ఏక్లా చలో రే – డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితం (పార్ట్ II)

 ఏక్లా చలో రే – డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితం (పార్ట్ II)

ఈ ధారావాహిక యొక్క మునుపటి వ్యాసంలో , బెంగాలీ హిందువులు అన్ని ఆశలు కోల్పోయినట్లు అనిపించిన సమయంలో బెంగాల్ ముస్లిం లీగ్ ప్రభుత్వం యొక్క హిందూ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏకైక హిందూ నాయకుడిగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆవిర్భవించడాన్ని మనం చూశాము. ఈ వ్యాసంలో, హిందూ వ్యతిరేక ముస్లిం లీగ్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు డాక్టర్ ముఖర్జీ చేసిన ప్రయత్నాలను, దానితోపాటు క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన పాల్గొనకపోవడాన్ని మనం పరిశీలిద్దాం. కాంగ్రెస్ మరియు ఇతర లౌకిక రాజకీయ నాయకులు ముఖర్జీని విమర్శించడానికి దీనిని ఒక ప్రధాన అంశంగా ఉపయోగించుకున్నారు.

1941 మార్చి నాటి ఢాకా అల్లర్లలో ముస్లిం లీగ్ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన అప్రకటిత మద్దతు ఒక విషయాన్ని స్పష్టం చేసింది. లౌకిక వాతావరణాన్ని కొనసాగించేందుకు ముస్లింలను అభివృద్ధి చేసే పేరుతో ముస్లింలీగ్ ప్రభుత్వం కొనసాగిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలను ప్రోత్సహించడం డాక్టర్ ముఖర్జీ ఊహించిన విధంగా హిందువుల వినాశనానికి దారితీస్తుందని స్పష్టమయింది. అప్పటివరకు లీగ్ యొక్క వివక్ష విధానాలకు మౌన సాక్ష్యులుగా నిలిచిన కాంగ్రెస్, క్రిషక్ ప్రజా పార్టీ హిందూ నాయకులు, బెంగాల్‌లో ముస్లిం లీగ్ ప్రభుత్వం అధికారంలో ఉండడం యొక్క తీవ్రమైన పరిణామాలను అర్థం చేసుకున్నారు. ఈ విషయంలో మనసు మార్చుకున్న ఒక ముఖ్యమైన వ్యక్తి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు నేతాజీ సోదరుడు శరత్ చంద్రబోస్. 

డాక్టర్ ముఖర్జీ మరియు హిందూ మహాసభలు ఒక సమాంతర రాజకీయ శక్తిగా ఎదగకుండా నిరోధించడానికి మాత్రమే ముస్లిం లీగ్ వంటి మత విషం నిండిన పార్టీని తాను ప్రోత్సహించడం ఎంతటి తప్పో శరత్ చంద్రబోస్ గ్రహించారు. 1940 కలకత్తా మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత తన సోదరుడు సుభాష్ చంద్రబోస్ ముస్లిం లీగ్‌తో కుదుర్చుకున్న పొత్తును తెగదెంపులు చేసుకున్న శరత్ బోస్ ముస్లిం లీగ్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీతో చేతులు కలిపారు. బెంగాల్ యొక్క ఇద్దరు పెద్ద రాజకీయ నాయకుల మధ్యన కుదిరిన ఈ కూటమి ఫలితంగా, 1941 చివరి భాగంలో లీగ్ ప్రభుత్వం గద్దెదించబడింది.

లీగ్ ప్రభుత్వాన్ని దించడానికి, అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభ్యులను తమ జాతీయ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కొత్త ప్రభుత్వంలో చేరడానికి ఒప్పించే పనిని శరత్ చంద్రబోస్కు అప్పగించారు. అదే సమయంలో, క్రిషక్ ప్రజా పార్టీ మరియు ఇతర చిన్న పార్టీల శాసనసభ్యులను సమీకరించే పనిని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీకి ఇచ్చారు. మునుపటి వ్యాసంలో చెప్పినట్లుగా, ఫజలుల్ హక్ అన్నిటికంటే ఎక్కువగా ప్రధాన మంత్రి పదవిని కోరుకున్నాడు. అందువల్ల, ముస్లింలీగ్ యొక్క మతపరమైన విధానాల ద్వారా తన క్రిషక్ ప్రజా పార్టీ (వాస్తవానికి హిందూ మరియు ముస్లిం రైతుల పార్టీ) యొక్క ఓటు బ్యాంకుకు రాజకీయ నష్టం ఉన్నప్పటికీ, అతను తన ప్రధాని పదవిని నిలబెట్టుకోవడానికి అన్ని విషయాలు పట్ల మౌనం వహించాడు. ఆ సమయంలో ఆ పార్టీకి ఫజలుల్ హక్ కాకుండా వేరే ప్రభావవంతమైన ముఖం లేనందున క్రిషక్ ప్రజా పార్టీ మద్దతు పొందడం కోసం ఫజలుల్ హక్ మద్దతు పొందడం చాలా ముఖ్యం అని ముఖర్జీ అర్థం చేసుకున్నారు. అందువల్ల, ఫజలుల్ హక్ ఆధ్వర్యంలో హెచ్‌ఎంఎస్, కాంగ్రెస్, కెపిపి మరియు ఇతర చిన్న పార్టీల ప్రతినిధులతో కొత్త లీగ్ వ్యతిరేక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శరత్ చంద్రబోస్‌ను ఒప్పించడం ద్వారా ఆయన ఒక అద్భుతం చేశాడనే చెప్పాలి.

ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ముస్లిం లీగ్‌కు చెందిన ఫజ్లుల్ హక్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడని పేర్కొంటూ ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రస్తుతమున్న చాలా మంది ప్రసిద్ధ చరిత్రకారులు డాక్టర్ ముఖర్జీపై విమర్శల దాడి చేశారు. ఈ చరిత్రకారులు చరిత్రను సరిగ్గా చదవలేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఆ కాలపు రికార్డులను బట్టి డాక్టర్ ముఖర్జీ ముస్లింలీగ్‌కు వ్యతిరేకంగా క్రిషక్ ప్రజా పార్టీతో చేతులు కలిపినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల డాక్టర్ ముఖర్జీ యొక్క ఈ చర్య యొక్క ప్రాముఖ్యతను హిందువులు గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ముస్లింలీగ్‌కు వ్యతిరేకంగా హిందువులందరూ మొదటిసారిగా ఒకే గొడుగు కింద తమను తాము ఏర్పాటు చేసుకోవడంలో ఈ చర్య సహాయపడింది.

విప్లవకారుల (ప్రధానంగా బెంగాలీ హిందువులు) ఎదుగుదలను నివారించడానికి ముస్లింలీగ్‌తో చేతులు కలిపిన బ్రిటిష్ పాలక వ్యవస్థ ఈ సంకీర్ణాన్ని ప్రకటించినప్పటి నుండి దానిని చెడగొట్టడానికి గట్టిగా ప్రయత్నించింది. శరత్ చంద్రబోస్ లేకపోతే కాంగ్రెస్ ప్రతినిధులు సంకీర్ణం నుండి వైదొలగవచ్చని భావించిన బ్రిటిష్ వారు కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన శరత్ చంద్రబోస్ ను జైలు పాలు చేశారు. ఏమి జరిగినా కూటమిని చెక్కుచెదరకుండా ఉంచడానికి అన్ని రకాల సవాళ్లను ఒంటరిగా ఎదుర్కోవడానికి డాక్టర్ ముఖర్జీ సిద్ధంగానే ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు శరత్ చంద్రబోస్ లేకపోయినా సంకీర్ణ ప్రభుత్వం కొనసాగేలా ఆయన భరోసా ఇవ్వడమే కాకుండా, ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, మంత్రివర్గంలో హిందువుల గొంతుగా మారారు. హిందువుల ఆందోళనలకు స్వరం ఇవ్వడంలో ఆయన కీలక పాత్ర పోషించడంతో పాటు,సంకీర్ణాన్ని విచ్ఛిన్నం చేయడానికి బ్రిటిష్ పాలకులు చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడం మరియు కేబినెట్‌లో తాను మంత్రిగా ఉన్న ఒక సంవత్సరం వ్యవధిలో అంతకు మునుపు ముస్లింలీగ్ ప్రభుత్వం చేసిన అణచివేత విధానాలను మార్చడానికి ఆయన చేసిన ప్రయత్నాలను గమనించిన బెంగాల్ ప్రజలు ఫజలుల్ హక్ యొక్క ఈ కొత్త మంత్రి వర్గాన్ని ‘శ్యామా-హక్ మంత్రి వర్గం’ అని పిలిచారు.

బ్రిటిష్ పరిపాలకులు మరియు సంకీర్ణ భాగస్వాముల నుండి ఎదుర్కొంటున్న అవరోధాలే కాకుండా క్విట్ ఇండియా ఉద్యమంలో భారీ సవాలును కూడా డాక్టర్ ముఖర్జీ ఎదుర్కోవలసి వచ్చింది. 1942 ప్రారంభ నెలల్లో సింగపూర్‌ను ఆక్రమించిన తరువాత భారతదేశం వైపు వస్తున్న జపనీయుల పట్ల “శత్రువు యొక్క శత్రువు స్నేహితుడు అవుతాడు” అనే వ్యూహాన్ని అవలంబించడం గురించి డాక్టర్ ముఖర్జీకి నమ్మకం లేదు. 26 జూలై 1942న గవర్నర్‌ హెర్బర్ట్ కు ఆయన రాసిన లేఖ నుండి ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.ఆ లేఖలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు, ” బ్రిటిష్ వారు వదిలి వెళ్లాలని భారతీయులు కోరుకుంటున్నప్పటికీ, అది యుద్ధం ముగిసే వరకు వేచి ఉండగలదు, ఎందుకంటే మీ స్థానాన్ని జపనీయులు తీసుకోవాలని మేము ఖచ్చితంగా కోరుకోవడం లేదు”. జపనీస్ దండయాత్ర యొక్క ఉద్దేశ్యాలపై ఈ అనుమానం మరియు బ్యూరోక్రసీలో బ్రిటిష్-ముస్లింలీగ్ పరిపాలన యొక్క విష కలయిక గురించిన ఆందోళన రెండూ కలిపి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న హిందువులపై బ్రిటీష్ పరిపాలకులు క్రూరమైన ప్రతీకారం తీర్చుకుంటారనే భయాన్ని హిందూ మహాసభ మరియు డాక్టర్ ముఖర్జీ ఇద్దరిలో రేకెత్తించింది. డాక్టర్ ముఖర్జీ అప్పటికే ముస్లింలీగ్ యొక్క దురాగతాల పట్ల కాంగ్రెస్ యొక్క నిర్లక్ష్యాన్ని చూశాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనేవారిని కాంగ్రెస్ పార్టీ వారి కర్మకు వారిని వదిలేస్తుంది ఆయనకు ఖచ్చితంగా తెలుసు. క్రిప్స్ మిషన్ సందర్భంగా విభజన విషయంపై ముస్లిం లీగ్ ప్రతినిధులను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ నాయకులు సంశయించిన తీరును చూసిన తరువాత ఆయన భయాలు మరింత పెరిగాయి. చివరికి, ఆయన భయాలు నిజమయ్యాయి. కానీ చరిత్రకారులు దీనిని సౌకర్యవంతంగా విస్మరించారు మరియు దాని ఫలితంగా, ఏ ప్రణాళిక లేకుండా సాగిన అనవసరమైన క్విట్ ఇండియా ఉద్యమంలో డాక్టర్ ముఖర్జీ పాల్గొనకపోవడాన్ని వారు ఈనాటికి కూడా తప్పు పడుతుంటారు.

దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న హిందువులను అణచివేయడానికి మంత్రులను బైపాస్ చేసి గవర్నర్ మరియు (అంతకు మునుపు ముస్లింలీగ్ ప్రభుత్వం యొక్క మత ప్రాతినిధ్య పథకం కింద చేసిన నియామకాల ఫలితంగా ముస్లింలీగ్ మద్దతుదారులే అధికంగా ఉన్న) బ్యూరోక్రసీ ద్వారా బెంగాల్‌ను నడపాలని బ్రిటిష్ వారు కోరుకుంటున్నారని క్విట్ ఇండియా ఉద్యమ సమయానికి స్పష్టమైపోయింది. బ్యూరోక్రసీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, గవర్నర్‌ను బహిరంగంగా ఎదుర్కోవడం వంటి వివిధ వ్యూహాలను ఉపయోగించడం ద్వారా ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి డాక్టర్ ముఖర్జీ తన వంతు ప్రయత్నం చేసారు, అయినప్పటికీ, అది బ్రిటిష్ వారి వైఖరిలో పెద్ద తేడాను తీసుకురాలేదు. మిడ్నాపూర్ జిల్లాలోని హిందూ-మెజారిటీ కొంటాయ్ పట్టణంలో తుఫాను వలన వచ్చిన వరదలను ప్రభుత్వ బ్యూరోక్రసీ ఉద్దేశపూర్వకంగా అసమర్థంగా నిర్వహించడం వారి పట్ల డాక్టర్ ముఖర్జీలో ఉన్న అసౌకర్య భావనను పరాకాష్టకు చేర్చింది.

క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న హిందువులపై బ్రిటిష్ ప్రభుత్వం యొక్క క్రూరమైన చర్యలకు వ్యతిరేకంగా 1942 ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో డాక్టర్ ముఖర్జీ వైస్రాయ్ లిన్లిత్గో మరియు గవర్నర్ హెర్బర్ట్‌లకు లేఖ రాశారు. ఈ విషయంలో వైస్రాయ్ యొక్క ఉదాసీనమైన సమాధానం చూసి డాక్టర్ ముఖర్జీ కేబినెట్ నుండి రాజీనామా చేసే అవకాశాలను పరిగణనలోకి తీసుకున్నారు. పరిపాలనలో బ్రిటిష్ వారి ప్రత్యక్ష జోక్యం ప్రారంభమైన తరువాత కాలంలో బెంగాల్ లో హిందువుల ప్రయోజనాలు కాపాడేందుకు ఆర్థిక మంత్రి పదవి ఆయనకు పెద్దగా ఉపయోగపడలేదు. కానీ అక్టోబర్ 16, 1942 నాటి సంఘటన డాక్టర్ ముఖర్జీ వెంటనే కేబినెట్‌కు రాజీనామా చేసేలా పురికొల్పి ఆపైన అణచివేతదారులైన బ్రిటిష్ వారికి మరియు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా హిందువుల ప్రయోజనాల కోసం స్వతంత్రంగా పనిచేయడానికి కారణమైంది. 

క్విట్ ఇండియా ఉద్యమం ప్రకటించిన తరువాత, మిడ్నాపూర్ హిందువులు అన్ని రకాలుగా తిరుగుబాటు చేశారు. దీనికి ప్రతీకారంగా జిల్లా పరిపాలన వ్యవస్థలోని ఇద్దరు ముస్లిం అధికారుల నేతృత్వంలో ఘోరమైన అణచివేతను బ్రిటిష్ వారు కొనసాగించారు.మిడ్నాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ నియాజ్ మొహమ్మద్ ఖాన్, సబ్ డివిజనల్ ఆఫీసర్ వజీర్ అలీ షేక్ లు భారతదేశం యొక్క విభజన ద్వారా ముస్లిం పాకిస్తాన్ ను సృష్టించాలనే ఆలోచనకు ఆకర్షితులైనవారు. అందువల్ల భారతదేశం నుండి ఇస్లామిక్ దేశాన్ని సృష్టించాలనే ఈ ఉద్దేశ్యాన్ని సాధించడానికి ముస్లిం లీగ్ సూచించిన విధంగా వారిద్దరూ బ్రిటిష్ వారిని పూర్తిగా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఫలితంగా, భారత స్వాతంత్ర్యం కోసం చెలరేగిన ఈ హిందూ తిరుగుబాటును హింసాత్మకంగా అణిచివేసేందుకు వారు నిశ్చయించుకున్నారు. దానికి అనుగుణంగానే ముస్లింలీగ్ మద్దతుదారులైన ఈ ఉన్నతాధికారులు స్వాతంత్ర్యం కోసం పిలుపునిచ్చిన స్వాతంత్య్ర సమరయోధులను జైలులో పెట్టకుండా వారిని చంపడం మరియు అత్యాచారం చేయడం ద్వారా శిక్షించారు. గాంధీ మాటలు విని క్విట్ ఇండియా ఉద్యమంలో పెద్ద సంఖ్యలో చేరిన హిందువులకు పాఠం నేర్పడానికి ఈ ముస్లిం అధికారులకు అవసరమైన సహాయం అందించడానికి బ్రిటిష్ పరిపాలన కూడా సిద్ధంగా ఉండింది. తత్ఫలితంగా, ఈ అధికారులు మిడ్నాపూర్‌లోని కొన్ని హిందూ ప్రాంతాలపై బాంబులు వేయాలని చేసిన సూచనను కూడా బ్రిటిష్ గవర్నర్ అంగీకరించి సెప్టెంబర్ 29, 1942న బాంబు దాడులు జరిపించారు.

ఈ ముస్లిం అధికారుల దురాగతాలు ఇక్కడితో ఆగలేదు. మిడ్నాపూర్ లోని హిందూ ఆధిపత్య తమ్లుక్ & కొంటై ఉపవిభాగ ప్రాంతాలను ఒక భయంకరమైన తుఫాను సమీపిస్తున్నప్పుడు అక్కడి ప్రజలను అప్రమత్తం చేయలేదు. పాకిస్తాన్ సాధించాలనే తమ ఉద్యమానికి అడ్డంకిగా వ్యవహరిస్తున్న ఈ హిందూ కాఫీర్లను తుఫాన్ గురించి అప్రమత్తం చేయాల్సిన అవసరం తమకు లేదని ఈ ముస్లిం అధికారులు భావించారు. అందువల్ల దుర్గా పూజ యొక్క అష్టమి రోజు (బెంగాలీ హిందువుల అతిపెద్ద పండుగ) కూడా అయిన 1942 అక్టోబర్ 16 తేదీన తుఫాను పట్టణాన్ని తాకినప్పుడు కొంటై పట్టణంలో వీధులు ప్రజలతో నిండి ఉన్నాయి. 

సాధారణంగా సంవత్సరంలో ఈ సమయంలో తుఫాను వస్తుందని ఊహించని హిందువులు తుఫాను దెబ్బకు పూర్తిగా బలైపోయారు. తుఫాను తెచ్చిన మొదటి 15 నిమిషాల వరదలో 30000 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు పట్టణం మొత్తం 5 అడుగుల నీటిలో మునిగిపోయింది. ముస్లిం పౌర అధికారుల పాలనలో ఉన్న జిల్లాలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందున ఆ రోజు వేల సంఖ్యలో హిందువులు ఎటువంటి హెచ్చరిక లేకుండా ప్రాణాలు కోల్పోయారు.

ఆ సమయంలో కలకత్తాలో చిక్కుకుపోయిన ప్రావిన్స్ మంత్రులకు మరియు ప్రజా ప్రతినిధులకు మిడ్నాపూర్లో జరిగిన ఈ వినాశనం గురించి చాలా రోజుల పాటు సమాచారం అందకుండా చేశారు. ఈ సంఘటన గురించి డాక్టర్ ముఖర్జీకి తెలియగానే వెంటనే మంత్రివర్గానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి మిడ్నాపూర్‌కు వెళ్లారు. ఏదేమైనా, అప్పటి కాంగ్రెస్ రాజకీయ నాయకులు ఈ సంఘటన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు – ఎందుకంటే తమ నాయకులు ముస్లింలీగ్ పట్ల తటస్థ వైఖరితో వ్యవహరించేలా పార్టీ యొక్క అగ్ర నాయకత్వం జాగ్రత్త పడింది. చరిత్రకారులు కూడా ఈ సంఘటనను సౌకర్యవంతంగా విస్మరించి వారి లౌకికవాదం యొక్క భ్రమలలో బ్రతుకుతుంటారు. అయితే, ఈ సంఘటన డాక్టర్ ముఖర్జీ యొక్క నిర్ణయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఆయన దృష్టిలో, రాజకీయాలు మరియు అధికారం అనేవి హిందువుల ప్రయోజనానికి ఉపయోగపడే సాధనాలు మాత్రమే. తాను కేబినెట్ సభ్యుడిని అయినప్పటికీ బెంగాల్ హిందువులకు సహాయం చేయడానికి ఒక మంత్రిగా తాను చేసే ప్రయత్నాలను బ్రిటిష్ పరిపాలకులు చెల్లనివ్వరని గ్రహించిన క్షణంలోనే ఆయన ఆ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ నాయకులు బ్రిటిష్ వారి ఈ వైఖరిపై మౌనంగా ఉన్నందున, ఈ సంఘటన తరువాత కూడా ఆయన మంత్రిగా కొనసాగితే కూడా ఆయనను ప్రశ్నించే సాహసం ఎవరూ చేయరు. కానీ డాక్టర్ ముఖర్జీకి, అధికారం కంటే లక్ష్యం చాలా ముఖ్యమైనది. మొత్తం కేబినెట్‌లో హిందువుల కోసమే రాజీనామా చేసిన ఏకైక సభ్యుడిని తానొక్కడే అయినా ఆయన ఒక్క సెకను కూడా వెనుకడుగు వేయలేదు. లక్ష్యం / భావజాలం యొక్క కొన్ని మూల అంశాల విషయంలో రాజీ పడినా పర్వాలేదు గానీ రాజకీయ అధికారాన్ని సంపాదించడం మరియు కొనసాగించడం అన్నింటికన్నా ముఖ్యమైనది అని చెప్పుకునే వారందరికీ అతని జీవితంలోని ఈ సంఘటన కనువిప్పుగా పనిచేస్తుంది. ఒట్టి అధికారం కంటే భావజాలం / లక్ష్యం ఎల్లప్పుడూ ఆయనకి చాలా ముఖ్యమైనవి – ఇదే ఆయనని ఆ కాలపు బెంగాలీలలో గొప్ప హిందూ నాయకుడిగా ఎదగడానికి దారితీసింది.

Vemana Kappa

0 Reviews

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *