతారని భావించిన ఔరంగజేబు జశ్వంత్ సింగ్ మరణించేంత వరకు హిందువుల మీద జిజియా పన్ను విధించడం, హిందూ దేవాలయాలు పడగొట్టడం వంటి పనులు చేయలేదు. జశ్వంత్ సింగ్ మరణించినపుడు ఔరంగజేబు తన దేవుడికి కృతఙ్ఞతలు చెప్పుకున్నాడని వినికిడి. దక్కను పీఠభూమిలో పుంజుకున్న మరాఠా శక్తి రాక వలననే ఈ పుణ్య భారతం ఉన్మత్తుల పరం కాకుండా కాపాడబడింది.

దక్షిణ భారత రక్షకుడు

దక్షిణ భారతం విషయానికి వస్తే, విజయనగర రాజ్యం పూర్తిగా పతనమయ్యుంటే ధర్మాన్ని, ధార్మిక సంస్థలను నిర్మూలించడానికి సుల్తానులకు అడ్డూ అదుపు లేని అవకాశం దొరికి ఉండేది. 1600కి ముందే విజయనగర సామ్రాజ్యం అంతమైపోయి ఉంటే మరొక ప్రముఖ హిందూ శక్తి(మరాఠాలు మరియు శివాజీ) ఉదయించే ముందు సుల్తానులకు ఐదు దశాబ్దాల సమయం దొరికి ఉండేది. కాని వేంకటపతి యొక్క సుదీర్ఘ పరిపాలన ఈ అవకాశం లేకుండా చేసింది. అతని బలమైన పరిపాలన వలన విజయనగర సామ్రాజ్య సంపూర్ణ పతనం నాలుగు దశాబ్దాల పాటు వాయిదా పడింది. 1640లలో విజయనగరం పూర్తిగా అస్తమించే సమయానికి మరాఠాలలో ఛత్రపతి శివాజీ ఎదగడం మొదలవ్వడంతో పాటు ఆయన తండ్రి తన బెంగళూరు జాగీరులో అమితమైన అధికారాన్ని పొందడం మొదలయ్యింది. విజయనగర సామ్రాజ్యం పతనం అవుతున్న సమయంలోనే సరికొత్త హిందూ శక్తి అయిన మరాఠాలు ఉదయించడం మొదలవ్వడంతో నిరంకుశ నియంతృత్వం బారిన పడకుండా హిందువులు కాపాడబడ్డారు. ఆ రకంగా విజయనగర సామ్రాజ్య పూర్తి పతనాన్ని కొన్ని దశాబ్దాల పాటు నివారించడం ద్వారా వేంకటపతి రాయలు దక్షిణ భారత రక్షకుడయ్యాడు. ఈ అరుదైన అమూల్య రత్నం యొక్క విలువని మనలో చాలా మంది సరిగ్గా గ్రహించలేదు.  

దక్షిణ భారత వీర ప్రతాపుడు

ఏ మహమ్మదీయుడి ముందైనా తలవంచడానికి రాణా ప్రతాప సింహ నిరాకరిస్తే, దక్షిణాదిలో వేంకటపతి అటువంటి ప్రకటననే చేశాడు. 17వ శతాబ్దం ఆరంభంలో అక్బర్ సంస్థానం నుండి వచ్చిన రాయబారి చంద్రగిరిలో వేంకటపతిని సందర్శించాడు. అది రాయబార సందర్శన కాదని, విజయనగర సామ్రాజ్య అనుపానాలు కనిపెట్టడానికి ఉద్దేశించిన గూఢాచార చర్య అనే అనుమానం వ్యక్తమయ్యింది. అక్బర్ దక్కన్ సుల్తాన్ రాజ్యాలను ఆక్రమించి విజయనగరం తనకు లొంగిపోయేలా చేస్తాడనే అంచనా ఉండింది. ఈ ఊహకు ప్రత్యుత్తరంగానే “తాను ఏ మహమ్మదీయుడి పాదాన్ని ముద్దాడను” అని వేంకటపతి అన్నాడని నానుడి. ఒక మహమ్మదీయుడి – ఎంత శక్తివంతుడైనా – అధిపత్యాన్ని ఒప్పుకోవడం అటుంచి అక్బర్ సైన్యాలను ఎదుర్కోవడానికి వేంకటపతి యుద్దసన్నద్ధత మొదలుపెట్టాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఈ చివరి గొప్ప చక్రవర్తి – బహుశా మొత్తం విజయనగర చరిత్రలొనే గొప్ప చక్రవర్తి – వేంకటపతి దేవరాయల యొక్క తలవంచని స్పూర్తిని గుర్తుచేస్తూ ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాము. రాణా ప్రతాప్ హిందువుల మనసుల్లో సుస్థిరస్థానం ఏర్పరచుకున్నాడు. కాని ఒక విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించి, మహమ్మదీయులను నిలువరించి తన బిరుదములోనే ‘ప్రతాప ‘ అనే పేరుగల ఈ దక్షిణ భారత వీర ప్రతాపుడుని మాత్రం ఈ ప్రజానీకం మరచిపోయింది.

Vemana Kappa

0 Reviews

Related post

1 Comment

  • chala చాల చక్కగా వివిర్నిచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *