రోడ్డు రవాణా కన్నా రైల్వే భారత దేశానికి ఎంతో మిన్న

 రోడ్డు రవాణా కన్నా రైల్వే భారత దేశానికి ఎంతో మిన్న

రైల్వేలను ఇతర రవాణా వ్యవస్థలతో పోల్చి వాటిని పాత ప్రయాణ సాధనాలుగా ఎన్నడూ భావించకూడదు. రైల్వేలను ఆధునీకరించినప్పుడు అవి రవాణాకు అనివార్యమైన మార్గంగా మారతాయి “

– సోగో షింజి, షింకాన్సేన్(జపనీస్ బుల్లెట్ ట్రైన్) పితామహుడు, 1956

“రైలుతో పోలిస్తే తక్కువ ఖర్చు అయ్యే చోట మాత్రమే రోడ్లు వాడాలి. అవసరమైతే రోడ్డు నిర్మాణానికి ఉద్దేశించిన నిధులను రైల్వేలకు మళ్లించైనా సరే ఆర్థిక రంగాన్ని నడిపించే ప్రధాన సాధనంగా రైల్వేలను భావించి అభివృద్ధి పరచడం తప్పనిసరి”

– కమలేష్ కుమార్, మాజీ అదనపు డైరెక్టర్ జనరల్, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, 2014

రోడ్డు మరియు రైల్వే రవాణా వ్యవస్థలను విస్తృతంగా వినియోగిస్తున్న దేశాల అనుభవాలను వివిధ అంశాల పరంగా పోల్చి చూడడం ద్వారా ఆ రెండింటిలో మనకు ఏది సరైనదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1) ఇంధనం: కార్లు, మోటారుబైక్‌లు మొదలైన వాటిని నడపడానికి సౌదీ వంటి దేశాల నుండి చమురును దిగుమతి చేసుకోవటానికి అపారమైన డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది. తిరిగి ఆ డబ్బునే మన వినాశనానికి అవసరమైన ఆర్థిక సహాయంగా ఆ దేశాలు పంపుతాయి. (“అవిశ్వాసకులను ఊరి తీయడానికి అవసరమైన తాడును అవిశ్వాసకులే మాకు సరఫరా చేస్తారు ” అని వాళ్ళు ఘంటాపథంగా చెప్పుకోవచ్చు). ఇందుకు భిన్నంగా దేశీయంగా ఉత్పత్తి చేయబడిన విద్యుత్తును ఉపయోగించి రైల్వేలను లాభదాయకంగా నడపవచ్చు.ఎలక్ట్రిక్ కార్లు లేదా స్కూటర్లకు అవసరమయ్యే రాయితీలను పన్ను చెల్లింపుదారులు చెల్లించే డబ్బుల నుండే ప్రభుత్వం ఇవ్వవలసి ఉంటుంది. పెట్రోల్ కోసం అరబ్ దేశాలపై ఆధారపడినట్లుగానే  విద్యుత్ వాహనాల తయారీకి అవసరమైన లిథియం కోసం చైనా పై,కోబాల్ట్ కోసం చిలీ లేదా యుద్ధంలో దెబ్బతిన్న డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాల పై ఆధారపడాల్సి ఉంటుంది. కానీ రైళ్లు మాత్రం నదులపై నిర్మించిన విద్యుత్ ప్రాజెక్టుల నుండి  లేదా బొగ్గు ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన విద్యుత్ ఆధారంగా నడుస్తాయి. పైగా వీటిని నడపడానికి రాయితీలు అవసరం లేదు. ఇందుకు జపాన్ రైల్వే వ్యవస్థే ఉదాహరణ.

సమృద్ధిగా చమురు వనరులు ఉన్న అమెరికా కూడా 1970ల ఆయిల్ సంక్షోభ సమయంలో గల్ఫ్ దేశాల బ్లాక్ మెయిల్ ను ఆపలేకపోయింది. అప్పటి నుండి అమెరికాలో విదేశీ చమురుపై ఆధారపడటాన్ని జాతీయ భద్రతా సమస్యగా పరిగణిస్తూ చమురు వినియోగాన్ని తగ్గించడానికి వివిధ ప్రయత్నాలు చేశారు. ఏదేమైనా, ఆ దేశం ఆటోమొబైల్ ఆధారంగా నిర్మించబడినది. వాక్లావ్ స్మిల్ వంటి రచయితల ప్రకారం విదేశీ చమురుపై  నిరంతరం ఆధారపడటానికి ఆటోమొబైల్ ఆధారిత రవాణా వ్యవస్థ ఒక ప్రధాన కారణం. రచయితలు విలియం ఎస్. లిండ్ మరియు పాల్ ఎం. వేరిచ్ కూడా తమ పరిశోధనా పత్రం “శక్తి స్వతంత్రతకు ఒక కన్సర్వేటివ్ సూచన (ఎ కన్సర్వేటివ్ ప్రపోసల్ ఫర్ ఎనెర్జీ ఇండిపెండెన్స్)”లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. జాతీయ భద్రతా కారణాల రీత్యా రోడ్లకు బదులుగా రైల్వేలను ప్రోత్సహించాలని వారు ప్రతిపాదించారు.

1981లో వెలువడిన పీటర్ డ్రక్కర్ యొక్క వ్యాసం “జపాన్ సఫలత వెనుక (బిహైండ్ జపాన్ సక్సెస్)” ప్రకారం, ఆటోమొబైల్స్ మరియు రోడ్లపై జపాన్ ప్రభుత్వం యొక్క అంతర్జాతీయ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ(MITI) యొక్క విధానం ఇలా ఉంది :

జపాన్ లో ఆటోమొబైల్ వినియోగం ఎంత ఎక్కువైతే అంతగా అది తమ వాణిజ్య సమతుల్యతపై, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తమ సంపాదన సామర్థ్యంపై మరియు తమ ఉత్పాదకతపై ప్రతికూల హానికరమైన ప్రభావాన్ని కలిగిస్తుందని MITI దృఢంగా నమ్ముతోంది. జపాన్ ఆటోమొబైల్ పరిశ్రమ ఎంత విజయవంతమైతే జపాన్ పై దాని ఆర్థిక ప్రభావం అంత అధ్వాన్నంగా ఉంటుందని MITI వాదన. జపాన్లో అతి తక్కువగా లభించే రెండు ముడి పదార్థాలు, పెట్రోలియం మరియు ఇనుప ఖనిజం, ఆటోమొబైల్ రవాణా వ్యవస్థ నిర్వహణకు అవసరమని MITI గుర్తించింది. అలానే తమ దేశంలో అతి తక్కువగా ఉన్న వనరులైన ఆహారం పండించే భూమి మరియు పెట్టుబడిని రహదారులకు మరియు రహదారి నిర్మాణానికి మళ్లించడం కూడా దీనికి అవసరం. అందువలన ఆటోమొబైల్ రవాణా వ్యవస్థకు బదులుగా తమ రైల్వే యొక్క సరుకు రవాణా సామర్థ్యాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి భారీ పెట్టుబడులు పెట్టాలన్నది MITI విధానం.

రైల్వే ద్వారా సరుకుల రవాణాకు జపాన్ వారు ఎంత ప్రాధాన్యతన ఇస్తారో గమనించండి. అందుకే జపాన్ వారి JICA సంస్థ యొక్క పాక్షిక  ఆర్ధిక సహకారంతో మన భారతదేశంలో సరుకుల రవాణాకు మాత్రమే ప్రత్యేకంగా ఉపయోగించే రైల్వే కారిడార్ నిర్మాణం మనకు అతి ముఖ్యమైనది. ఈ కారిడార్ నిర్మాణం ప్రయాణీకులను తీసుకుపోయే రైలుమార్గాల నుండి మెల్లగా కదిలే సరుకు రవాణా ప్రక్రియను విడదీసి ప్రయాణీకుల రైలుమార్గాలను వేగవంతం చేయడమే కాకుండా మన ఇంధన దిగుమతులను తగ్గిస్తుంది.

యుద్ధసమయంలో చమురు అత్యంత ముఖ్యమైన వస్తువుగా మారుతుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మిత్రరాజ్యాలన్నీ కలిసి చమురు సరఫరాను నిలిపివేయడమే జపాను అమెరికాపై దాడి చేయాలని నిర్ణయించుకోవడానికి ఒక ప్రధాన కారణం. అమెరికాలో కావాల్సినన్ని చమురు నిక్షేపాలు ఉండటం, జర్మనీకి లేకపోవడమే రెండు ప్రపంచ యుద్ధాలలో మిత్రరాజ్యాల విజయానికి ఒక ప్రధాన కారణం. మనకు దేశీయంగా అవసరానికి తగ్గ చమురు నిక్షేపాలు లేవు.అయినా చమురును భద్రంగా నిల్వ చేయడానికి బదులుగా కార్లు/మోటారుబైక్‌ల వంటి పనికిమాలిన వాటిపై మనం దాన్ని ఖర్చు చేస్తున్నాము.

2) అందరికీ ఉపయోగం: ఏ వయసు వారైనా రైలు/ప్రజా రవాణాను ఉపయోగించుకోవచ్చు. కాని ప్రైవేట్ వాహనాలను ఉపయోగించడానికి ఒక నిర్దిష్టమైన వయసు మరియు సామర్ధ్యం ఉండాలి. 18 ఏళ్లలోపు వారు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్లకు రోడ్డుపై వాహనాలను నడపడానికి అనుమతి ఉండదు. కారు వంటి వ్యక్తిగత వాహనమే ప్రధాన రవాణా  సాధనమైన దేశం అమెరికా. అక్కడ ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలు విరివిగా అందుబాటులో ఉండవు. అందుకే 15 సంవత్సరాల వయస్సు గల పిల్లల్నయినా సరే వారి తల్లిదండ్రులే ప్రతిచోటకు కారులో నడుపుకుని తీసుకెళ్లటం వంటి వింత విషయాలను అక్కడ చూడొచ్చు. మరోవైపు జపాన్ లో 98% విద్యార్థులు నడిచి లేదా సైకిలు ద్వారా పాఠశాలకు వెళ్తారు. ఫోర్డ్ సంస్థ 1950లో విడుదల చేసిన కారు వాణిజ్య ప్రకటనను జపాన్ నిత్యజీవితంతో పోల్చడం ద్వారా మన భారతదేశానికి ఏది సరైన ఎంపిక అనే విషయాన్నీ సులభంగా అర్ధం చేసుకోవచ్చు.

3) భూమి: రైల్వేలకు ప్రధాన రహదారుల కంటే తక్కువ భూమి అవసరం. భారతదేశంతో సహా అనేక దేశాలు దట్టమైన జనాభాను కలిగి ఉండడంతో ఆ దేశాలలో వ్యవసాయ భూమి యొక్క అవసరం చాలా ఉంది. కాబట్టి తక్కువ భూమిని వినియోగించుకునే రవాణా సౌకర్యాలకు ప్రాధాన్యతను ఇవ్వడం ఇటువంటి దేశాలకు అవసరం. దీనికి విరుద్ధంగా అమెరికాలో నిర్జన అరణ్యం మరియు ఖాళీ భూమి విస్తారంగా ఉన్నాయి.అందువల్ల ఆ దేశం తమ భూమి పట్ల అనాగరికమైన మరియు వ్యర్థమైన వైఖరితో వ్యవహరించగలదు. కాని మనం అలా చేయగలమా?

ఆధునిక సింగపూర్ వ్యవస్థాపక పితామహుడు లీ కువాన్ యూ ఈ విధంగా అన్నాడు:

మన తలసరి ఆదాయం ఎంత ఎక్కువగా ఉన్నా ప్రతి ఒక్కరికీ సొంత కారు ఉండకూడదు : మన రోడ్లు జామ్ అవ్వడాన్ని మనం భరించలేమని, అది మన ఆర్థిక వ్యవస్థకు హాని కలిగిస్తుందనే వాస్తవాన్ని మన యువకులు అంగీకరించి తీరాలి. మేము ప్రతి ఒక్కరికి భూమి లేదా బంగ్లా ఇవ్వలేము. దానికి అవసరమైన భూమి మాకు లేదు. కానీ మేము ప్రతి ఒక్కరికీ ఎత్తైన అపార్టుమెంట్లలో అధిక-నాణ్యమైన గృహాలను మరియు అధిక-నాణ్యమైన ప్రజా రవాణాను అందించగలము.

సొంత కార్లకు డిమాండు పెరిగేకొద్దీ ఎన్ని ఫ్లైఓవర్లను నిర్మించినా లేదా రోడ్లను ఎంత వెడల్పుగా చేసినా, అవన్నీ త్వరలోనే నిండిపోతాయని కనుగొన్న తరువాత ఆయన ఈ నిర్ణయానికి వచ్చాడు.

పైన పేర్కొన్నది రహదారుల వరకే పరిమితం. కార్ల ఆధారిత రవాణావ్యవస్థలో రహదారులకు అవసరమైన భూమి ఒక భాగం మాత్రమే. పార్కింగ్ అవసరాల కోసం వెచ్చించవలసిన అపారమైన భూమిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కనీస పార్కింగ్ స్థలాన్ని వదలాలని ఆజ్ఞాపించే ప్రభుత్వ చట్టాల వికృత ప్రభావాలను గురించి కూడా మనం ఆలోచించాలి. ఈ విషయం సారాంశం ఈ వీడియోలో చూడవచ్చు.

భూమి విలువ పెరిగిపోయి తక్కువ ధరలో గృహాలు లేకపోవడం వల్ల శాన్ఫ్రాన్సిస్కో వంటి ప్రదేశాలలో అనేక మంది ప్రజలు నిరాశ్రయులై వీధుల్లో జీవితం గడుపుతున్నారు. అయినప్పటికీ ఎక్కువ మంది ప్రజలు తమ కార్లను పార్కు చేసుకోవడానికి అవసరమైన “ఉచిత”  స్థలాల గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారనే వాస్తవం గురించి ఆలోచించండి!

4) భద్రత: ఇతర వాహనాల ట్రాఫిక్ నుండి వేరుగా ఉన్న ప్రత్యేక ట్రాక్‌లలో రైళ్లు నడుస్తాయి. రోడ్డు ప్రయాణాలతో పోలిస్తే ఇది చాలా సురక్షితం. టోక్యో వంటి విస్తారమైన నగరంలో రోడ్లకు బదులుగా రైళ్లను ఎక్కువగా వాడటం వలన ట్రాఫిక్ సంబంధిత మరణాలు మరియు గాయాలు చాలా తక్కువ. రోడ్డు ప్రయాణాలకు బదులుగా జపనీస్ బుల్లెట్ ట్రైన్ వాడటం ద్వారా వేలాది మరణాలు మరియు గాయాలను నివారించినట్లు అంచనా. 2016 లో మన దేశ ప్రభుత్వ సొంత గణాంకాల ప్రకారం, భారతీయ రోడ్లపై 4,73,050 రోడ్డు ప్రమాదాలు, 4,85,508 గాయాలు మరియు1,51,801 మరణాలు సంభవించాయి.

డ్రైవింగ్‌కు ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలు ఉండి ఉంటే ఈ వ్యక్తులలో ఎంతమంది ఇప్పటికీ సజీవంగా, వికలాంగులు కాకుండా ఉండేవారో ఆలోచించండి?

2017 లో జపాన్‌లో ట్రాఫిక్ మరణాల సంఖ్య 3,694 మాత్రమే. మరో మాటలో చెప్పాలంటే, మన జనాభా జపాన్ కంటే కేవలం 10 రెట్లు అధికంగా ఉన్నప్పటికీ ఆ దేశంతో పోలిస్తే మన దేశంలో దాదాపు 41 రెట్లు ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోయారు. అంతే కాకుండా మన దేశంలో వృద్ధ డ్రైవర్ల (జపాన్లో అనేక మరణాలకు కారణం వృద్ధ డ్రైవర్లే) సంఖ్య మరియు తలసరి కారు యాజమాన్యం చాలా తక్కువ.

కాబట్టి భవిష్యత్తులో మనం కొనసాగించాల్సిన విధానాం ఇదేనా అనే విషయాన్ని పాఠకుల విచక్షణకే వదిలేస్తున్నాను.

5) వ్యాయామం: ఇది వింతగా అనిపించవచ్చు. శారీరక శ్రమకు మరియు ఆరోగ్యానికి, రైళ్లకు సంబంధం ఏమిటి?

రైళ్లు లేదా ప్రజా రవాణా మీ ఇంటి గుమ్మం వరకు రావు. పైపెచ్చు మీరే వాటి వద్దకు వెళ్ళాలి. ప్రజలు తరచూ నడక లేదా సైక్లింగ్ ద్వారా స్టేషన్‌కు చేరుకుంటారు. జపాన్ వంటి విస్తృతమైన రైల్వే రవాణా వ్యవస్థ ఉన్న దేశాలలో (టోక్యో  నగరంలో మీరు ఎక్కడ ఉన్నా 15 నిమిషాల నడకతో చేరుకునేంత సమీపంలోనే రైలు స్టేషన్ ఉంటుంది) నడక ఈ విధంగా రోజువారీ జీవితంలో ఒక భాగం అవుతుంది. అందువలన ప్రత్యేకంగా కారు వేసుకొని జిమ్ కు వెళ్లి ట్రెడ్ మిల్ పై నడవాల్సిన పని ఉండదు.

2002 లెక్కల ప్రకారం 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల సగటు జపనీస్ వ్యక్తి  రోజూ 3 ¾ మైళ్ళు (7,241 అడుగులు) నడిస్తే అమెరికన్లు మాత్రమే రోజు 5608 అడుగులు మాత్రమే నడిచారు. జపాన్‌లో ఊబకాయంతో బాధపడే సంఖ్య చాలా తక్కువగా ఉండటంలో నడక నిస్సందేహంగా  కీలకమైన పాత్ర పోషిస్తుంది.

6) కాలుష్యం: రైళ్లు చాలా తక్కువ శక్తిని వినియోగిస్తాయి. అలాగే, తారురోడ్ల పై వాహనాల రబ్బరు చక్రాలు ఉత్పత్తి చేసే ఘర్షణతో పోలిస్తే రైలు పట్టాలపై ట్రైన్ చక్రాల ద్వారా ఏర్పడే ఘర్షణ చాలా తక్కువ. సరిగ్గా నిర్మించబడని రోడ్లు వందలకొలది ఉన్న భారతదేశంలో రోడ్ల పై నడిచే వాహనాల వలన కలిగే దుమ్మూ, ధూళి ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రధాన విషయం. మామూలుగానే రోడ్డు ప్రయాణం టైర్ల ద్వారా లేచే దుమ్ముతో మరియు భయానక శబ్ద కాలుష్యంతో కూడుకున్నది (మన రోడ్ల మీద హారన్ల శబ్దం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు). భారతీయ నగరాలు నివసించడానికి పనికి రాకుండా తయారవడానికి వాహనాల ద్వారా ఉత్పన్నమయ్యే పొగ ఒక ప్రధాన కారణం. కానీ ఈ సమస్యను పరిష్కరించడానికి బదులుగా సంవత్సరానికి ఒకసారి దీపావళి టపాసులను కాల్చే పిల్లలను బలిపశువులుగా మార్చారు.

7) ఉత్పాదకత: రైలులో ప్రయాణించేప్పుడు చదవడం లేదా ఇతర వీలైన పనులు పూర్తి చేయడానికి వీలవుతుంది. ఇవన్నీ కారు డ్రైవింగ్ చేసేటప్పుడు అసాధ్యం. ట్రైన్లో నిల్చొని ఉన్నా సరే ఈ స్మార్ట్‌ఫోన్‌ల యుగంలో చదవడానికి ఏ సమస్యా ఉండదు. నాకు చదవడానికి అంత సమయం ఎలా దొరుకుతుంది అని ప్రజలు నన్ను ట్విట్టర్‌లో అడిగినప్పుడు, మా ఇంట్లో టీవీగాని, కారుగాని వుండకపోవడమే కారణమని చెబుతుంటాను.నా మాట మీద నమ్మకం లేకపోతే ఒకసారి స్వయంగా ప్రయత్నించి చూడండి. మీ వాహనంలో మీరు గడిపిన సమయాన్ని మరింత ఖచ్చితంగా లెక్కించండి (అనగా పెట్రోల్ బంక్ వద్ద, కారు మరమ్మత్తులు/మైంటెనెన్సు కోసం, డ్రైవర్ లైసెన్స్ పునరుద్ధరణ వంటి వాటి కోసం వెచ్చించే సమయం ఇవన్నీ కలిపి).

8) సామాజిక కేంద్రాలు : జపాన్ లో మాదిరిగా రైలు స్టేషన్లు షాపింగ్, డేకేర్ మరియు అనేక ఇతర సేవలతో సామాజిక వినియోగ  కేంద్రాలుగా ఉపయోగపడతాయి. అదే భూమి రోడ్డుగా మారితే వాహనాల సంఖ్య పెరిగేకొద్దీ అంతవరకు దాని మీద నడిచిన మనుషులకు నడవడానికి వీలు లేని స్థలంగా రూపాంతరం చెందుతుంది.వీధులన్నీ వాహనాలు వేగంగా వెళ్లడానికి మాత్రమే ఉపయోగపడే రోడ్లుగా మారుతాయి. రహదారి విస్తరణ కోసం శతాబ్దాల నాటి పురాతన దేవాలయాలను కూల్చివేసినట్లు మనం తరచుగా వింటుంటాము. ఒకసారి ఆలోచించండి ,మన వీధుల్లో వాహనాలు సంఖ్య విపరీతంగా పెరిగిపోకముందు కొన్ని దశాబ్దాల ముందు నుండీ అక్కడే ఉండి ఎవరికీ సమస్య కాని ఆలయం వాహనాల సంఖ్య పెరిగాక ఎందుకు సమస్య అయ్యింది? ఎవరూ దీని గురించి అడగరూ, ఆలోచించరు.

కొన్ని దశాబ్దాల క్రితం వరకు పిల్లలు పాఠశాలకు నడచి వెళ్లడం, వీధుల్లో ఆడుకోవడం అనేవి తరుచుగా కనిపించే చాలా మామూలు దృశ్యాలు. మరి ఇపుడు ఆ దృశ్యాలు ఎందుకు కనిపించడం లేదో ఆలోచించండి. నిరంతరం తిరిగే వాహనాలు, నిర్లక్ష్యంగా నడిపే డ్రైవర్ల కారణంగా పిల్లల్ని వీధుల్లోకి పంపడానికి ఎవరు ధైర్యం చేస్తారు? కానీ జపాన్లో వీధుల్లో పిల్లలు ఆడుకోవడం ఇప్పటికీ చూడవచ్చు. భారతదేశంతో పోలిస్తే జపాన్ తలసరి ఆదాయం20 రెట్లు అధికం. అయినా అక్కడి వీధులు ఇరుకుగా ఉండి వాహనాలతో కాకుండా పాదచారులతో నిండి ఉంటాయి. “ జపనీస్ నగరాలు ఆధునికీకరణను వ్యతిరేకిస్తాయని” అనేకమంది పాశ్చాత్య పరిశీలకులు వ్యాఖ్యానిస్తుంటారు. కానీ నిజానికి ఒక దేశ జనాభా అధికంగా సొంత వాహనాలను కలిగి ఉండడానికి, ఆ దేశం  “అభివృద్ధి చెందిన” దేశం కావడానికి మధ్యన సంబంధం చాలా తక్కువ. 1980లలో జపనీస్ తలసరి ఆదాయం పశ్చిమ దేశాలతో సమాన స్థాయికి చేరినప్పటికీ యూరప్ మరియు అమెరికాలతో పోల్చితే వారి రహదారి వ్యవస్థ పెద్దగా అభివృద్ధి చెందలేదు. పశ్చిమ దేశాల హైవే రోడ్లతో పోలిస్తే నేటికీ చాలా జపనీస్ హైవేలు భారీ టోల్ చార్జీలు వసూలు చేస్తూ రెండు లేన్లతో ఇరుగ్గా ఉంటాయి.

సామాజిక జీవితం కుంచించుకుపోవడానికి, వాహనాల ట్రాఫిక్ కు మధ్య ఉన్న సంబంధంపై మరింత తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు ఈ అంశంపై డోనాల్డ్ అప్లియార్డ్ చేసిన విస్తృతమైన పరిశోధనలను చూడవచ్చు.

9) వన్యప్రాణులు: ఈ రోజుల్లో చాలా మంది వన్యప్రాణుల సంరక్షణ మరియు ధర్మం బోధించినట్లు ప్రకృతికి అనుగుణంగా జీవించడం తదితరాల గురించి తెగ మాట్లాడుతున్నారు. మరి ఈ మాటలు మాట్లాడేవాళ్ళేవరూ గ్రామీణ ప్రాంతాల మీదుగా వేలాది చెట్లను నరికి 10 లేదా 12 లేన్ల రహదారులను నిర్మించడం గురించి గాని, ప్రతిరోజూ రహదారులపై జరిగే వన్యప్రాణుల మారణహోమాన్ని గురించి గాని ఒక్క మాట మాట్లాడరు. రైల్వే ట్రాక్‌లు భూమిని ప్రభావితం  చేయకుండా సహజంగా ఉంచుతామని, రైళ్ల ద్వారా వన్యప్రాణుల ప్రాణనష్టం బహు తక్కువ అనే విషయం ఎవరికీ పట్టదు. రైళ్లను ఢీకొని మృతి చెందిన  ఏనుగులను గురించిన విషాద వార్తలను అందరూ విని ఉంటారు. కానీ సరిగ్గా పోల్చిచూస్తే రోడ్లు వన్యప్రాణులకు చాలా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే రోడ్లను నిర్మించడానికి చాలా ఎక్కువ చెట్లను కొట్టేయాలి. వ్యక్తిగత వాహనాల వలన లక్షలాది చిన్న చిన్న వన్యప్రాణులు చనిపోతుంటాయి. రైల్వేలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వన్యప్రాణులకు మనం చేసే నష్టాన్ని తగ్గించి మాటలలో కాకుండా చేతలలో ధర్మాన్ని ఆచరించవచ్చు.

10) జాతీయ భద్రతా మౌలిక సదుపాయాలు: వైమానిక శక్తి అభివృద్ధి కారణంగా ఒకప్పుడు యుద్ధంలో రైల్వేలకు ఉన్నంత ప్రాధాన్యత ఇపుడు లేదు. కాని దేశ అంతర్గత భద్రతను నిలబెట్టుకోవడంలో రైల్వేలు ఇప్పటికీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. హైస్పీడ్ రైళ్ల ద్వారా ఆయుధాలతో సన్నద్ధంగా ఉన్న తమ సైనికులను సిన్జియాంగ్ రాష్ట్రానికి తరలించే యుద్ధ సన్నాహక చర్యల ద్వారా తమ రైల్వేల పనితీరును చైనా పరీక్షించింది. తమ చరిత్రలో జరిగిన డంగన్ జిహాద్‌ వంటి తిరుగుబాట్లు పునరావృతం అయినపుడు వాటిని అణిచివేసేందుకు సైనిక దళాలను వేగంగా మోహరించడం ఈ సైనిక సన్నాహా పరీక్షల లక్ష్యం. 2008లో టిబెటన్ తిరుగుబాటును అణిచివేసేందుకు దళాలను వేగంగా మోహరించడానికి వారు ఇప్పటికే రైళ్లను ఉపయోగించారు.

బహుళ అంతర్గత తిరుగుబాట్లను ఎదుర్కొంటున్న దేశంగా భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్ళను ఎదుర్కోవటానికి మనము కూడా సిద్ధం కావాలి.

బహుళ అంతర్గత తిరుగుబాట్లను ఎదుర్కొంటున్న దేశంగా భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్ళను ఎదుర్కోవటానికి మనము కూడా సిద్ధం కావాలి.

రైలు రవాణాకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేదానికి ఇప్పటి వరకు చెప్పినవి కొన్ని కారణాలు మాత్రమే. రైల్వేలను వాడటం ద్వారా పౌరులకు కలిగే వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలను గురించి మనం ఇక్కడ అసలు ప్రస్తావించడం లేదు (మీ వాహనం యొక్క ఇంధనం, మరమ్మత్తు మరియు మైంటెనెన్సు కోసం మీ ఆదాయంలో నుండి మీరు చేసే ఖర్చు ఎంతో లెక్కించండి).

నెదర్లాండ్స్, డెన్మార్క్, నార్వే, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు గతంలో తాము ఎంపిక చేసుకున్న రోడ్డు ఆధారిత రవాణా వ్యవస్థను గురించి పునరాలోచించుకొని మరింత స్థిరమైన రవాణా వ్యవస్థ వైపు తిరిగి అడుగులు వేస్తున్న  తరుణంలో ప్రాచీన గ్రీకు చరిత్రకారుడు పాలిబియస్ తన ఇతిహాసాలు (హిస్టరీస్) లో చెప్పినట్లు “ వారి తప్పులను మనం పునరావృతం చేయకూడదు”:

మనుషులందరూ తమను తాము సంస్కరించుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి వారి స్వంత విఫల ప్రయత్నాల ద్వారా నేర్చుకోవడం లేదా ఇతరుల అనుభవాల ద్వారా నేర్చుకోవడం. ఈ రెండింటిలో మొదటిది ఉత్సాహవంతులను ఆకట్టుకునేదే అయినా రెండవది తక్కువ బాధ కలిగించేది. అందువల్ల మనకు వీలైతే మొదటి పద్ధతిని ఎన్నడూ ఎన్నుకోకూడదు, ఎందుకంటే అది అపాయాలతో మరియు బాధతో కూడుకున్నది. కానీ ఎప్పుడైనా రెండవ మార్గాన్ని ఎంచుకోండి. ఎందుకంటే దాని ద్వారా మనం బాధపడకుండానే ఉత్తమమైనది ఏమిటో తెలుసుకోవచ్చు. దీని గురించి లోతుగా ఆలోచిస్తే మనకు ఒక విషయం అర్ధం అవుతుంది. నిజమైన సంఘటనల యొక్క చరిత్ర నుండి వచ్చే అనుభవాన్ని మన వాస్తవ జీవితానికి పనికి వచ్చే ఉత్తమమైన పాఠాలుగా పరిగణించాలి; ఇది ఒక్కటే మనకు ఎటువంటి హాని కలిగించకుండా ప్రతి సమయానికి, సందర్భానికి తగ్గ ఉత్తమమైన మార్గాన్ని ఎంపిక చేసుకునే సమర్థులుగా మనల్ని తయారుచేస్తుంది.

అదనపు చదువుకు:

జపానీయుల నగర ప్రణాళిక

ఒరిజినల్ ఆర్టికల్

Vemana Kappa

0 Reviews

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *