ఏక్లా చలో రే – డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితం (పార్ట్ I)

 ఏక్లా చలో రే – డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితం (పార్ట్ I)

గత శతాబ్దపు చీకటి క్షణంలో హిందువుల రక్షకుడిగా కీలక పాత్ర పోషించిన శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జీవితాన్ని వర్ణించడానికి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క సుప్రసిద్ధ గీతం ‘ఏక్లా ఛలో రే’ సరిగ్గా సరిపోతుంది. 1938 నుండి తాను మరణించే వరకు హిందూ నాగరికతను, భారతదేశాన్ని రక్షించడానికి ఆయన చేసిన ప్రయాణంలో ఆయన అడుగుల జాడలను ఈ ధారావాహికలో తడిమి చూద్దాం.తన ప్రయత్నాలకు ప్రతిఫలంగా అవమానాలను పొందినా పట్టించుకోకుండా తన పోరాటాన్ని విరమించకుండా అసాధ్యమైన సవాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఒంటి చేత్తో హిందువులకు అశేషమైన ప్రయోజనాన్ని చేకూర్చిపెట్టిన కాలం అది. 

1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా ఠాగూర్ ‘ఏక్లా చలో రే’ అనే పాటను రాశారు. ఒంటరిగా నడవవలసి వచ్చినప్పటికీ సామ్రాజ్యవాద శక్తిని వ్యతిరేకించే కఠినమైన మార్గాన్ని అనుసరించాలని తన తోటి మనుషులకు పిలుపునిచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ మాటలు వ్రాసిన మూడు దశాబ్దాల తరువాత భారత విభజన సమయంలో ఒక బెంగాలీ నాయకుడు ఠాగూర్ సలహాను ఆచరించి చూపాడు. తాను ఎంచుకున్న మార్గం తనను మరణం వైపు తీసుకువెళ్ళినప్పటికీ  తాను నిర్విర్తించవలసిన కర్మను ఎన్నడూ వదిలిపెట్టలేదు. శ్రీకృష్ణుని ప్రసాదం అనే అర్థం వచ్చేలా అతని తల్లిదండ్రులు అతనికి పరిపూర్ణమైన పేరు పెట్టారు. అందుకేనేమో, భగవాన్ శ్రీకృష్ణుడు తన గీతోపదేశంలో వివరించినట్టుగా గెలుపు, ఓటములను పట్టించుకోకుండా (నిష్కామ)కర్మయోగానికి కట్టుబడి నిలబడటం ఆయనకే సాధ్యమయ్యింది. హిందూ నాగరికత పరిరక్షణా విధి పట్ల ఆయనకున్న భక్తి ఎంత గొప్పదంటే ఎన్నికల ఓటమిగానీ, కరువుగానీ, అల్లర్లుగానీ, ప్రధాని నెహ్రూ ఆయన ప్రాణానికి హాని కలుగజేసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని అతని స్నేహితులు మరియు శ్రేయోభిలాషుల చేసిన అభ్యర్థనగానీ ఏదీ తనని ఆపడానికి ఆయన ఒప్పుకోలేదు.ఆయన అధికారాన్ని కోరుకున్నాడు,కానీ అది కేవలం అధికారం చేపట్టాలనే కాంక్షను తీర్చుకోవడానికి కాదు. తాను కట్టుబడిన విలువలను మరియు మన నాగరికత లక్ష్యాలను సాధించడానికే అధికారాన్ని కోరుకున్నాడు. ఆయనకు దేశం, ధర్మం తప్ప మరేమీ ముఖ్యమైనది కాదు. ఈ పుణ్యభూమిలో జన్మించిన ఏ హిందువుకు ధర్మం లేని దేశం అంగీకారయోగ్యం కాదు.

పార్టీ రాజకీయాల్లోకి ప్రవేశం :

బెంగాల్ ప్రెసిడెన్సీలో 1937లో జరిగిన ప్రాంతీయ ఎన్నికలలో ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాకుండా మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించగా రెండూ మరియు మూడవ స్థానాలను ముస్లిం లీగ్ మరియు ఫజలుల్ హక్ యొక్క క్రిషక్ ప్రజా పార్టీ దక్కించుకున్నాయి. క్రిషక్ ప్రజా పార్టీ (కెపిపి) రైతుల పార్టీ. ప్రెసిడెన్సీలో ఉన్న రైతులలో అధికభాగం తూర్పు బెంగాల్ ముస్లింలే కావడం వలన ఆ పార్టీలో వారి ఆధిపత్యం ఉండినప్పటికీ గణనీయమైన సంఖ్యలో హిందూ రైతులు కూడా ఆ పార్టీలో భాగంగా ఉండేవారు.

బెంగాల్ ప్రెసిడెన్సీ యొక్క ప్రధానమంత్రి(ఇప్పుడు ముఖ్యమంత్రికి సమానం) పదవిని చేపట్టాలని ఫజ్లుల్ హక్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ముస్లిం లీగ్ పార్టీలాగా తమది మతతత్వ పార్టీ కానందున అతను మొదటి ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు.ఫజ్లుల్ హక్ ప్రధానిగా ఉండాలనేదే ఈ పొత్తుకు ఉన్న షరతు.ఖిలాఫత్ ఆందోళన తరువాత నుండి తన ప్రజా ఉద్యమానికి ముస్లిం లీగ్ మద్దతు పొందడానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండేది. ముస్లిం లీగ్ విశ్వాసాన్ని గెలవడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ బెంగాల్‌లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బదులు ముస్లిం లీగ్‌ కు ఆ అవకాశం ఇవ్వడం మంచిదని భావించినట్లుంది. అందుకే ఫజ్లుల్ హక్ తెచ్చిన ప్రతిపాదనను బెంగాల్ కాంగ్రెస్ తిరస్కరించింది.దీనితో వేరే మార్గం లేక జిన్నా ఆధ్వర్యంలోని ముస్లిం లీగ్ తో ఫజ్లుల్ హక్ పొత్తు పెట్టుకోవలసి వచ్చింది.

ముస్లిం లీగ్ మరియు కెపిపిల మధ్య కూటమి నిబంధనల ప్రకారం ఫజ్లుల్ హక్ ప్రధానమంత్రి అయ్యాడుగానీ ప్రధాన మంత్రిత్వ శాఖలు ముస్లిం లీగ్‌కే దక్కాయి.ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 60% రిజర్వేషన్లు కల్పించగా పోలీసు బలగాలలో 50% రిజర్వేషన్లు సృష్టించబడ్డాయి.బుర్ద్వాన్ మహారాజా నేతృత్వంలోని కొందరు హిందూ నాయకులు ఈ విధానానికి వ్యతిరేకంగా నిరసన లేఖను బెంగాల్ గవర్నర్ సర్ జాన్ రీడ్ కు పంపారు.కాని గవర్నర్ ఈ విషయమై స్పందించలేదు.

బెంగాల్ ప్రెసిడెన్సీలోని ముస్లిం జనాభాలో రిజర్వేషన్ లక్ష్యాలను చేరుకోవడానికి అర్హత గల పురుషులు తగినంత సంఖ్యలో లేనందున ఈ పోస్టులను భర్తీ చేయడానికి అర్హతగల ముస్లింలను ఇతర ప్రావిన్సుల నుండి తీసుకువచ్చారు.దీనిని బట్టి ముస్లిం లీగ్ యొక్క ప్రాధమిక లక్ష్యం స్థానిక ముస్లిం సమాజం యొక్క అభ్యున్నతి కాదని, ప్రభుత్వ యంత్రాంగం పైన పట్టు సాధించడం మరియు ప్రభుత్వ యంత్రాంగంలో హిందువల సంఖ్యను తగ్గించడమేనని స్పష్టం అవుతోంది.

ఆ సమయంలో బెంగాల్ ప్రావిన్స్ లో రెండు ప్రధాన విశ్వవిద్యాలయాలు ఉండేవి – ఢాకా మరియు కలకత్తా. మొదటి దానిలో ముస్లింలు ఆధిపత్యం చెలాయించగా, రెండవ దానిలో హిందువుల ఆధిపత్యం నడిచేది. కలకత్తా విశ్వవిద్యాలయం ఈ ప్రావిన్స్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అంతేగాక ఆ కాలంలో మొత్తం భారతీయ ఉపఖండంలోనే ఉత్తమమైన విశ్వవిద్యాలయంగా కూడా పరిగణించబడేది. బ్రిటీష్ వ్యతిరేక నిరసనలలో చాలా మంది విద్యార్థులు పాల్గొనడంతో ఈ విశ్వవిద్యాలయం స్వాతంత్ర్య ఉద్యమానికి ఒక వేదికగా ఉండేది. ఈ కారణాల వలన కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క ప్రాధాన్యతను తగ్గించడం బ్రిటిష్ మరియు ముస్లిం లీగ్ రెండింటికీ ఉమ్మడి లక్ష్యంగా మారింది. ప్రావిన్స్ లో విశ్వవిద్యాలయం నిర్వహించే మెట్రిక్యులేషన్ పరీక్ష నుండి ఫీజు రూపంలో వచ్చే ఆదాయమే కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రధాన ఆదాయ వనరు. సెకండరీ ఎడ్యుకేషన్ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ఫీజులను ప్రభుత్వ ఖజానాకు మళ్లించే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం సఫలమయ్యుంటే కలకత్తా విశ్వవిద్యాలయం నిర్వీర్యం అయ్యుండేది. అలాగే, కలకత్తా మునిసిపల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.  ప్రావిన్స్ యొక్క జనాభాలో మత నిష్పత్తి ప్రకారం కలకత్తా మునిసిపల్ కార్పొరేషన్‌లో సీట్లను కేటాయించడమే ఈ బిల్లు యొక్క లక్ష్యం. తద్వారా, నగర జనాభాలో హిందువులు 70%గా ఉన్నప్పటికీ  కార్పొరేషన్‌లో మాత్రం వారిని కేవలం 46% సీట్లకు పరిమితం చేయాలన్నది ఉద్దేశ్యం.

శ్యామా ప్రసాద్ ముఖర్జీ అసెంబ్లీలో స్వతంత్ర సభ్యుడు. రాష్ట్రంలో హిందువులను నిర్వీర్యం చేయడానికి జరుగుతున్న  ప్రయత్నాలను ఆయన గమనిస్తునే ఉన్నారు. ఈ పరిస్థితి గురించి ముఖర్జీ ఈ క్రింది విధంగా చెప్పారు – “..హిందువుల చట్టబద్ధమైన హక్కులను అణిచివేసేందుకు మతవాద హక్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అమలు చేసిన  ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాలతో 1939లో హిందూ అణచివేత కొనసాగుతూనే ఉన్నా, కాంగ్రెస్ హిందువుల ప్రయోజనాలకు ద్రోహం చేయడంతో హిందువుల పరిస్థితి నిరాశాజనకంగా, నిస్సహాయంగా మారింది ”.

అందువలన కాంగ్రెస్ నాయకత్వం నిస్సహాయంగా వదిలేసిన మైనారిటీ హిందువులను రక్షించడానికి కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కోసం ముఖర్జీ ప్రయత్నం చేశారు. ఆయన హిందూ మహాసభలో చేరాడు. కలకత్తా మునిసిపల్ బిల్లుతో పాటు సెకండరీ ఎడ్యుకేషన్ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీవ్రమైన చర్చలకు నాయకత్వం వహించాడు. అప్పటి వరకు రాజకీయ బలవంతం కారణంగా హక్ మంత్రిత్వ శాఖ యొక్క మత విధానాలకు నిస్సహాయంగా మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ మరియు కెపిపి పార్టీలలోని హిందూ శాసనసభ్యులను ఏకం చేసి వారి సహాయంతో అసెంబ్లీలో ఆ రెండు బిల్లులను వీగిపోయేలా చేశారు. తద్వారా ముస్లిం లీగ్‌కు వ్యతిరేకంగా బెంగాల్‌ ప్రావిన్స్ లో హిందూ రాజకీయ యుగం ప్రారంభమైంది. కలకత్తా కార్పొరేషన్ బిల్లు సవరించబడింది. హిందువులు మెజారిటీ సీట్లను నిలుపుకున్నారు. అయితే ముస్లింలు కూడా నగరంలో తమ జనాభాతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో సీట్లు పొందారు.కార్పొరేషన్‌లోని 85 సీట్లలో 47 హిందువులకు కేటాయించారు.

ఫిబ్రవరి 1940 నాటికి, బోస్ మరియు గాంధీల మధ్య విభేదాల కారణంగా భారత జాతీయ కాంగ్రెస్ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్‌ను రద్దు చేసింది. కొత్తగా ఏర్పడిన బెంగాల్ అధికారిక కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు లభించలేదు. సస్పెండ్ చేయబడిన బెంగాల్ కాంగ్రెస్ కమిటీ వారే బెంగాల్ లో కాంగ్రెస్ ఉద్యమానికి ప్రధాన నాయకులుగా కొనసాగారు. ఫార్వర్డ్ బ్లాక్ బోస్ వర్గంగా వీరు గుర్తింపబడ్డారు. 

కలకత్తా కార్పొరేషన్‌లోని మత రాజకీయాలను బోస్ కూడా వ్యతిరేకించారు. కలకత్తా కార్పొరేషన్ ఎన్నికల్లో బోస్ మరియు ముఖర్జీ చేతులు కలిపే ప్రయత్నం జరిగింది. కానీ సీట్ల పంపకంలో తలెత్తిన అభిప్రాయాల బేధాలు పరిష్కరించబడకపోవడంతో శరత్ బోస్ చర్చలను విరమించుకున్నారు. అందువల్ల, ఎన్నికలలో హిందువుల ఐక్య కూటమి సాధ్యం కాలేదు. ప్రచారం సందర్భంగా బోస్ బృందానికి చెందిన మనుషులు హిందూ మహాసభ ర్యాలీలపై దాడి చేశారు.ఆ సందర్భంగా జరిగిన రాళ్ళ దాడి సంఘటనలో ముఖర్జీ గాయపడ్డారు.అయినా ముఖర్జీ తనకు తగిలిన గాయాన్ని పట్టించుకోకుండా ర్యాలీని ఉద్దేశించి తన ప్రసంగాన్ని కొనసాగించి ధైర్యవంతుడైన నాయకుడిగా ఖ్యాతిని పొందాడు.

 1940 మార్చి 22న జరిగిన లాహోర్ సెషన్‌లో ప్రవేశపెట్టిన పాకిస్తాన్ ప్రతిపాదనకు మద్దతు ఇస్తేనే ఫజ్లుల్ హక్ బెంగాల్ ప్రధానిగా కొనసాగనిస్తామని ముస్లిం లీగ్ షరతు విధించడంతో హక్ అందుకు బలవంతంగా ఒప్పుకున్నాడు. 1940 మార్చి 28న నిర్వహించబడిన కలకత్తా మునిసిపల్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందుగానే ఈ పరిణామం జరిగింది. ఆ తర్వాత వెలువడిన ఫలితాలతో కార్పొరేషన్‌పై కాంగ్రెస్ ఆధిపత్యం ముగిసిందనే విషయం తేటతెల్లమైంది – బోస్ గ్రూప్ 21 సీట్లు గెలుచుకోగా, ముఖర్జీ హిందూ మహాసభ 16 సీట్లు గెలుచుకుంది. కార్పొరేషన్‌లో ముస్లిం లీగ్ 18 సీట్లు గెలుచుకుంది. బోస్ హిందువులు మరియు ముస్లింలను చేతులు కలపమని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు – లేకపోతే కార్పొరేషన్ బ్రిటిషర్ల చేతుల్లోకి వెళుతుందనే కారణాన్ని పేర్కొన్నారు. హిందూ మహాసభ (హెచ్‌ఎంఎస్) పార్టీనీ జాతి వ్యతిరేక పార్టీగా విమర్శిస్తూ మునిసిపల్ ఎన్నికలలో జరిగిన అక్రమాలపై (హిందూ మహాసభను లక్ష్యంగా చేసుకుని) విచారణకు పిలుపునిచ్చారు.

ఏప్రిల్ 17,1940వ తేదీన బోస్ ముస్లిం లీగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు (దీనిని బోస్-లీగ్ ఒప్పందం అని పిలుస్తారు).ఈ ఒప్పందం ప్రకారం ముస్లిం లీగ్ కార్పొరేషన్ మేయర్‌ పదవిని చేజిక్కించుకుంది. కార్పొరేషన్ మీద ముస్లిం ఆధిపత్యానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ముఖర్జీ పోరాటం చేసినప్పటికీ, ఊహించని విధంగా జరిగిన బోస్-లీగ్ ఒప్పందం కారణంగా, హిందూ మెజారిటీ నగర మేయర్ పదవి ముస్లిం లీగ్ చేతుల్లోకి చేరింది. బోస్ దీనిని బెంగాల్ రాజకీయాల్లో ‘కొత్త శకం’ అని అభివర్ణించారు. సిఆర్ దాస్ విధానానికి కొనసాగింపుగా ఈ ఒప్పందాన్ని ఆయన సమర్థించుకున్నారు. బెంగాల్ మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోని జాతీయవాద వార్తాపత్రికలు ఈ ఒప్పందాన్ని అపహాస్యం చేశాయి. బోస్ హిందువుల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడని హిందూ మహాసభ ఆరోపించింది. ముస్లిం లీగ్ పాకిస్తాన్ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత కూడా బోస్ ముస్లిం లీగ్‌తో చేతులు కలిపాడాన్ని బట్టి పాకిస్తాన్ తీర్మానాన్ని ఆయన తీవ్రంగా పరిగణించలేదని అర్థం అవుతోంది.

ఈ తీర్మానాన్ని ఆ సమయంలో చాలా మంది నాయకులు తీవ్రంగా పరిగణించలేదు. అయితే భారత్ సేవాశ్రమ్ సంఘ్ వ్యవస్థాపకుడు స్వామి ప్రణవానంద ఈ తీర్మానం వలన బెంగాలీ హిందువులకు తీవ్రమైన పరిణామాలు ఎదురౌతాయని పేర్కొన్నారు. అందువలన హిందూ ప్రజలను మరియు వారి గుర్తింపును కాపాడటానికి అందరూ కలిసి పనిచేయాలని బెంగాల్ హిందూ నాయకులను అభ్యర్థించారు – లేకపోతే సమీప భవిష్యత్తులో హిందువులు మారణహోమాన్ని ఎదుర్కొనే రాష్ట్రంగా బెంగాల్ తయారవుతుందని ఆయన ఊహించారు. ఆయన పిలుపును ఎవరూ పట్టించుకోలేదు. చివరగా, ఆగస్టు 1940 లో, తనను కలవాలని స్వామి ముఖర్జీని పిలిచాడు. జన్మాష్టమి (ఆగస్టు 26, 1940) రోజున ముఖర్జీ అయన్ని కలిశారు. ఆ సందర్భంగానే స్వామి తన మెడలో ఉన్న దండను ముఖర్జీకి ఇచ్చి ఆశీర్వదించారు. సమీప భవిష్యత్తులో ముఖర్జీ బెంగాలీ హిందువుల నాయకుడిగా ఎదుగుతాడని ఆయన తన శిష్యులతో అన్నారు. అదే సంవత్సరంలో, నవరాత్రి మహాష్టమి నాడు, ముఖర్జీ కాశీలో ఉండగా స్వామి ఆయనని ఆశీర్వదించడానికి మళ్ళీ పిలిచాడు. ఎందుకంటే బెంగాల్ హిందువులను రక్షించగల ఏకైక ఆశాజ్యోతి ముఖర్జీ మాత్రమేనని స్వామి అర్థం చేసుకున్నాడు. ఫిబ్రవరి 1941లో స్వామి సమాధి పొందారు.

ముఖర్జీపై స్వామి పెట్టుకున్న నమ్మకం త్వరలోనే నిరూపించబడింది. మార్చి 1941లో హోలీ పండుగ సందర్భంగా ఢాకాలో అల్లర్లు చెలరేగాయి. బుర్కా ధరించిన మహిళపై రంగు నీళ్ళు పడ్డాయని ఆరోపిస్తూ ముస్లింలు హిందువులపై దాడి చేయడంతో ఈ అల్లర్లు మొదలయ్యాయి. వేలాది హిందూ గృహాలు దెబ్బతినడంతో పాటు మరిన్ని వేలాది హిందూ గృహాలు దగ్థమైపోయాయి.ఢాకాలోని మసీదులపై హిందువులు దాడి చేసి అపవిత్రం చేశారనే తప్పుడు పుకార్లను ప్రోత్సహించడం ద్వారా ముస్లిం లీగ్ అల్లర్లకు మద్దతు ఇచ్చింది. డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ కింద పత్రికలు అల్లర్ల గురించి సమాచారాన్ని సేకరించకుండా నిషేధించారు.డక్కా నవాబ్ కలకత్తా నుండి డక్కాకు ఒక ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో వెళ్లారు – హిందూ వ్యతిరేక మారణహోమాన్ని ప్లాన్ చేయడానికి మరియు అమలు చేయడానికి అతని ప్యాలెస్‌ను ముస్లిం లీగ్ ఉపయోగించుకుంది. ఈ విషయం తెలుసుకున్న ముఖర్జీ తన స్నేహితుడు లోహియా నడపగా ఒక చిన్న ప్రైవేట్ విమానంలో డక్కాకు వెళ్లాడు. డక్కాలో ఆయన నవాబ్ ప్యాలెస్ ను సందర్శించి వెంటనే మారణహోమాన్ని ఆపాలని వారిని హెచ్చరించాడు. అప్పట్లో డాక్కా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా ఉన్న ఆర్‌సి మజుందార్ ఇంట్లో బస చేసిన ముఖర్జీ అల్లర్ల కారణంగా హిందువులు తీవ్రంగా ప్రభావితమైన  డాక్కా సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు పర్యటించారు. హిందూ మహాసభ ద్వారా కలకత్తా నుండి సహాయ బృందాలను ఏర్పాట్లు చేశాడు. 3000 మంది హిందువులు ఢాకాలో జరిగిన మారణహోమం నుండి తప్పించుకోవడానికి త్రిపుర రాజ్యానికి పారిపోయారు. ముఖర్జీ వ్యక్తిగతంగా అగర్తాలాను సందర్శించి హిందూ శరణార్థుల పట్ల త్రిపుర మహారాజు చూపిన ఔదార్యానికిగాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

బెంగాల్‌లో హిందువులు అణచివేతకు గురైనప్పుడు – కాంగ్రెస్ హిందూ నాయకుల నుండిగానీ లేదా మరే ఇతర సహాయంగానీ లభించనపుడు – ముఖర్జీ ఒకడే నిటారుగా నిలబడి హిందువుల కోసం ఒంటరిగా పోరాడారు. తన భద్రత కోసం ఎటువంటి భయం లేకుండా హిందువులను రక్షించే భారాన్ని స్వయంగా నెత్తికెత్తుకున్నాడు. బెంగాల్ లోని ఇతర హిందూ నాయకుల నుండి పెద్దగా మద్దతు లేని తరుణంలో కూడా ఒంటరి యోధుడిగా ఆయన హిందూ హితార్థం ఎలా కృషి చేశారో రాబోయే వ్యాసాలలో చూద్దాం.

(Note: The original English version of the article authored by Ravilochanan G can be found here)

Vemana Kappa

0 Reviews

Related post

1 Comment

  • Why misunderstood takes place between Bose and Mukherjee? If they hold the hands strongly then east bengal wouldn’t be partitioned.
    Whom i think like great personality (BOSE) they are the reason for Hindu genocide in Bengal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *